నెయ్యి పేరుకుపోకుండా ఉండలంటే మీగడ కట్టేటప్పుడు కొద్దిగా నీళ్లు చల్లాలి.
అల్లం ముక్కలు ఎండబెట్టి టీలో వేస్తే ఆ టీ ఎంతో రుచిగా ఉంటుంది.
పూరీలు వేగించేటప్పుడు తెల్లగా ఉండాలంటే వేడి నూనెలో నాలుగైదు జామ ఆకులు వేయాలి.
దోశె, పకోడీ, జంతికలు లాంటివి చేసేటప్పుడు ఆ పిండిలో కొద్దిగా పాలు వేసి కలపాలి. ఆ తర్వాత పిండిలో ఉప్పు కలపాలి. ఇలా చేస్తే అవి ఎంతో రుచిగా ఉంటాయి.
ఎక్కువ ప్రమాణంలో వెల్లుల్లిపాయల పొట్టుతీయాల్సి వచ్చినపుడు వాటిని ఐదునిమషాలు గోరువెచ్చని నీటిలో నానబెట్టి తర్వాత పొడి బట్టతో తుడిస్తే వాటి పొట్టు సులభంగా వచ్చేస్తుంది.
కత్తిపీటకు ఉప్పు రాస్తే పదునుగా అవుతుంది.
బ్రెడ్ ప్యాకెట్ లో బంగాళాదుంప ముక్కలు ఉంచితే ఆ బ్రెడ్ తొందరగా పాడవదు.
గాలిచొరబడని గాజుసీసాలో బాదం పప్పులు పోసి ఫ్రిజ్ లోపెడితే అవి వాసన రావు. పురుగుపట్టవు. ఎంతో తాజాగా కూడా ఉంటాయి.
పాల గిన్నె అడుగున మందంగా పేరుకున్నట్టు ఉండకుండా ఉండాలంటే పాలు కాచే ముందర అందులో కొన్ని నీళ్లు పోసి ఐదు నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత ఆ నీళ్లను ఒపేసి అందులో పాలు పోసి కాచాలి. ఇలా చేయడం వల్ల పాలగిన్నె అడుగున మందంగా పేరుకుపోకుండా ఉండడంతో పాటు
గిన్నెను శుభ్రం చేసుకోవడం కూడా ఎంతో సులువవుతుంది.
పుణుగులు వంటివి ఆయిల్ పీల్చకుండా ఉండాలంటే పుణుగుల పిండిలో ఒకటి లేదా రెండు స్పూన్ల బియ్యప్పిండిని కలిపితే చాలు. అవి నూనె పీల్చవు.
యాలకులు ఫైన్ పౌడర్ లా రావాలంటే కొద్దిగా షుగర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి.
నిమ్మకాయలు కొన్ని రోజులు అయిన తర్వాత నల్లగా ఎండినట్టు అవుతాయి. ఇలా అవకుండా అవి తాజాగా ఉండాలంటే ఒక పేపర్ లో వాటిని చుట్టి జిప్ లాక్ కవర్ లో పెట్టి ఫ్రిజ్ లో ఉంచితే చాలాకాలం తాజాగా ఉంటాయి.
ఉల్లిపాయలు కట్ చేస్తుంటే కళ్లల్లోంచి నీళ్లు వస్తాయి కదా. అలా రాకుండా ఉండాలంటే ఉల్లిపాయ పైపొట్టు తీసి వాటిని పదిహేను నించి ఇరవై నిమిషాల దాకా నీళ్లల్లో వేసి ఆ తర్వాత కట్ చేసుకోవాలి.
ఉల్లిపాయలు, వెల్లుల్లి, క్యాబేజీ, కాలిఫ్లవర్ వంటి వాటిని కట్ చేసినపుడు వాటి వాసన చేతులకు అంటిపెట్టుకుని ఉంటుంది. ఆ గాఢమైన వాసన పోవాలంటే చేతులో కొద్దిగా బేకింగ్ సోడా వేసుకుని కొంచెంసేపు శుభ్రంగా రుద్దికడిగితే చేతులకు అంటిపెట్టుకుని ఉన్న ఆ వాసన పోతుంది. అలా కాకుండా నీళ్లల్లో ఒక టీస్పూను వెనిగర్ లేదా నిమ్మరసం వేసి బాగా కలిపి ఆ నీటిలో చేతులు ముంచి కడుక్కున్నా కూడా చేతులకు అంటిన ఉల్లి, ఇతర వాటి గాఢమైన వాసన పోతుంది.
బటర్ ముక్కను ఫ్రిజ్ నించి తీసిన వెంటనే బ్రెడ్ పై పూయడానికి సాధ్యపడదు కాబట్టి కొన్ని వేడినీళ్లు కాచి వాటిని గాజు గ్లాసులో పోసి వెంటనే ఆ నీటిని వంపేసి వేడిగా ఉన్న ఆ గ్లాసును బట్టర్ ముక్కపై బోర్లించి కాసేపు ఉంచాలి. ఇలా చేస్తే గట్టిగా ఉన్న బటర్ మెత్తగా అవుతుంది. అప్పుడు దాన్ని బ్రెడ్ పై పూయడం సులభం అవుతుంది.
రెండు రోజులకు బ్రెడ్ గట్టిగా అవుతుంది. అలాంటప్పుడు దానిపై కొద్దిగా నీళ్లు పోసి మైక్రోవొవెన్ లో పదిసెకన్లు పెట్టి తీస్తే బ్రెడ్ మెత్తగా, మ్రుదువుగా అవుతుంది.
కూరగాయలు తరిగే ఛాపింగ్ బోర్డు తరచూ వాడుతుంటాం కాబట్టి రంగు వెలుస్తుంది. అలాంటప్పుడు వంటల్లో వాడుకునే ఉప్పు దానిపై చల్లి నిమ్మ డిప్పతో దాన్ని బాగా రుద్ది ఐదు నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో కడిగితే ఛాపింగ్ బోర్డు ఎంతో క్లీన్ గా తయారవుతుంది.
వెల్లుల్లిపాయల ఘాటు కూరల్లో తక్కువగా ఉండాలనుకునేవాళ్లు వాటిని సన్నగా ముక్కలుగా చేసి కూరల్లో వేసుకోవాలి. వెల్లుల్లి ఘాటూ బాగా కావాలనుకునేవాళ్లు ముక్కలు చేసిన వెల్లుల్లిపాయలపై చాకుతో గట్టిగా వొత్తి వంటపదార్థాల్లో వేస్తే వెల్లుల్లి వాసన బాగా వస్తుంది.