శరీరంలో తలెత్తే రకరకాల బాధల నుంచి సాంత్వన కలిగించే వంటింటి మందులు కొన్ని ఉన్నాయి. ఇవి సహజసిద్ధమైనవి. ఎలాంటి సైడ్ ఎఫెక్టులు వీటివల్ల కలగవు. మీకు బాగా తలనొప్పిగా ఉందనుకోండి అల్లం టీ తాగితే మంచి ప్రభావం కనిపిస్తుంది. అల్లం టీతో తలనొప్పి తగ్గడమే కాదు వికారం పోతుంది. కాళ్లకు, చేతులకు, శరీరంలోని ఏవైనా భాగాలకు దెబ్బ తగిలినా పసుపు రాస్తే ఇన్ఫెక్షన్ల బారిన పడము. అంతేకాదు గాయాలు కూడా తొందరగా మానతాయి. అలాగే నిద్రలేమితో బాధపడేవారు జాజికాయ పొడిని వాడితే మంచి ఫలితం కనిపిస్తుంది. పంటి పోటు బాధ భరించడం చాలా కష్టం. దాని నుంచి లవంగం మనకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. ఇందులో యుజినాల్ అనే పదార్థం ఉంటుంది. ఇది సహజసిద్ధమైన యాంటిబయొటిక్. నొప్పిని తగ్గించడంలో ఎంతో శక్తివంతంగా ఇది పనిచేస్తుంది.
అలాగే నోటి దుర్వాసనతో బాధపడుతుంటే దాల్చిన చెక్క దాన్ని తగ్గిస్తుంది. నోటిలోని బాక్టీరియా కారణంగానే నోరు దుర్వాసన వస్తుంది. ఆ బాక్టీరియాను చంపేయడంలో దాల్చినచెక్క ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. జీలకర్ర శరీర బరువును తగ్గించడంలో ఎంతో బాగా పనిచేస్తుంది. శరీరంలోని కాలరీలను కరిగించడంతో పాటు జీర్ణక్రియ వేగంగా జరిగేలా దోహదపడుతుంది. జీర్ణశక్తిని బాగా మెరుగుపరుస్తుంది. జుట్టు రాలిపోతుంటే మెంతులు వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఇవి జుట్టు రాలకుండా బాగా పనిచేస్తాయి. అంతేకాదు వెంట్రుకలు పలచబడకుండా కాపాడతాయి. దగ్గు, జలుబు ఉంటే మిరియాలు కొన్ని దంచి పొడిగా చేసి అందులో ఒక టీస్పూను తేనె కలిపి తాగాలి. ఇలా చేస్తే జలుబు, దగ్గుల నుంచి ఉపశమనం లభిస్తుంది.