Homeహెల్త్Lactation science: లాబ్స్‌కు అందని లాక్టేషన్ సైన్స్.. సృష్టిలోని అద్భుతమైన జీవ రసాయన ప్రయోగశాల

Lactation science: లాబ్స్‌కు అందని లాక్టేషన్ సైన్స్.. సృష్టిలోని అద్భుతమైన జీవ రసాయన ప్రయోగశాల

Lactation science eludes laboratories: తల్లి హృదయమే! నవమాసాలు దేహంలో భాగంగా పెరిగిన శిశువు, పసితనపు అడుగుల్లోకి అడుగుపెట్టే వేళ. అమృతాన్ని మించిన అద్భుతం ‘అమ్మ పాలు’. అది కేవలం శిశువు ఆకలి తీర్చే ద్రవాహారం కాదు. ప్రకృతి సిద్ధంగా డిజైన్‌ చేసిన సంపూర్ణ బయోలాజికల్‌ సిస్టం. బిడ్డ ఆరోగ్యానికి తొలి శ్రీరామరక్షగా, భవిష్యత్తులో ఎదిగే మేధస్సుకు ఇంధనంగా, రోగనిరోధక శక్తికి మూలస్తంభంగా నిలిచే ఈ మాతృక్షీరం వెనుక ఉన్న విజ్ఞాన తృష్ణ అపరిమితం. తల్లి పాల వారోత్సవాల సందర్భంగా ఆ పవిత్ర శ్వేతధారల వెనుక దాగివున్న ప్రకృతి రహస్యాలను, అద్భుతమైన సైంటిఫిక్‌ విశేషాల గురించి అందరికీ అవగాహన ఉండడం అవసరం.

- Advertisement -

సృష్టిలో ఏ జీవికైనా జన్మనివ్వడం ఒక వంతైతే, ఆ జీవిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచడం మరొక ఎత్తు. అందుకే ప్రకృతి ప్రతి తల్లికి ఒక అపురూపమైన వరమిచ్చింది. అదే ‘అమ్మ పాలు’. నవమాసాలు మోసి, నొప్పులు భరించి కన్న బిడ్డ నోటికి అందించే తొలి పాలు కేవలం ఆకలిని తీర్చే ఆహారం మాత్రమే కాదు. అది అమృతం, బిడ్డ ఆరోగ్యానికి మొట్ట మొదటి రామరక్ష! ప్రతి ఏటా ఆగస్టు 1 నుండి 7 వరకు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే “తల్లి పాల వారోత్సవాలు” మాతృమూర్తి ప్రేమ ప్రాధాన్యతను, చనుబాల గొప్పదనాన్ని సమాజానికి మరొకసారి గుర్తుచేస్తాయి.

రోగనిరోధక శక్తికి మూలాలు..

బిడ్డ జన్మించిన వెంటనే వచ్చే చిక్కటి పసుపు రంగు పాలను ‘ముర్రుపాలు’ అంటారు. ఈ కొలెస్ట్రం బిడ్డకు అమృతం వంటిది. వీటిని ఎట్టి పరిస్థితుల్లో వృధా చెయ్యకూడదు. ఈ ముర్రుపాలే బిడ్డకు లభించే తొలి వ్యాధినిరోధక టీకా గా చెప్పవచ్చు. వీటిలో ‘ఇమ్యునోగ్లోబులిన్స్’ అధికంగా ఉంటాయి. బిడ్డ జీర్ణ వ్యవస్థను దృఢంగా మార్చి, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. తల్లి పాలు పోషకాల గని. బిడ్డ శరీర ఎదుగుదలకు కావలసిన ప్రొటీన్లు, విటమిన్లు, కొవ్వులు, నీళ్లు అన్నీ సరిగ్గా ఏ నిష్పత్తిలో ఉండాలో ఆ ప్రకారంగా ప్రకృతి అమర్చిన దివ్యౌషధం అమ్మ పాలు.

తల్లికీ కొండంత రక్షణ!

చనుబాలు ఇవ్వడం వల్ల కేవలం బిడ్డ ఆరోగ్యానికి మాత్రమే కాదు, తల్లికి కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. ప్రసవానంతరం పిల్లలకు పాలు ఇవ్వడం వల్ల గర్భాశయం త్వరగా సాధారణ స్థితికి వస్తుంది. రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. ప్రసవానంతర ఒత్తిడి తగ్గి, మానసికంగా ప్రశాంతత లభిస్తుంది.

అనుబంధాల వంతెన

తల్లి పాలు ఇవ్వడం అనేది కేవలం పోషణకు సంబంధించిన ప్రక్రియ మాత్రమే కాదు. అది తల్లికి, బిడ్డకు మధ్య ఏర్పడే ఒక అపూర్వమైన అనుబంధం. పాలు ఇచ్చే సమయంలో బిడ్డ స్పర్శ, తల్లి గుండె చప్పుడు. పాపాయికి కొండంత ధైర్యాన్ని, సురక్షితమైన భావాన్ని అందిస్తాయి. తల్లిపాలు తాగి, తల్లితో సమయం గడిపిన బిడ్డ జీవితంలో భావోద్వేగ స్థిరత్వానికి అక్కడే పునాది పడుతుంది. పసి పిల్లల్లో నిరోధక వ్యవస్థ చాలా బలహీనంగా ఉంటుంది. న్యుమోనియా, డయేరియా వంటి ప్రమాదకర వ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి ఉంటుంది. తల్లి పాలు ఈ ప్రమాదాల నుంచి రక్షణ అందిస్తాయి. భవిష్యత్తులో స్థూలకాయం, మధుమేహం వంటి సమస్యలు ప్రమాదం తగ్గుతుంది. బిడ్డ మేధో వికాసం మెరుగవుతుంది.

సమాజానికీ బాధ్యత

మారుతున్న జీవనశైలి, ఉద్యోగాలు, సరైన అవగాహన లేకపోవడం, ఫార్మూలా మిల్క్ ప్రకటనల ప్రభావం వల్ల చాలా మంది పిల్లలు తల్లిపాలకు దూరమవుతున్నారు. శిశువు పుట్టిన మొదటి ఆరు నెలలు కేవలం తల్లి పాలు మాత్రమే ఇవ్వాలి. నీళ్ళు కూడా ఇవ్వనవసరం లేదు. ఆ తర్వాత సరైన అనుబంధ ఆహారంతో పాటు కనీసం రెండేళ్ల వరకు తల్లి పాలు ఇవ్వగలిగితే చాలా మంచిది. తల్లి పాలు ఇవ్వడం అనేది కేవలం ఒక తల్లి బాధ్యత మాత్రమే కాదు. ఇది కుటుంబం, సమాజం కలిసి నెరవేర్చాల్సిన బాధ్యత. ఇంట్లో కుటుంబ సభ్యులు తల్లికి మానసిక ప్రశాంతతను, పౌష్టికాహారాన్ని అందించాలి. అప్పుడే తల్లిదగ్గర తగినన్ని పాలు ఉత్పత్తి అవుతాయి. కార్యాలయాల్లో, పబ్లిక్ ప్లేస్ లలో పాలు ఇచ్చేందుకు అనుకూలమైన వాతావరణం, లాక్టేషన్ రూముల వంటి సౌకర్యాలు కల్పించాలి. “అమ్మ పాలు పోసి పెంచిన ప్రేమకు వెల కట్టలేం.” అమృతంతో సమానమైన తల్లి పాలను బిడ్డకు అందించడం ప్రతి తల్లి ప్రాథమిక బాధ్యత. ఆ హక్కును బిడ్డకు దక్కేలా చూడటం మనందరి బాధ్యత! ఈ ‘తల్లి పాల వారోత్సవాల’ సందర్భంగా తల్లి పాల ప్రాధాన్యతను చాటిచెబుదాం. ఆరోగ్యకరమైన భవిష్యత్ తరాన్ని తయారుచేసుకుందాం!

శిశువు తొలి టీకా తల్లిపాలే

తల్లిపాలు శిశువులో జీర్ణవ్యవస్థ అభివృద్ధికి, మెదడు ఎదుగుదలకు, శారీరక వికాసానికి దోహదపడటమే కాకుండా న్యుమోనియా, విరేచనాలు, అలర్జీలు వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అలాగే తల్లికి కూడా తల్లిపాలివ్వడం వల్ల ప్రసవానంతర రక్తస్రావం తగ్గడం, గర్భాశయం త్వరగా సాధారణ స్థితికి చేరుకోవడం, రొమ్ము, అండాశయ క్యాన్సర్ల ప్రమాదం తగ్గడం వంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు.

వరల్డ్ బ్రెస్ట్‌ఫీడింగ్ వీక్: ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుండి 7 వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తారు.

తొలి టీకా..

పుట్టిన గంటలోనే అందించే పసుపు రంగు పాలు (కొలస్ట్రం) శిశువుకు తొలి వ్యాధి నిరోధక కవచంగా పనిచేసి అంటువ్యాధుల నుండి కాపాడుతాయి. మొదటి 6 నెలల పాటు శిశువుకు నీరు లేదా ఇతర ఆహారాలు ఇవ్వకుండా కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఆ తర్వాత తగిన ఘనాహారంతో పాటు రెండేళ్ల వరకు పాలు కొనసాగించడం మంచిది.

ఆరోగ్య ప్రయోజనాలు

శిశువుకు జీర్ణవ్యవస్థ, మెదడు శారీరక వికాసానికి తోడ్పడుతుంది. న్యుమోనియా, విరేచనాలు, అలర్జీల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మరోవైపు, తల్లికి ప్రసవానంతర రక్తస్రావం తగ్గుతుంది, గర్భాశయం సాధారణ స్థితికి వస్తుంది, రొమ్ము, అండాశయ క్యాన్సర్ల ప్రమాదం తగ్గుతుంది. ఇక, ఉద్యోగంలో ఉండే తల్లులకు అనుకూలమైన వాతావరణం కల్పించడానికి ఆఫీసులలో ప్రసూతి సెలవులు, ప్రత్యేక తల్లిపాల గదులు, శిశు సంరక్షణ విధానాలు ఉండాలి. ఆరోగ్యవంతమైన సమాజానికి తల్లిపాలే బలమైన పునాది.

డాక్టర్ ఫణి జ్యోత్స్న
కన్సల్టెంట్ అబ్స్ స్ట్రిక్స్ అండ్ గైనకాలజిస్ట్
అపోలో హాస్పిటల్స్

… భవాని

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News