lung cancer in non-smokers : పొగతాగే అలవాటు లేదు కదా, మనకు లంగ్ క్యాన్సర్ ఎందుకొస్తుందిలే అని ధీమాగా ఉన్నారా..? అయితే మీరు పప్పులో కాలేసినట్లే! పైకి ఎలాంటి లక్షణాలు చూపించకుండా, లోలోపలే ప్రాణాలు హరించే ఈ ‘నిశ్శబ్ద హంతకి’ గురించి కొన్ని షాకింగ్ నిజాలు మీకోసం. ప్రపంచవ్యాప్తంగా ఏటా 18 లక్షల మందిని బలి తీసుకుంటున్న ఈ మహమ్మారిని తొలిదశలో గుర్తించడం ఎందుకు అంత కష్టం..? అసలు పొగతాగని వారికి కూడా ఇది ఎందుకు వస్తుంది..? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే..!
రొమ్ము క్యాన్సర్ వంటి వాటిలో కణితులు బయటకు కనిపించడం వల్ల ముందుగా గుర్తించే అవకాశం ఉంటుంది. కానీ, ఊపిరితిత్తుల క్యాన్సర్ అలా కాదు. వ్యాధి బాగా ముదిరిపోయే వరకు తన ఉనికిని చాటదు. అందుకే వైద్య నిపుణులు దీనిని ‘నిశ్శబ్ద హంతకి’గా అభివర్ణిస్తారు.
తొలిదశలో లక్షణాలు ఎందుకు కనిపించవు : ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను ముందుగా పసిగట్టలేకపోవడానికి అనేక కారణాలున్నాయి.
నొప్పి తెలియదు: మన ఊపిరితిత్తులలో నొప్పిని గుర్తించే నరాల (pain receptors) సంఖ్య చాలా తక్కువ. దీనివల్ల లోపల క్యాన్సర్ కణితి ఎంత పెద్దగా పెరుగుతున్నా, అది పక్కన ఉన్న భాగాలకు వ్యాపించే వరకు నొప్పి తెలియదని ‘మెడ్‌లైన్‌ప్లస్’ (Medlineplus) అధ్యయనాలు చెబుతున్నాయి.
సాధారణ జబ్బులుగా పొరపాటు: ఒకవేళ దగ్గు, ఆయాసం, ఛాతీలో నొప్పి, నిస్సత్తువ వంటి లక్షణాలు కనిపించినా, వాటిని చాలామంది సాధారణ జలుబు, బ్రాంకైటిస్, లేదా ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలుగా పొరపడతారు. సరైన రోగనిర్ధారణ జరిగేసరికి క్యాన్సర్ బాగా ముదిరిపోతుంది.
నెమ్మదిగా వ్యాప్తి: అడినోకార్సినోమా వంటి కొన్ని రకాల లంగ్ క్యాన్సర్‌లు చాలా నెమ్మదిగా వృద్ధి చెందుతాయి. దీనివల్ల లక్షణాలు బయటపడటానికి ఏళ్లు పట్టవచ్చు.
పొగతాగని వారికీ ముప్పు తప్పదు : లంగ్ క్యాన్సర్ అనగానే చాలామందికి సిగరెట్లు, బీడీలు కాల్చేవారే గుర్తుకొస్తారు. ఇది నిజమే అయినా, పూర్తిగా వాస్తవం కాదు.
షాకింగ్ నిజాలు: ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతున్న వారిలో దాదాపు 20% మంది జీవితంలో ఒక్కసారి కూడా పొగతాగని వారేనని ‘క్లీవ్‌ల్యాండ్ క్లినిక్’ (Clevelandclinic) అధ్యయనంలో తేలింది.
పరోక్ష ధూమపానం (Secondhand Smoke): ధూమపానం చేసేవారు వదిలే పొగను పీల్చడం కూడా ప్రత్యక్ష ధూమపానంతో సమానంగా ప్రమాదకరం.
పర్యావరణ కారకాలు: రాడాన్ (ఒక రకమైన రేడియోధార్మిక వాయువు), ఆస్‌బెస్టాస్, యురేనియం, డీజిల్ పొగ, సిలికా, బొగ్గు ఉత్పత్తులతో పాటుగా గాలి కాలుష్యం వంటివి కూడా పొగతాగని వారిలో లంగ్ క్యాన్సర్‌కు ప్రధాన కారణాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ల వలె, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను ముందుగా గుర్తించడానికి విస్తృతమైన స్క్రీనింగ్ పరీక్షలు అందుబాటులో లేకపోవడం కూడా ఇది ముదిరిపోవడానికి ఒక కారణం. కాబట్టి, దీర్ఘకాలంగా తగ్గని దగ్గు, ఆయాసం, గొంతు బొంగురుపోవడం, కారణం లేకుండా బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.


