Make Every Day a Good Day with Eggs: ‘సండే అయినా, మండే అయినా…’ అనే ప్రసిద్ధ నినాదం కేవలం ప్రచారం కాదు, సంపూర్ణ ఆరోగ్యానికి మార్గదర్శకం. తక్కువ ఖర్చుతో అత్యధిక పోషకాలను అందించే ఆహార పదార్థాల్లో కోడిగుడ్డు అగ్రస్థానంలో నిలుస్తుంది. విటమిన్ సి, బి3 తప్ప శరీరానికి కావలసిన సమస్త విటమిన్లు, ప్రొటీన్లు, ఖనిజాలు ఇందులో సమృద్ధిగా లభిస్తాయి. బరువు నియంత్రణ, ఎముకల బలం, జ్ఞాపకశక్తి పెరుగుదల నుంచి రోగనిరోధక శక్తి దాకా గుడ్డు అందించే బహుళ ప్రయోజనాలు, పచ్చసొనపై ఉన్న అపోహలకు సంబంధించిన న్యూట్రిషనిస్టుల వాస్తవ విశ్లేషణ. కార్బోహైడ్రేట్లను తగ్గించి, ప్రొటీన్ పరిమాణాన్ని పెంచుకోవాలనుకునే వారికి గుడ్డు అత్యంత చవకైన, నాణ్యమైన పోషకాహారం. తెల్లసొన మాత్రమే తిని పచ్చసొనను పక్కన పెట్టేయడం ఒక పెద్ద అపోహ మాత్రమేనని, గుడ్డును పూర్తిగా తినడమే ఆరోగ్యకరమని న్యూట్రిషనిస్టులు స్పష్టం చేస్తున్నారు.
పోషకాల గని
గుడ్డులో విటమిన్ సి, విటమిన్ బి3 తప్ప శరీరానికి అవసరమైన మిగతా అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. రోజువారీ ఆహారంలో దీనిని చేర్చుకోవడం వల్ల లభించే ముఖ్య ప్రయోజనాలు
కండరాల పుష్టి
గుడ్డులోని ప్రొటీన్ కండరాలు, ఎముకలను దృఢపరుస్తుంది. బ్రేక్‌ఫాస్ట్‍లో గుడ్డు తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలిగి, రోజులో తీసుకునే ఇతర ఆహార పరిమాణం తగ్గుతుంది. ఇది కేలరీల వినియోగాన్ని తగ్గించి బరువు పెరగకుండా నిరోధిస్తుంది.
ఫిట్‌నెస్ వర్కవుట్ స్నాక్
సిక్స్ ప్యాక్ లేదా ఫిట్‌నెస్ సాధించాలనుకునే వారికి, క్రీడాకారులకు వర్కవుట్ తర్వాత తీసుకునే ఉత్తమమైన స్నాక్ గుడ్డు. పిల్లల శారీరక ఎదుగుదలకు కూడా ఇది ఎంతో అవసరం.
బ్లడ్ షుగర్ బ్యాలెన్స్
రెండు భోజనాల మధ్య సమయం ఎక్కువైనప్పుడు జంక్ ఫుడ్ లేదా ప్రాసెస్డ్ స్నాక్స్ తింటే గ్లూకోజ్ పెరిగిపోతుంది. దానికి ప్రత్యామ్నాయంగా గుడ్డు తింటే ఆకలి తీరడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి.
ఎముకల బలానికి విటమిన్ డి
గుడ్డులో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. రోజువారీ అవసరమయ్యే విటమిన్ డి లో 29 శాతాన్ని కేవలం రెండు గుడ్ల ద్వారా పొందవచ్చు.
కంటి చూపు, జ్ఞాపకశక్తి
ఇందులో ఉండే కొలైన్ అనే యాంటీఆక్సిడెంట్ మతిమరుపును నివారిస్తుంది. అలాగే ల్యూటిన్, జియాక్సథిన్ పోషకాలు వయసుతో పాటు వచ్చే చూపు సమస్యలను (మాక్యులర్ డీజనరేషన్) అరికడతాయి.
రోగనిరోధక శక్తి
విటమిన్లు ఎ, డి, ఈలతో పాటు జింక్, సెలెనియం, ఐరన్ వంటి ఖనిజాలు గుడ్డులో సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో యాంటీబాడీల ఉత్పత్తిని పెంచి ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తాయి.
కొలెస్ట్రాల్ భయాలు నిజమేనా?
గుడ్డు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందనే ప్రచారంలో పూర్తి నిజం లేదు. ఆహారంలో ఉండే కొలెస్ట్రాల్ వల్ల మాత్రమే రక్తంలో కొలెస్ట్రాల్ పెరగదని, దానికి అనేక ఇతర అంశాలు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. కొలెస్ట్రాల్ పెంచే ఇతర అసంతృప్త కొవ్వులను తగ్గించి, పరిమితికి లోబడి ప్రతిరోజూ గుడ్డు తినడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు.
ఎలా తిన్నా రుచే!
ఉడకబెట్టిన గుడ్డు, ఆమ్లెట్, స్క్రాంబుల్డ్ ఎగ్స్, టమోటా లేదా పుట్టగొడుగులతో కలిపి బ్రెడ్ టోస్ట్… ఇలా ఏ రూపంలో తీసుకున్నా గుడ్డు రుచితో పాటు పరిపూర్ణ ఆరోగ్యానికీ హామీ ఇస్తుంది.

