Friday, November 22, 2024
Homeహెల్త్Mangoes: మామిడి పండుతో బరువు పెరుగుతారా?

Mangoes: మామిడి పండుతో బరువు పెరుగుతారా?

వేసవి అనగానే మామిడిపళ్ల విందే విందు. పళ్లల్లో కింగ్ మామిడి. అలాంటి మామిడి పండును తింటే బరువు పెరుగుతామని చాలామంది భయపడుతుంటారు. ఇది ఎంతవరకూ నిజం? అందరూ ఈ పండును తినొచ్చా? అయితే ఈ సందేహాలు కేవలం అపోహేనంటున్నారు కొందరు పోషకాహారనిపుణులు. మామిడిపండు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. కొన్ని సమయాల్లో బరువు తగ్గడానికి కూడా ఈ పండును ఉపయోగించవచ్చంటున్నారు. ఇందులోని ఫ్యాటనింగ్ గుణాల కారణంగా దీన్ని వినియోగించేటప్పుడు కొన్ని విషయాలను మరవకూడదంటున్నారు. ఈ పండును మితంగా తింటే పొందే లాభాలు ఎన్నో అని చెపుతున్నారు. ఈ పండును ఎంత పరిమాణంలో తింటున్నామన్నది ముఖ్యమని చెప్తున్నారు. అలాగే ఎక్కువ మామిడిపండ్లు, అరటి పండ్లు తింటే బరువు పెరుగుతారనే సందేహం అర్థలేనిదని ధైర్యం చెబుతున్నారు. బరువు పెరగడం అనేది ఎక్కువ కాలరీలు తీసుకుని దాన్ని కరిగించకపోవడం వల్ల తలెత్తే సమస్య అని స్పష్టంచేస్తున్నారు. మామిడిపండులో కాలరీల తీవ్రత తక్కువగా ఉంటుంది. పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయని కూడా పోషకాహారనిపుణులు చెప్తున్నారు.

- Advertisement -

ఈ పండులో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండడం వల్ల తొందరగా ఆకలి వేయదు. చిరుతిళ్లు తినాలని అనిపించదు అని అంటున్నారు. మామిడిపళ్లల్లో నేచురల్ షుగర్ ఉంటుందని, శరీరం దాన్ని సులభంగా ప్రాసెస్ చేయగలుగుతుందని చెప్తున్నారు. మామిడిపళ్లల్లోని పీచుపదార్థం బ్లడ్ షుగర్ ప్రమాణాలను క్రమబద్ధీకరిస్తూ ఆరోగ్యకరమైన బరువు ఉండేలా చేస్తుందని వివరిస్తున్నారు. మామిడిపండులోని పీచుపదార్థాలు శరీరానికి అందాలంటే మామిడిపండు జ్యూసు కాకుండా ఆ పండుముక్కలు మాత్రమే తినాలని సూచిస్తున్నారు. అన్ని రకాల పండ్లు, కూరగాయలు ‘సూపర్ ఫుడ్స్’ అని పోషకాహార నిపుణులు భరోసా ఇస్తున్నారు. భోజనం తర్వాత మామిడి పండు తినడం వల్ల బరువు పెరుగుతారు కాబట్టి అలా తినొద్దని చెప్తున్నారు. మామిడిపండు ముక్కలను భోజనానికి కొద్దిసేపు ముందు అంటే మధ్యాహ్నం స్నాక్ లా లేదా సాయంకాలం స్నాక్ లా తింటే మంచిదని సూచిస్తున్నారు. ముఖ్యంగా వెయిట్ లాస్ డైట్ లో ఉన్నవారు మామిడిపండును అలాగే తినాలని చెప్తున్నారు. మామిడిపండ్లు నేచురల్ ఎనర్జీని శరీరానికి అందిస్తాయని భరోసా ఇస్తున్నారు. అయితే మామిడిపండును మితమైన పరిమాణంలో తినాలన్న విషయాన్ని కూడా మరొవొద్దని చెప్తున్నారు. మామిడిపండ్లలో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉండి శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుందంటున్నారు. వీటిల్లోని విటమిన్ సి వల్ల జబ్బుల బారిన తొందరగా పడమని చెప్తున్నారు. ఈ పండులో విటమిన్ ఎ ఉందని, ఇది కంటిచూపుకు ఎంతో మంచిదని గుర్తుచేస్తున్నారు. అలాగే గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతుందని చెప్తున్నారు. ఈ పండులోని పీచుపదార్థాల వల్ల జీర్ణక్రియ బాగా జరిగి శరీరం బలంగా, ఉల్లాసంగా ఉంటుందంటున్నారు. మరి మామిడిపండా మజాకా…అంటున్నారు…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News