మునగాకులో ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయి. అంతేకాదు మునగాకు హెయిర్ మాస్క్ తలకు పెట్టుకోవడం వల్ల వెంట్రుకలు కూడా బాగా పెరుగుతాయట. చుండ్రు సమస్య తగ్గుతుందిట. అలాంటి ఆరోగ్యకరమైన మునగ మాస్కు మీకూ తలకు రాసుకోవాలని ఉంది కదూ. అదెలా చేయాలంటే పది మందార ఆకులు, పది జామాకులు, గుప్పెడు మునగాకులు తీసుకుని వాటిని శుభ్రంగా నీటితో కడగాలి. తర్వాత మిక్సీ జార్ లో వాటిని వేసి కాస్త నీటిని అందులో పోసి మెత్తని పేస్టులా చేయాలి. ఈ ఆకు పేస్టును తయారుచేయడానికి నీటికి బదులు బియ్యం నీళ్లను కూడా ఉపయోగించవచ్చు. బియ్యం నీళ్లు కూడా వెంట్రులను మెరిసేలా ఉంచడమే కాదు ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి. అలా తయారుచేసిన ఈ ఆకుల పేస్టును ఒక పలచని గుడ్డలో వేసి వడకట్టాలి. ఆ నీటిని వెంట్రుకల కుదుళ్లకు బాగా పట్టించి అరగంట సేపు అలాగే ఉంచాలి. ఆ తర్వాత రెగ్యులర్ గా వాడే షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే వెంట్రుకలపై ఈ హెయిర్ మాస్కు మంచి ప్రభావం చూపుతుంది. జామాకుల్లోని విటమిన్ బి, విటమిన్ సిలు జుట్టును పెరిగేట్టు చేస్తాయి. ఆ ఆకుల్లోని యాంటాక్సిడెంట్లు వెంట్రుకలు దెబ్బతినకుండా పరిరక్షిస్తాయి. ఇకపోతే మందార ఆకులోని అమినో ఆమ్లం చుండ్రును నివారిస్తుంది. అంతేకాదు తెల్లబడ్డ వెంట్రుకలను నల్లబడేలా చేస్తాయి. అంతేకాదు ఈ పేస్టు జుట్టుకు కండిషనర్ గా కూడా పనిచేస్తుంది. ముఖ్యంగా మునగాకులోని విటమిన్ ఎ, విటమిన్ సి జుట్టుకు మంచి పోషణ ఇవ్వడమే కాకుండా జుట్టును పెరిగేలా చేస్తుంది. అంతేకాదు శరీరంలో కణాలు, కణజాలాలు పెరిగేలా కూడా విటమిన్ ఎ కీలకంగా వ్యవహరిస్తుంది. అందుకే ఈ మాస్కును వెంట్రుకలకు పెట్టుకుని అందమైన, పొడుగైన శిరోజాలతో నలుగురిలో మెరవండి…