Saturday, November 15, 2025
Homeహెల్త్Migraine Relief: మైగ్రేన్​తో తల బరువెక్కుతోందా? మహిళల్లోనే ఎందుకంత మంట?

Migraine Relief: మైగ్రేన్​తో తల బరువెక్కుతోందా? మహిళల్లోనే ఎందుకంత మంట?

Migraine relief for women :  సాధారణ తలనొప్పికి, మైగ్రేన్‌కు మధ్య నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఓ కప్పు కాఫీతో తగ్గేది తలనొప్పయితే, సుత్తితో బాదినట్టు, నరాలు చిట్లిపోతున్నట్టు వేధించేది మైగ్రేన్. ముఖ్యంగా మహిళల పాలిట శాపంగా మారిన ఈ సమస్యకు కారణాలేంటి? హార్మోన్ల హెచ్చుతగ్గులకు, ఈ తలనొప్పికి ఉన్న సంబంధం ఏమిటి? దీని నుంచి శాశ్వతంగా బయటపడే మార్గాలున్నాయా? నిపుణులు ఏం చెబుతున్నారో వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

సాధారణంగా పని ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాలతో వచ్చే తలనొప్పి కొద్దిసేపటి విశ్రాంతితో తగ్గిపోతుంది. కానీ మైగ్రేన్ నొప్పి అలా కాదు, ఇది తలలో ఒకవైపు మొదలై తీవ్రంగా వేధిస్తుంది. ఉదయం నిద్రలేవగానే తేలికపాటి నొప్పితో ప్రారంభమై, ఆ తర్వాత భరించలేని స్థాయికి చేరుకుంటుంది. ఈ నొప్పితో పాటు వికారం, వాంతులు, అధిక వెలుతురు లేదా శబ్దాలను తట్టుకోలేకపోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయని mayoclinic అధ్యయనం స్పష్టం చేస్తోంది.

మహిళల్లోనే ఎందుకు ఎక్కువ : పురుషులతో పోలిస్తే మహిళల్లో మైగ్రేన్ సమస్య మూడు రెట్లు అధికం. దీనికి ప్రధాన కారణం వారి శరీరంలో జరిగే హార్మోన్ల మార్పులే. ముఖ్యంగా ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలలో వచ్చే హెచ్చుతగ్గులు మైగ్రేన్‌ను ప్రేరేపిస్తాయి. అందుకే చాలామంది మహిళల్లో నెలసరికి ముందు, నెలసరి సమయంలో, గర్భధారణ సమయంలో లేదా మెనోపాజ్ దశలో ఈ తలనొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. గర్భనిరోధక మాత్రలు వాడటం కూడా కొన్నిసార్లు మైగ్రేన్‌కు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రధాన కారణాలు మరియు ప్రేరేపకాలు : మైగ్రేన్ రావడానికి జన్యుపరమైన కారణాలు కూడా దోహదం చేస్తాయి. కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే, ఇతరులకు కూడా వచ్చే అవకాశం ఎక్కువ. ఇవే కాకుండా కొన్ని అంశాలు మైగ్రేన్‌ను ప్రేరేపిస్తాయి అవి:
మానసిక ఒత్తిడి, ఆందోళన.
నిద్రలేమి లేదా అతిగా నిద్రపోవడం.
ప్రకాశవంతమైన వెలుతురు, పెద్ద శబ్దాలు.
కొన్ని రకాల ఆహార పదార్థాలు, పానీయాలు.
ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు.

న్యూరాలజిస్ట్ డా. మురళి ప్రకారం, “మైగ్రేన్‌ను రోగి చెప్పే లక్షణాల ఆధారంగానే నిర్ధారిస్తాం. చాలా సందర్భాల్లో సీటీ (CT) స్కాన్, ఎంఆర్‌ఐ (MRI) స్కాన్ వంటివి నార్మల్‌గానే ఉంటాయి. కొందరిలో మాత్రమే మెదడులోని చిన్న రక్తనాళాల్లో మార్పులు కనిపించవచ్చు. నొప్పి తీవ్రత, అది వచ్చే విధానాన్ని బట్టి చికిత్స ఉంటుంది.”

మైగ్రేన్‌ రకాలు – లక్షణాలు 
నిపుణుల ప్రకారం మైగ్రేన్‌లో ప్రధానంగా రెండు రకాలుంటాయి.
కామన్ మైగ్రేన్: ఇది  సాధారణమైనది. తలకు రెండు వైపులా నొప్పి వస్తుంది. కళ్లలో, ముఖ్యంగా కంటి వెనుక భాగంలో సూదులతో గుచ్చినట్లుగా నొప్పి ఉంటుంది.

క్లాసికల్ మైగ్రేన్: ఇందులో తలనొప్పి ఒక పక్క చెవిపైన మొదలై తల సగభాగానికి వ్యాపిస్తుంది. ఒకసారి కుడివైపు వస్తే, మరోసారి ఎడమవైపు రావచ్చు. మన దేశ జనాభాలో సుమారు 10 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

చికిత్స మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు : మైగ్రేన్‌కు రెండు రకాల చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. మొదటిది, నొప్పి వచ్చినప్పుడు తక్షణ ఉపశమనం కోసం వాడే మందులు. రెండోది, నొప్పి మళ్లీ మళ్లీ రాకుండా దీర్ఘకాలికంగా వాడే నివారణ మందులు. అయితే, కేవలం మందుల మీదే ఆధారపడకుండా జీవనశైలిలో మార్పులు చేసుకోవడం అత్యంత కీలకమని medlineplus అధ్యయనం చెబుతోంది.

ఆహార నియమాలు: ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజూ ఒకే సమయానికి భోజనం చేయాలి.
క్రమబద్ధమైన నిద్ర: ప్రతిరోజూ తగినంత నిద్రపోవడం, ఒకే సమయానికి నిద్రపోవడం, మేల్కొనడం అలవాటు చేసుకోవాలి.
ఒత్తిడికి దూరం: ఒత్తిడిని జయించేందుకు యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి దినచర్యలో భాగం చేసుకోవాలి.
వ్యాయామం: రోజూ తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల మైగ్రేన్ తీవ్రత తగ్గుతుంది.
తక్షణ ఉపశమనానికి చిట్కాలు: నొప్పి ప్రారంభమైన వెంటనే కెఫిన్ ఉన్న పానీయం (కాఫీ/టీ) తక్కువ మోతాదులో తీసుకోవాలి.తలకు లేదా మెడకు వేడి లేదా చల్లని నీటితో కాపడం పెట్టాలి.
వెలుతురు లేని, నిశ్శబ్దంగా ఉండే గదిలో కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. ధూమపానం, మద్యపానం వంటి దురలవాట్లకు దూరంగా ఉండటం ద్వారా మైగ్రేన్‌ను చాలా వరకు నియంత్రణలో ఉంచుకోవచ్చు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad