Homeహెల్త్Monsoon Fever:జ్వరం వస్తే నిర్లక్ష్యం వద్దు!

Monsoon Fever:జ్వరం వస్తే నిర్లక్ష్యం వద్దు!

Fever Symptoms: అప్పుడే వాన, ఆవెంటనే ఎండ ఇలా వాతావరణం వెంటవెంటనే మారుతుండడంతో శరీరంలో అందుకు తగిన సర్దుబాటు చేసుకునే క్రమంలో నిరోధక వ్యవస్థ కొంత బలహీన పడే ప్రమాదం వానాకాలంలో ఎక్కువ. అదీకాక తేమతో కూడిన పరిసరాల్లో సూక్ష్మజీవులు త్వరగా వృద్ధి చెందడం మాత్రమే కాదు వ్యాపిస్తాయి కూడా. చల్లగా ఉందని వేడిగా ఏదన్నా తిందామనే తాపత్రయంలో ఎక్కువ కాలరీలు, తక్కువ పోషకాలు కలిగిన స్నాకింగ్‌ కూడా దీనికి తోడవుతుంది. వెరసి బలహీన పడిన శరీరంలోకి సూక్ష్మ జీవుల చేరికతో విషజ్వరాల వ్యాప్తి సులువవుతుంది. ముసురేసిన ఈ కాలంలో విషజ్వరాలను గుర్తించడం, సరైన సమయంలో సరైన చికిత్స తీసుకోవడం ద్వారా ప్రాణాలకు ప్రమాదం కలుగకుండా కాపాడుకోవచ్చు. మరింత అవగాహనతో, జాగ్రత్తతో వ్యవహరిస్తే అసలు అనారోగ్యం పాలపడకుండానే నివారించవచ్చు.

- Advertisement -

శరీరం పంపే హెచ్చరిక సంకేతాలను సకాలంలో అర్థం చేసుకోవడం ప్రాణరక్షణకు తొలి అడుగు. రుతువుల మార్పులు, మారుతున్న జీవనశైలితో పాటు మన చుట్టూ దాగి ఉండే ఎన్నో సూక్ష్మజీవులు ఆరోగ్యానికి సవాలు విసురుతున్నాయి. అలాంటి సమయాల్లో శరీరంలో తలెత్తే అసౌకర్యాలను అధిగమించడానికి అవగాహన, తక్షణ స్పందనే శ్రీరామరక్ష. అవేమిటో, ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవడం అత్యవసరం.

జ్వరం అనేది సాధారణంగా కనిపించే ఆరోగ్య సమస్యే అయినా.. దాని వెనుక వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ నుంచి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌ వంటి తీవ్రమైన వ్యాధులు ఉండొచ్చు. ఉష్ణోగ్రత 101 డిగ్రీల ఫారన్‌హీట్‌ను మించి, పారాసెటమాల్‌ తీసుకున్నా తగ్గుతూ.. మళ్లీ పెరుగుతూ రెండు రోజులకుపైగా కొనసాగితే వైద్యులను సంప్రదించడం మంచిది. జ్వరంతో పాటు కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, తీవ్రమైన నీరసం, కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు, చర్మంపై ఎర్రటి మచ్చలు, దగ్గు, జలుబు, తలనొప్పి, చలి వంటి లక్షణాలున్నా వైద్య పరీక్షలు అవసరం.
వైరల్‌ జ్వరం
జలుబు, దగ్గు, తలనొప్పి, ఆయాసం, చెమటలు పట్టడం, చర్మంపై ఎర్రటి మచ్చలు.
వైద్యుల సూచన మేరకే పరీక్షలు చేయించాలి.
టైఫాయిడ్‌
కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, కామెర్లు, గుండె వేగం తగ్గడం.
నిర్ధారణ అనంతరం యాంటీబయాటిక్స్​​‍ అవసరం.
డెంగ్యూ
తీవ్రమైన కీళ్లు, ఒళ్లు నొప్పులు, ప్లేట్లెట్లు తగ్గడం. ముక్కు, చిగుళ్ల నుంచి రక్తస్రావం, మూత్రంలో రక్తం, తీవ్రమైన పొట్టనొప్పి ప్రమాద సంకేతాలు. సకాలంలో సహాయక చికిత్స అవసరం.
మలేరియా
జ్వరం హెచ్చుతగ్గులతో రావడం, వాంతులు, మత్తు.
ప్లాస్మోడియం ఫెల్సిఫెరం అనే పరాన్న జీవి వల్ల వచ్చే సెరెబ్రల్‌ మలేరియా ప్రాణాంతకం. పి. వైవాక్స్​​‍ కాలేయంలో ఉండి తిరగబెట్టే ప్రమాదం ఉంటుంది.
సైనసైటిస్
చల్లని వాతావరణంలో తలనొప్పి, జలుబు, తల బరువుగా ఉండడం, ముందుకు వంగినప్పుడు నొప్పులు.
సైనస్ కారణాన్ని బట్టి ప్రత్యేక చికిత్స అవసరం.
ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన వారు
పసిపిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల మాత్రమే కాదు వారిలో లక్షణాలు స్వయంగా చెప్పలేరు కాబట్టి వెంటనే వైద్య సహాయం అందించాలి.
గర్భిణులు ముఖ్యంగా తొలి 3 నెలల్లో సొంత వైద్యం కూడదు. మలేరియా, డెంగ్యూ వ్యాధుల విషయంలో తల్లి, బిడ్డ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వైద్యులే చికిత్స నిర్ణయిస్తారు.
వ్యాక్సిన్ల రక్షణ
వయసు, ఆరోగ్య స్థితి బట్టి వైద్యుల సలహాతోనే పారాసెటమాల్‌ వేసుకోవాలి. కాలేయ వ్యాధులు ఉన్నవారు, మద్యం అలవాటు ఉన్నవారు అధిక మోతాదు తీసుకుంటే కాలేయం దెబ్బతింటుంది.
ఇన్‌ఫ్లుయెంజా, న్యూమోకోకల్‌, టైఫాయిడ్‌ వ్యాక్సిన్లు కొన్ని ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి.
బాక్స్​​‍
నివారణ సాధ్యమే

నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం: ఇంటి పరిసరాల్లో, పూల కుండీలు, పాత టైర్లు, కూలర్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నిల్వ

నీటిలోనే డెంగ్యూ, మలేరియా వ్యాపించే దోమలు వృద్ధి చెందుతాయి.

దోమల నివారణ ఉపాయాలు: రాత్రివేళల్లో దోమతెరలు వాడడం, కిటికీలకు మెష్‌ అమర్చుకోవడం.. దోమలను తరిమే క్రీములు, మ్యాట్లు ఉపయోగించడం మేలు.

శరీరాన్ని పూర్తిగా కప్పే దుస్తులు: బయటకు వెళ్లేటప్పుడు ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో శరీరాన్ని పూర్తిగా కప్పే కాటన్‌ దుస్తులు ధరించడం సురక్షితం.

నీళ్లు జాగ్రత్త

కాచి చల్లార్చిన నీరు: టైఫాయిడ్‌, కాలరా వంటి ఇన్‌ఫెక్షన్లు కలుషిత నీటి ద్వారా వ్యాపిస్తాయి. కాబట్టి ఎల్లప్పుడూ కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి.

తాజా ఆహారం: వీలైనంత వరకు వేడిగా, తాజాగా వండిన ఆహారాన్ని తీసుకోవాలి. ఈగలు వాలిన, ముసిరిన లేదా నిల్వ ఉంచిన పదార్థాలను తినకూడదు.

చేతుల పరిశుభ్రత: ఆహారం తినే ముందు, బయట నుంచి ఇంటికి వచ్చాక చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.

వ్యక్తిగత జాగ్రత్తలు – రోగనిరోధక శక్తి

పోషకాహారం: విటమిన్‌-సి లభించే సిట్రస్ పండ్లు, కూరగాయలు.. తగినంత ద్రవాహారం తీసుకుంటూ శరీరంలో రోగనిరోధక శక్తి పెంచుకోవాలి.
స్వయంగా మందులు వాడకూడదు: జ్వరం రాగానే సొంతంగా యాంటీబయాటిక్స్​​‍ లేదా అధిక మోతాదు నొప్పి నివారిణి మాత్రలు వాడకూడదు.
పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం, చిన్నపాటి జాగ్రత్తలు పాటించడం ద్వారా విష జ్వరాల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.

అత్యవసర హెచ్చరిక
శ్వాస ఇబ్బంది, ఆగని వాంతులు, ముక్కు, చిగుళ్ల నుంచి రక్తస్రావం, స్పృహ తప్పుతుండటం, పక్షవాతం లక్షణాలు కనిపిస్తే ఇంటి చికిత్సలకే పరిమితం కాకుండా వెంటనే ఆసుపత్రిలో చేరాలి.

 

డాక్టర్‌ హేమంత్‌ చిరుమామిళ్ల
కన్సల్టెంట్‌ ఇంటర్నల్‌ మెడిసిన్‌
అపోలో హాస్పిటల్స్​‍ ఫైనాన్సియల్‌ డిస్ట్రిక్‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News