ఉదయం లేచిన తరువాత కనిపించే కొన్ని చిన్న మార్పులు… పెద్ద ప్రమాదానికి సంకేతంగా మారుతాయంటే నమ్మశక్యం కాకపోవచ్చు. కానీ వైద్య నిపుణులు చెబుతున్నది మాత్రం వాస్తవమే. ముఖ్యంగా కడుపు కేన్సర్ (స్టమక్ కేన్సర్) వంటి ప్రాణాంతక వ్యాధులకు సంబంధించి కొన్ని శరీర లక్షణాలు చాలా తొందరగా తెలుస్తాయని, అయితే అవి నిర్లక్ష్యం చేయబడటం వల్ల ప్రాణాలను కోల్పోతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని హెచ్చరిస్తున్నారు.
ప్రతి సంవత్సరం లక్షలాది మందికి కేన్సర్ నిర్ధారణ కావడం చూస్తున్నాం. వీటిలో స్టమక్ కేన్సర్ అత్యంత ప్రమాదకరమైనదిగా గుర్తించబడింది. దీనిలోని ప్రమాదకరత ఏమిటంటే… ప్రారంభ దశలో ఎక్కువగా దాని లక్షణాలు బయటపడవు. ఉదయం వేళ కన్పించే కొన్ని సూచనలు, తద్వారా ముందుగానే అనుమానించేందుకు వీలవుతుంది.
ఉదాహరణకు. మలంలో రక్తం కనిపించడం లేదా మలరూపంలో అసాధారణ మార్పులు.. జిగురు ఆకారంలో నల్లటి పదార్థంగా ఉండటం.. ఇవి చాలా సందర్భాల్లో కడుపులో ఏర్పడిన గడ్డ లేదా కణితి నుంచి రక్తస్రావం కారణంగా జరిగేవేనని డాక్టర్లు చెబుతున్నారు. ఇది చిన్న సమస్య కాదని, అలాంటి లక్షణాలు కనబడితే వెంటనే వైద్య సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు.
అలాగే, పొట్ట ముట్టినట్లుగా లేదా సూదులతో గుచ్చినట్టుగా ఉండే నొప్పి, ముఖ్యంగా కడుపు పైభాగంలో కనపడే నొప్పి కూడా స్టమక్ కేన్సర్‌కు ప్రధాన సంకేతంగా భావిస్తున్నారు. ఇది సాధారణ జీర్ణ సమస్యలా కనిపించినా, రోజురోజుకు తీవ్రత పెరుగుతూ ఉండడం ప్రమాద సూచిక. ఇక ఆకలి తక్కువగా ఉండటం, కొద్దిగా తిన్నా వెంటనే పొట్ట నిండినట్టు అనిపించడం కూడా కడుపులో కణితి పెరుగుతున్న సూచన కావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
శరీర బరువు అకస్మాత్తుగా తగ్గిపోవడం కూడా గమనించాల్సిన అంశమే. దీనికి కారణం కేన్సర్ కణాలు శరీరంలోని పోషకాలను అడ్డుకోవడమే. ఫలితంగా శరీరం బలహీనపడిపోతుంది. ఇదే తరహాలో తరచూ కడుపు ఉబ్బడం, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు కూడా కనిపిస్తే అప్రమత్తత అవసరం. కడుపు కేన్సర్ పెరుగుతున్న వేగం భయానకంగా ఉండటమే కాదు, అది ఇతర అవయవాలకు వ్యాపించే ప్రమాదం కూడా అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఆరంభ దశలో గుర్తించకపోతే చికిత్సకు అవకాశాలు తగ్గిపోతాయి.
కాబట్టి ఉదయాన్నే కనిపించే చిన్న చిన్న లక్షణాలను తేలిగ్గా తీసుకోవడం కంటే, వాటిని వైద్యపరంగా పరిశీలించడం ఎంతో ముఖ్యం. ముందు జాగ్రత్తలే ప్రాణాలను కాపాడగలవని వైద్య నిపుణులు చెబుతున్నారు.