Health benefits of murrel fish : పులస దొరకడం ఎంత అరుదో, దాని ధర ఎంత ఎక్కువగా ఉంటుందో మనందరికీ తెలుసు. అయితే ఏడాది పొడవునా లభించే, అంతే రుచిని అందించే చేప ఒకటి ఉంది. అదే కొర్రమీను (బొమ్మె). ఇది రుచిలో పులసకు సరిసమానం. అందువల్లనే, పులస కోసం ఎదురుచూసేవాళ్లు, ఆ రుచిని ఆస్వాదించడానికి, కొర్రమీనును తరచుగా వండుకుంటారు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదైన ఈ చేప, అన్ని కాలాల్లోనూ దొరకడం దీనికున్న మరో ప్రత్యేకత. దీనిని పులుసు పెట్టినా, వేపుడు చేసినా దీని రుచి అమోఘం. అయితే, ఈ చేప కేవలం రుచికే కాదు, ఓ ఔషధాల గని అని నిపుణులు చెబుతున్నారు. అసలు ఈ చేపలో దాగి ఉన్న ఆ ఆరోగ్య రహస్యాలేంటి..?
మంచినీటి చేపల్లో ఔషధ గుణాలు కలిగినదిగా కొర్రమీనుకు ప్రత్యేక స్థానం ఉంది. తక్కువ ఆక్సిజన్ ఉన్న నీటిలోనూ జీవించగల సత్తా దీని సొంతం. శాస్త్రీయంగా ‘చన్నా స్ట్రియాటస్’ అని పిలిచే ఈ చేపతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను దశలవారీగా విశ్లేషిద్దాం.
గాయాలను మాన్పే అద్భుత ఔషధం : కొర్రమీను గాయాలను త్వరగా మాన్పడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే శస్త్రచికిత్సలు, ముఖ్యంగా సిజేరియన్ చేయించుకున్న బాలింతలకు దీన్ని ఎక్కువగా సిఫార్సు చేస్తారు.
కీలకమైన ఆమ్లాలు: దీనిలో ఉండే గ్లైసిన్, అరాకిడోనిక్ ఆమ్లాలు గాయాలను మాన్పడంలో కీలక పాత్ర పోషిస్తాయి. గ్లైసిన్ అనే అమైనో ఆమ్లం చర్మ నిర్మాణానికి, పుండ్లు మానడానికి అవసరమైన కొల్లాజెన్‌లో ముఖ్యమైంది.
శాస్త్రీయ ధ్రువీకరణ: గాయాలను నయం చేసే అన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాలు ఇందులో ఉన్నాయని, ఇది నొప్పి నివారణిగా పనిచేస్తుందని ప్రఖ్యాత నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అధ్యయనంలో సైతం పేర్కొంది.
ప్రోటీన్ల గని.. చికెన్, గుడ్డు కన్నా మేలు : శరీర కండరాల నిర్మాణానికి, పెరుగుదలకు ప్రోటీన్ అత్యంత అవసరం. ఈ విషయంలో కొర్రమీను మేటి అని చెప్పవచ్చు.
100 గ్రాముల కొర్రమీనులో 25.2 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అదే 100 గ్రాముల చికెన్‌లో 18.2 గ్రాములు, గుడ్డులో 12.8 గ్రాముల ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. కొవ్వు తక్కువగా, ప్రోటీన్లు ఎక్కువగా ఉండటం వల్ల హృద్రోగులు, బీపీ, మధుమేహం ఉన్నవారికి ఇది సురక్షితమైన, ఆరోగ్యకరమైన ఆహారం.
కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం : కొర్రమీనులో యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ (మంటను, వాపును తగ్గించే) గుణాలు పుష్కలంగా ఉన్నాయి. దీనివల్ల కీళ్లనొప్పులు, ఆస్తమాతో బాధపడేవారికి ఇది మంచి పోషకాహారంగా పనిచేస్తుంది. పొట్టకు సంబంధించిన సమస్యలకు, ముఖ్యంగా మలబద్ధకానికి ఇది చక్కటి ఔషధంలా పనిచేసి తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది.
మానసిక ఆరోగ్యానికి అండ : కొన్ని అధ్యయనాల ప్రకారం, కొర్రమీను చర్మంలోని ఒక పదార్థం మెదడులోని ‘సెరెటోనెర్జిక్’ వ్యవస్థపై ప్రభావం చూపి, యాంటీ-డిప్రెసెంట్‌గా పనిచేస్తుందని తేలింది. మానసిక ఒత్తిడిని తగ్గించడంలో ఇది సహాయపడగలదని పరిశోధకులు భావిస్తున్నారు.
విటమిన్లు, ఖనిజాల సమాహారం : ప్రోటీన్లే కాకుండా, కొర్రమీనులో అనేక సూక్ష్మపోషకాలున్నాయి. విటమిన్లు ఎ, డి3, బి12, సి లతో పాటు కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, జింక్, అయోడిన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరచడానికి, చర్మ, కేశ సంరక్షణకు ఎంతగానో తోడ్పడతాయి.
నిపుణుల సూచన: “ఇది మంచినీటి చేప కాబట్టి సముద్ర చేపలతో పోలిస్తే మెర్క్యురీ వంటి కాలుష్యాల బారినపడే ప్రమాదం తక్కువే. అయినప్పటికీ, గర్భిణులు దీనిని తగు మోతాదులోనే తీసుకోవడం మంచిది” అని నిపుణులు పేర్కొంటున్నారు.


