20వ శతాబ్దం ప్రారంభంలో కనుగొన్న ప్లాస్టిక్.. అప్పట్లో పెద్ద సంచలనం. ప్రధానంగా ప్యాకేజింగ్ పరిశ్రమకు, ఇళ్లలో వస్తువులకు దీని ఉపయోగం కనీవినీ ఎరుగని స్థాయిలో కనిపించింది. దాని దుష్ప్రభావాలు సైతం అదే స్థాయిలో వచ్చాయి. మన ఇళ్లలో విరిగిపోయే ప్లాస్టిక్ వస్తువులు క్రమంగా చిన్నచిన్న ముక్కలు అయిపోతాయి. వాటిని వాటి పరిమాణాన్ని బట్టి మైక్రో (సూక్ష్మ) ప్లాస్టిక్‌లు, నానో (అతి సూక్ష్మ) ప్లాస్టిక్‌లు అంటారు. ఈ సూక్ష్మ, అతి సూక్ష్మ ప్లాస్టిక్‌లు క్రమంగా నీళ్లలోను, ఆహార వనరుల్లోను కలిసిపోయి, తద్వారా మనుషుల శరీరాల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఇది ఎంతగా అంటే, శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు చాలామంది మనుషుల రక్తంలోనూ ఈ అతి సూక్ష్మ ప్లాస్టిక్ వ్యర్థాలు కనిపించాయి!
ఇలా మనిషి శరీరంలోకి, రక్తంలోకి ప్రవేశిస్తున్న ప్లాస్టిక్.. అనేకరకాల రుగ్మతలకు కారణం అవుతోంది. ఇవి రక్తం గుండా మెదడులోకి ప్రవేశించడానికి అడ్డంగా ఉండే కొన్ని అడ్డుగోడలను కూడా దాటుకుని మరీ మెదడులో ఉండే ఒకరకం కణాలైన న్యూరాన్లలోకీ వెళ్లిపోతున్నాయి. అలా వెళ్లిన అతిసూక్ష్మ ప్లాస్టిక్‌లు పార్కిన్సన్స్ డిసీజ్ తరహా మార్పులను మెదడులో కలగజేస్తున్నాయి. దీనివల్ల వారికి పార్కిన్సన్స్ డిసీజ్ వస్తోంది. నరాలకు సంబంధించిన వ్యాధులన్నింటిలోకీ అత్యంత దారుణమైనది ఈ పార్కిన్సన్స్. కొన్ని రకాల నాడీ కణాలు మరణించడం వల్ల ఇది వస్తుంది. ఈ నాడీకణాలు మన కదలికలను నియంత్రిస్తాయి. ఆల్ఫా సినుక్లెయిన్ అనే ఒక ప్రోటీన్ ప్రతి మనిషి మెదడులోనూ ఉంటుంది. అది నాడీకణాల మధ్య కమ్యూనికేషన్‌లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. కానీ పార్కిన్సన్స్, కొన్ని రకాల డిమెన్షియా లాంటి వ్యాధులు వచ్చినప్పుడు ఈ ఆల్‌ఫా సినుక్లెయిన్ ప్రోటీన్ మార్పులు చెందుతుంది. ఇలా మారడానికి ప్రధాన కారణం… రక్తంగుండా మెదడులోకి ప్రవేశిస్తున్న అతిసూక్ష్మ ప్లాస్టిక్ అన్నది తాజా పరిశోధనల్లో తేలింది.
శాస్త్రవేత్తలు ఈ విషయాలను నిరూపించేందుకు ముందుగా ఎలుకల మీద ప్రయోగాలు చేశారు. అందులో పలురకాల ల్యాబొరేటరీ టెక్నిక్‌లు ఉపయోగించారు. మనం కాఫీలు తాగే కప్పుల్లో ఉపయోగించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అయిన పాలీస్టైరీన్ అనే నానోకణాలను ఉపయోగించారు. ఈ నానో ప్లాస్టిక్‌లు ఆల్ఫా-సినుక్లెయిన్ ప్రోటీన్‌కు గట్టిగా అతుక్కుపోయాయి. దానివల్ల పార్కిన్సన్స్ వ్యాధిలో కనిపించే లాంటి విషపూరిత పొదలను ఏర్పరిచాయి. మొత్తం మూడు మోడళ్లలో వీటిని పరిశీలించగా, అన్నింటిలోనూ ఇలాగే జరిగింది.
నానోప్లాస్టిక్‌లు, ఆల్ఫా-సినుక్లెయిన్‌లను కలిపి ఆరోగ్యవంతమైన ఎలుకల మెదడులోకి ఇంజెక్ట్ చేసినప్పుడు.. ఆల్ఫా-సినుక్లెయిన్ ఫైబ్రిల్స్ ఏర్పడ్డాయి. అవి మెదడులోని నాడీకణాల్లో స్పష్టంగా కనిపించాయి. పార్కిన్సన్స్ డిసీజ్‌తో పాటు కొన్నిరకాల డిమెన్షియాలలో మాత్రమే ఈ లక్షణం ఉంటుంది. అందువల్ల ఈ నానో ప్లాస్టిక్‌ల వల్ల పార్కిన్సన్స్ వ్యాధి, కొన్నిరకాల డిమెన్షియా (మతిమరుపు) వచ్చే ప్రమాదం చాలా స్పష్టంగా కనిపిస్తోంది.
మరికొన్ని రకాల జంతువుల్లో అయితే, ఆల్ఫా-సినుక్లెయిన్ ప్రోటీన్‌తో సంబంధం లేకుండా ఉత్త నానో ప్లాస్టిక్‌లను ఇంజెక్ట్ చేసినప్పుడు అవే నాడీ కణాల్లో ఫైబ్రిల్స్ అనే ఒకరకం పోగులను ఏర్పరుస్తున్నాయి. ఇది ఇంకా చాలా ప్రమాదకరమని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సజీవంగా ఉన్న ఏ జీవిలో అయినా కేవలం ఈ నానో ప్లాస్టిక్ వల్ల ఆల్ఫా సినుక్లెయిన్ ఫైబ్రిల్స్ ఏర్పడి, వాటి వల్ల పార్కిన్సన్స్ డిసీజ్ వస్తుందని తెలుస్తోంది.
మనం అనునిత్యం వాడుతున్న ప్లాస్టిక్ వస్తువులు విరిగిపోయినప్పుడు అవి పర్యావరణంలో కలిసి ఎంత చేటు చేస్తాయనడానికి ఈ పరిశోధనల ఫలితాలే ప్రత్యక్ష నిదర్శనం. మైక్రోప్లాస్టిక్ కణాల వల్ల కేన్సర్, ఆటోఇమ్యూన్ వ్యాధుల లాంటివి సైతం వస్తున్నాయి. అసలు నానో ప్లాస్టిక్ కణాలు మెదడులో ఉన్న ఆల్ఫా-సినుక్లెయిన్ ప్రోటీన్‌తో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాయి, అవి ఎలా వ్యాధులకు కారణం అవుతున్నాయన్న విషయం మాత్రం ఇంకా తెలియలేదు. దీనిపై మరింత పరిశోధనలు జరగాల్సి ఉంది.