వెంట్రుకలు పలచబడడానికి కాలుష్యం నుంచి హార్మోన్లలో తలెత్తే తేడాపాడాల దాకా ఎన్నో కారణాలు ఉన్నాయి. జుట్టు ఒత్తుగా పెరగడానికి ఇంట్లోనే చేసుకోగలిగే సహజసిద్ధమైన టిప్స్ కొన్ని ఉన్నాయి. వాటిని అనుసరిస్తే మీ జుట్టు ఒత్తుగా, నిగ నిగలాడుతుంటుంది. అవేమిటంటే…
ఆరంజ్ జ్యూసులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు కుదుళ్లను పటిష్టం చేయడమే కాదు వెంట్రుకలు బాగా పెరిగేలా సహాయపడుతుంది. యాపిల్స్ లో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శిరోజాలు దెబ్బతినకుండా కాపాడతాయి. జుట్టు రాలకుండా సంరక్షిస్తాయి కూడా. అందుకే యాపిల్ ప్యూరీ, ఆరంజ్ జ్యూసు రెండింటినీ కలపాలి. ఆ మిశ్రమాన్ని మెత్తటి పేస్టులా చేసి మాడుకు పట్టించాలి. కుదుళ్ల వరకూ ఈ పేస్టు అంటేలా బాగా రాయాలి. ఇలా చేయడం వల్ల సహజసిద్ధంగానే ఒత్తైన జుట్టు పాటు వెంట్రుకలు కూడా బాగా పెరుగుతాయి. డీహైడ్రేటెడ్, కాంతివిహీనమైన శిరోజాలు ఉన్న వారికి ఈ పేస్టు బాగా పనిచేస్తుంది.
ఉసిరి మాస్కు కూడా వెంట్రుకలపై బాగా పనిచేస్తుంది. ఇందులో యాంటీబాక్టీరియల్, యాంటిమైక్రోబియల్ సుగుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ ఉసిరి మాస్కు మాడును ఆరోగ్యంగా, శుభ్రంగా
ఉంచుతుంది. కుదుళ్లను ఆరోగ్యంగా ఉండేట్టు చేస్తుంది. శిరోజాలు పెరగేట్టు తోడ్పడుతుంది. అందుకే ఉసిరిపేస్టులో కొద్దిగా కొబ్బరి నూనె కలిపి పేస్టులా చేసి దాన్ని కొద్దిసేపు వేడిచేయాలి. తర్వాత అందులోంచి ఆయిల్ ని వడగట్టాలి. ఆ నూనెతో మాడుకు బాగా మర్దనా చేసి రాత్రంతా అలాగే ఉంచుకోవాలి. ఉదయం లేచిన తర్వాత తేలికపాటి షాంపుతో తల స్నానం చేయాలి.
ఆముదం నూనెలో ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను ద్రుఢంగా ఉంచడంతోపాటు జుట్టు రాలిపోకుండా కూడా సంరక్షిస్తుంది. గోరువెచ్చగా చేసిన ఆముదం నూనెతో మాడును నిత్యం మర్దనా చేసుకుంటే వెంట్రుకలు బాగా పెరుగుతాయి. జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది. ఆముదం నూనెతో తలను మర్దనా చేసుకున్న తర్వాత గోరువెచ్చటి టవల్ ను తలకు చుట్టబెట్టుకొని గంట సేపు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత శుభ్రంగా నీటితో కడుక్కోవాలి.
అవిసెగింజలు కూడా జుట్టుపై బాగా పనిచేస్తాయి. ఈ గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఉండడంతో పాటు యాంటాక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. అవిసెగింజలతో జుట్టు టెక్స్చెర్ కూడా సహజసిద్ధంగా ఉంటుంది.కొన్ని అవిసెగింజలు తీసుకుని ఒకటి రెండు గంటల పాటు నీళ్లల్లో నాననివ్వాలి. ఆ తర్వాత వాటిని పొయ్యి మీద పెట్టి జెల్ లా తయారయ్యేదాకా బాగా ఉడకబెట్టాలి. అది చిక్కగా అయిన తర్వాత కిందకు దించి చల్లారనివ్వాలి. తర్వాత ఆ జెల్ ని జుట్టుకు, మాడుకు బాగా పట్టించాలి. కొంచెంసేపైన తర్వాత నీళ్లతో తల, వెంట్రుకలు బాగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు సహజసిద్ధమైన ఒత్తుదనంతో పెరుగుతుంది.
తేనెలో మాయిశ్చరైజింగ్ గుణాలు బాగా ఉన్నాయి. దీన్ని జుట్టుకు రాసుకుంటే వెంట్రుకలు పట్టులా ఉండడంతో పాటు నల్లగా నిగ నిగలాడుతుంటాయి. తేనెలో యాంటాక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును దెబ్బతీసే, రాలిపోయేట్టు చేసే ఫ్రీ రాడికల్స్ ను పోగొడతాయి. మీరు వాడే షాంపులో కొద్దిగా తేనె కలిపి దాంతో మాడును మర్దనాచేసుకోవాలి. కొంచెంసేపైన తర్వాత గోరువెచ్చని నీటితో తలను శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు సహజసిద్ధంగానే ఒత్తుగా పెరుగుతుంది.
బియ్యం కడిగిన నీళ్లల్లో విటమిన్లు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ నీళ్లు జుట్టు ఒత్తుగా పెరగడానికి ఎంతో సహాయపడతాయి. ఈ నీటిలో విటమిన్ ఇ, విటమిన్ కె, బి6 ఉన్నాయి. ఇవి జుట్టును, మాడును ఆరోగ్యంగా ఉంచుతాయి. శిరోజాలు కూడా బాగా పెరుగుతాయి. కొన్ని బియ్యం తీసుకుని నీళ్లల్లో పోసి గంటసేపు నాననివ్వాలి. ఆ తర్వాత బియ్యం నీళ్లను వడగట్టి ఒక బౌల్ లో పోయాలి. ఈ నీటితో మాడును మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో తలను శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చేయాలి.
పసుపులో కుర్క్యుమిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. అంతేకాదు వెంట్రుకలు కూడా దీనివల్ల బాగా పెరుగుతాయి. అరకప్పు పాలు తీసుకుని అందులో కొన్ని చెంచాల
పసుపు పొడి వేసి బాగా కలపాలి. అందులో ఒక చెంచా తేనెను కూడా వేసి కలపాలి. ఇది చర్మానికి కావలసినంత మాయిశ్చరైజర్ ని అందిస్తుంది. ఈ మాస్కును వెంట్రుకలకు పట్టించి అరగంట నలభై నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత తేలికపాటి షాంపుతో వెంట్రుకలను శుభ్రం చేసుకోవాలి.
జుట్టు ఒత్తుగా పెరగడానికి, వెంట్రుకలు రాలిపోకుండా ఉండడానికి ఉల్లిపాయల ప్యాక్ కూడా వెంట్రుకలపై బాగా పనిచేస్తుంది.
పాలలో బాదం నూనె చుక్కలు వేసుకుని తాగితే అది జుట్టుకు ఎంతో మంచిది. బాదం నూనెలోని విటమిన్ ఇ జుట్టుకు, చర్మానికి కంప్లీట్ ఫుడ్. అందుకే రాత్రి నిద్రపోయేముందు ఒక కప్పు గోరువెచ్చటి పాలల్లో టీ స్పూన్ బాదం నూనె వేసి బాగా కలిపి తాగితే ఎంతో మంచిది.