Homeహెల్త్Injection : సూది బెడదకు స్వస్తి.. వైద్యరంగంలో 'నీడిల్ ఫ్రీ' సరికొత్త విప్లవం

Injection : సూది బెడదకు స్వస్తి.. వైద్యరంగంలో ‘నీడిల్ ఫ్రీ’ సరికొత్త విప్లవం

Needle free injection technology : సూది పేరు వింటేనే పిల్లల నుంచి పెద్దల వరకు వెన్నులో వణుకు పుట్టడం సహజం. కొందరికైతే సిరంజి చూస్తేనే గుండె గుభిల్లుమనే ‘ట్రిపనోఫోబియా’ (సూది భయం) ప్రాణం మీదికి తెస్తుంది. మరి, చర్మంపై రంధ్రం పడకుండా, చురుక్కుమనే పోటు లేకుండానే నిమిషాల్లో ఔషధం ఒంట్లోకి చేరిపోతే? నొప్పి లేని ఈ సరికొత్త ఆవిష్కరణ రోగుల కష్టాలను ఎలా తీర్చబోతోంది?

- Advertisement -

ఈ ప్రశ్నకు సమాధానమే ఆధునిక ‘నీడిల్ ఫ్రీ ఇంజెక్టర్లు’. ఇది ‘జెట్ ఇంజెక్షన్’ అనే అత్యాధునిక శాస్త్రీయ సూత్రంపై పనిచేస్తుంది. ఇందులో సంప్రదాయ సూది ఉండదు. కేవలం రెప్పపాటు కాలంలోనే అధిక వాయు పీడనం  సాయంతో అత్యంత సూక్ష్మ రంధ్రం ద్వారా ఔషధాన్ని చర్మం లోపలి పొరల్లోకి పంపుతారు. గాటు పడకపోవడం వల్ల రోగికి ఎలాంటి నొప్పీ తెలియదు.

విస్తరిస్తున్న రంగాలు – ప్రయోజనాలు:
సామూహిక, బాలల టీకాలు: చిన్నారుల ఏడుపులు లేకుండా ఓరల్, నాసల్ స్ప్రేల ద్వారా వ్యాక్సిన్లు వేస్తున్నారు. పోలియో, ఇతర అంటువ్యాధుల నివారణలో వేలాది మందికి తక్కువ సమయంలో టీకాలు వేసేందుకు ఇది ఉపయోగపడుతోంది.

మధుమేహం & చర్మ సంరక్షణ: రోజువారీ ఇన్సులిన్ తీసుకునే సుగర్ వ్యాధిగ్రస్తులకు జెట్ ఇంజెక్టర్లు పెద్ద ఊరటనిస్తున్నాయి. డెర్మటాలజీలోనూ ఔషధాలను లోపలి కణజాలంలోకి సమానంగా చేర్చేందుకు దీన్ని వాడుతున్నారు.

ఇన్ఫెక్షన్లకు అడ్డుకట్ట: సూదులు పొరపాటున ఇతరులకు గుచ్చుకోవడం వల్ల వ్యాపించే హెచ్ఐవీ, హెపటైటిస్ వంటి ప్రాణాంతక ఇన్ఫెక్షన్ల బెడద తప్పుతుంది. ప్లాస్టిక్ వ్యర్థాలు తగ్గి పర్యావరణానికీ మేలు జరుగుతుంది. భవిష్యత్తులో క్యాన్సర్, జీవ సంబంధిత సంక్లిష్ట చికిత్సలనూ ఈ పద్ధతిలోనే అందించేందుకు ప్రయోగాలు వేగంగా సాగుతున్నాయని, త్వరలోనే ఇవి సామాన్యులకూ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శివగోపాల్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News