Neem Stick Benefits:మనలో చాలామంది రోజు ఆరంభం టూత్ బ్రష్‌తోనే చేస్తారు. రంగురంగుల ట్యూబుల్లో వచ్చే టూత్ పేస్టులు, స్టైలిష్ బ్రష్‌లు మన దైనందిన జీవితంలో భాగమైపోయాయి. అయితే రసాయనాలతో నిండిన ఈ పేస్టులకు ప్రత్యామ్నాయం మన పూర్వీకులు ఎంతో కాలం క్రితమే కనుగొన్నారు. అదే వేప పుల్ల. గ్రామాల్లో ఇప్పటికీ వేప పుల్లను వాడుతున్న వారు ఆరోగ్యకరమైన, మెరిసే దంతాలతో కనిపిస్తారు. ఇది యాదృచ్ఛికం కాదు, దానికి వెనుక గట్టి శాస్త్రీయ కారణాలు ఉన్నాయి.
చిగుళ్లు బలంగా మారి..
టూత్ బ్రష్, పేస్ట్ రాకముందు మన పెద్దలు చెట్ల కొమ్మలను దంత సంరక్షణకు వాడేవారు. ముఖ్యంగా వేప, తుమ్మ, కానుగ వంటి చెట్ల కొమ్మలు ఆ కాలంలో సహజ బ్రష్‌లుగా ఉపయోగించేవారు. ఇది కేవలం దంతాలను శుభ్రం చేసుకోవడం మాత్రమే కాకుండా, నోటి మొత్తం ఆరోగ్యాన్ని కాపాడే ఒక సంపూర్ణ విధానం. పుల్లను ఉదయం నమలడం ద్వారా చిగుళ్లు బలంగా మారి, దంతాలు ఆరోగ్యంగా నిలబడతాయి. చవకైనదే కాకుండా, అందులో ఉండే ఔషధ గుణాలు నోటి ఆరోగ్యానికి రక్షణ కవచంలా పనిచేస్తాయి.
యాంటీబ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్ గుణాలు…
వేప పుల్ల చేదుగా ఉంటుందని చాలామంది తెలుసు. ఆ చేదు రసంలో సహజంగా యాంటీబ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయి. పుల్లను నమిలినప్పుడు వచ్చే రసం నోటిలోని హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తుంది. దంతాలపై పేరుకునే పాచిని కూడా ఇది సమర్థవంతంగా తొలగిస్తుంది. అంటే వేప పుల్లను వాడడం వల్ల పేస్టులు ఇచ్చే శుభ్రత కంటే ఎక్కువ మేలు దక్కుతుంది.
సహజమైన డెంటల్ ఫ్లాస్…
వేప పుల్ల చివరను బాగా నమిలితే అది బ్రష్ కుచ్చుల్లా మారుతుంది. ఆ సహజమైన రోమాలు దంతాల మధ్యలోకి చొచ్చుకుపోయి ఇరుక్కున్న ఆహారాన్ని బయటకు లాగేస్తాయి. ఇది ఒక సహజమైన డెంటల్ ఫ్లాస్‌లా పనిచేస్తుంది. దాంతో దంతాల మధ్యలో మురికి ఉండకుండా కాపాడుతుంది.
రక్తప్రసరణ …
ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, వేప పుల్లతో చిగుళ్లను నెమ్మదిగా మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. రక్తప్రసరణ సరిగా ఉంటే చిగుళ్లు బలంగా మారి వాపు, రక్తస్రావం వంటి సమస్యలు దూరమవుతాయి. నోటి దుర్వాసన తగ్గిపోతుంది. అందుకే పల్లెటూళ్లలో వేప పుల్ల వాడే పెద్దల దంతాలు ఎప్పటికీ బలంగా, తెల్లగా ఉంటాయి.
మార్కెట్లో లభించే పేస్టుల్లో ఫ్లోరైడ్, ట్రిక్లోసాన్ వంటి రసాయనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వాటిని దీర్ఘకాలం వాడితే కొన్ని దుష్ప్రభావాలు కలగవచ్చు. కానీ వేప పుల్లలో ఎలాంటి రసాయనాలు ఉండవు. ఇది 100 శాతం సహజ ఉత్పత్తి. దుష్ప్రభావాలు లేవు. అంతేకాక, రోజంతా నోటిని తాజాగా ఉంచడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
పేస్టులు వాడటం సౌకర్యవంతమైన మార్గం కావొచ్చు కానీ వేప పుల్లలో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇంకా ప్రభావవంతంగా ఉంటాయి. వందల ఏళ్ల క్రితం మన పెద్దలు వాడిన ఈ సాధనమే నేటికీ ఉపయోగకరంగా ఉంది. చవకైనదే కాకుండా, మన దంతాలను సహజంగా కాపాడే సాధనంగా ఇది తరతరాలుగా కొనసాగుతోంది.


