ఆకలి లేకపోయినా బోర్ గా ఉందనో, ఒంటరితనంతోనో, ఒత్తిడితోనో కొందరు అతిగా తినేస్తుంటారు. దీంతో శరీరంలో కేలరీలు ఎక్కువయి బరువు పెరుగుతారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే ఇలా ఎక్కువ తినడాన్ని తగ్గించుకునేందుకు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అనుసరించేందుకు కొన్ని టిప్స్ ఉన్నాయి. అవేమిటంటే…
ఒత్తిడిని తగ్గించే ఆహారాన్ని తీసుకోవాలి. ఎక్కువ తినకుండా ఉండేలా ఇతర అలవాట్ల వైపు అంటే వాకింగ్, వ్యాయామాలు చేయడం, పుస్తకాలు చదవడం, స్నేహితులకు ఫోను చేసి మాట్లాడడం వంటి వాటిని చేయాలి. ఇలా చేస్తే ఒత్తిడి వల్ల అతిగా తినే అలవాటు తగ్గుతుంది.
బోరుగానో, ఒత్తిడిగానో ఉన్నప్పుడు ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒక పని పెట్టుకుంటే తిండి మీద ధ్యాస పోదు.
జంక్ ఫుడ్ అనారోగ్యకరం. అందుకే వాటిని ఇంట్లో అందుబాటులో ఉండనివ్వద్దు. బిస్కట్లు, చిప్స్ వంటివి తినకుండా ఆరోగ్యకరమైన పదార్థాలను ఇంట్లో వండుకుని తింటే శరీరానికి మంచిది. ఇలా మీకు కావలసినవి మీరే వండుకోవడం వల్ల టైమ్ హాయిగా గడిచిపోతుంది. తోచకపోవడంగాని, ఒంటరితనం వంటివి మీ దరిచేరవు.
రోజూ ఏడెనిమిది గంటల పాటు తప్పనిసరిగా నిద్ర పోవాలి. నిద్ర లేమి వల్ల కూడా ఆకలి ఎక్కువవుతుంది. ఏదో ఒకటి తినాలనే క్రేవింగ్ పెరుగుతుంది. స్లీపింగ్ టైమింగ్స్ కచ్చితంగా పాటించాలి. నిద్ర ఆలస్యంగా పోవడం వల్ల డిన్నర్ తర్వాత ఏదో ఒక చిరుతిళ్లు తింటుంటాం. అది మంచిది కాదు. అందుకే తొందరగా పడుకోవడం శరీరానికి చాలా మంచిది.
ఆరోగ్యకరమైన స్నాక్స్ ను ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి. పండ్లు, నట్స్, గింజలు, కాయగూరలు, చిరుధాన్యాల వంటివి దగ్గర పెట్టుకోవాలి.
మీ ఆహారపు అలవాట్లను గమనించుకుంటుండాలి. ఆకలిని బట్టి ఆహారాన్ని తీసుకోవాలి. ఆకలి అనిపించనపుడు తినకుండా ఉండడం మంచిది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల శరీరం ఫిట్ గా ఉంటుంది.