నిద్ర మన ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైన అంశం. శరీరానికి తగిన విశ్రాంతి లభించాలంటే సరైన నిద్ర తప్పనిసరి. కానీ అవసరానికి మించి నిద్రపోవడం కూడా ఆరోగ్యానికి హానికరమేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజుకి సగటున 6 నుండి 8 గంటల నిద్ర అవసరమన్నారు. కానీ చాలా మంది దీని కంటే ఎక్కువ నిద్రపోతూ శరీరంపై అనవసర ఒత్తిడి పెడుతున్నారు. ముఖ్యంగా అధిక బరువు ఉన్నవారు, కఫ దోషం కలవారు ఎక్కువ నిద్రకి అలవాటుపడతారని ఆమె పేర్కొన్నారు.
ఎప్పుడు నిద్రపోవాలి.. ఎప్పుడు లేవాలి:
నిపుణుల అభిప్రాయం ప్రకారం రాత్రి 8:30 – 9:00 మధ్య నిద్రపోవడం, తెల్లవారుజామున 3:30 – 4:00 మధ్య మేల్కొనడం ఉత్తమం. అయితే నేటి జీవిత శైలి ప్రకారం రాత్రి 10:30కి నిద్రపోయి, ఉదయం 6:00కి లేవడం సరైన సమయమని వైద్యులు చెబుతున్నారు. దీనివల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యత మెరుగవుతుంది, శక్తి నిలిచి ఉంటుంది. రోజుకు కనీసం 6 గంటలు, గరిష్ఠంగా 8 గంటల నిద్ర సరిపోతుంది. ఎక్కువ నిద్ర శరీరాన్ని బరువుగా మారుస్తుంది, వ్యాధులకు దారితీస్తుందిని నిపుణులు అంటున్నారు.
ఎక్కువ నిద్రపోతే ఏమవుతుంది:
అతిగా నిద్రపోవడం వల్ల శరీరం బరువుగా మారుతుంది, మానసికంగా అలసట, నిదానత ఉత్పన్నమవుతుంది. అంతేకాకుండా అధిక నిద్ర కారణంగా మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్, ఊబకాయం వంటి సమస్యలు రావచ్చు. అందుకే అవసరమయినంత మాత్రాన మాత్రమే నిద్రపోవాలి.
మధ్యాహ్నం నిద్ర:
భోజనం తర్వాత వెంటనే పడుకోవడం ఆయుర్వేదం ప్రకారం తగదు. అయితే ఉదయం నుంచి శ్రమించి శరీరం అలసిపోయినపుడు మాత్రమే మధ్యాహ్నం 20–30 నిమిషాలపాటు నిద్రపోవచ్చు. అప్పుడూ ఎడమ వైపుగా పడుకోవడం మంచిదని వైద్యులు తెలిపారు. మొత్తానికి ఆరోగ్యాన్ని బలంగా నిలుపుకోవాలంటే, నిద్రపోయే సమయాన్ని పద్ధతిగా మార్చుకోవాలి.