Paneer vs Cheese:ఇటీవల కాలంలో ఆరోగ్యం మీద అవగాహన పెరుగుతోంది. ఆహారంలో ఏమి తినాలి, ఏమి తినకూడదు అనే అంశంపై చాలా మంది గట్టిగా ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా ప్రోటీన్ అవసరం గురించి చర్చ ఎక్కువగా జరుగుతోంది. శాకాహారులు ప్రోటీన్ లోపం రాకుండా ఉండేందుకు పనీర్‌ను తమ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటున్నారు. కండరాల బలానికి, శరీర శక్తికి పనీర్ ఉపయోగపడుతుందని చాలామంది నమ్మకం. అందుకే జిమ్‌కు వెళ్లేవారు, వ్యాయామం చేసే వారు పనీర్‌ను ఎక్కువగా తింటున్నారు.
అయితే, ఇదే సమయంలో చీజ్‌ను చాలా మంది దూరంగా పెడుతున్నారు. చీజ్ అంటే ఫాస్ట్ ఫుడ్‌లో మాత్రమే వాడే పదార్థం, అది ఆరోగ్యానికి మంచిది కాదనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. పిజ్జా, బర్గర్‌లలో కనిపించే చీజ్‌ను చూసి ఇది బరువు పెంచుతుందనే భావన ఏర్పడింది. కానీ పోషకాహార నిపుణుల మాటల్లో మాత్రం ఈ అభిప్రాయం పూర్తిగా సరైనది కాదని చెబుతున్నారు. సరైన పరిమాణంలో తీసుకుంటే చీజ్ కూడా శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుందని వివరిస్తున్నారు.
ఈ విషయంపై గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శుభం వాట్స్ చేసిన ఒక వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదలైన ఈ వీడియోలో ఆయన పనీర్, చీజ్ రెండింటి మధ్య ఉన్న పోషక విలువల తేడాలను స్పష్టంగా వివరించారు. చీజ్‌కు డిమాండ్ తక్కువగా ఉండటానికి ప్రధాన కారణం బ్రాండ్లు దానిని సరిగ్గా ప్రజలకు పరిచయం చేయకపోవడమేనని ఆయన అభిప్రాయం. అందుకే చాలామంది చీజ్‌ను అనారోగ్యకరమైన ఆహారంగా భావిస్తున్నారని చెప్పారు.
ప్రోటీన్‌కు మంచి వనరు..
సాధారణంగా పనీర్‌ను ప్రోటీన్‌కు మంచి వనరుగా భావిస్తారు. ముఖ్యంగా శాకాహారులకు ఇది సులభంగా లభించే ప్రోటీన్ ఆహారం. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, వంటకాల్లో కూడా సులభంగా ఉపయోగించవచ్చు. ఈ కారణాల వల్ల పనీర్‌కు మంచి పేరు వచ్చింది. అయితే చీజ్ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. చాలామంది దానిని ప్రాసెస్డ్ ఫుడ్‌గా మాత్రమే చూస్తారు. కానీ డాక్టర్ శుభం వాట్స్ చెప్పిన వివరాల ప్రకారం, ప్రాసెస్ చేయని చీజ్‌లో పోషక విలువలు చాలా మెరుగ్గా ఉంటాయి.
ఆయన ఇచ్చిన గణాంకాల ప్రకారం, 100 గ్రాముల పనీర్‌లో సుమారు 18 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. అదే సమయంలో 100 గ్రాముల ప్రాసెస్ చేయని చీజ్‌లో సుమారు 25 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అంటే ప్రోటీన్ పరంగా చూస్తే చీజ్‌లో ఎక్కువ మోతాదులో ప్రోటీన్ లభిస్తుందని స్పష్టమవుతోంది. ఇది కండరాల పెరుగుదలకు, శరీర బలానికి అవసరమైన అంశం.
కేలరీల విషయానికి…
కేలరీల విషయానికి వస్తే కూడా రెండు ఆహారాల మధ్య తేడా ఉంది. 100 గ్రాముల చీజ్‌లో దాదాపు 400 కేలరీలు ఉంటాయి. అదే పరిమాణంలో పనీర్‌లో సుమారు 250 కేలరీలు మాత్రమే ఉంటాయి. అంటే చీజ్‌లో కేలరీలు ఎక్కువగా ఉంటాయని అర్థం. అలాగే కొవ్వు పరిమాణం కూడా చీజ్‌లో ఎక్కువ. చీజ్‌లో సుమారు 33 గ్రాముల ఫ్యాట్ ఉండగా, పనీర్‌లో ఇది 20 గ్రాముల వరకు మాత్రమే ఉంటుంది.
ఈ గణాంకాలను చూసినప్పుడు చాలా మందికి ఒక సందేహం వస్తుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉన్న చీజ్‌ను తినాలా, లేక తక్కువ కేలరీలు ఉన్న పనీర్‌ను ఎంచుకోవాలా అనే ప్రశ్న తలెత్తుతుంది. దీనికి సమాధానం ఒక్కటే కాదు. ఇది పూర్తిగా వ్యక్తి అవసరాలపై ఆధారపడి ఉంటుందని డాక్టర్ శుభం వాట్స్ చెబుతున్నారు.
బరువు తగ్గాలని …
బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నవారికి తక్కువ కేలరీలు, తక్కువ కొవ్వు ఉన్న ఆహారం అవసరం. అలాంటి వారి కోసం పనీర్ మంచి ఎంపికగా ఉంటుందని ఆయన సూచిస్తున్నారు. పనీర్‌లో ప్రోటీన్ ఉండటంతో పాటు కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు నియంత్రణలో సహాయపడుతుంది. అలాగే ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో అనవసరంగా ఎక్కువ తినే అవకాశం తగ్గుతుంది.
బరువు పెరగాలని…
అదే సమయంలో బరువు పెరగాలని, కండరాల పరిమాణం పెంచాలని కోరుకునే వారికి చీజ్ మంచి ఎంపికగా ఉండొచ్చని ఆయన చెబుతున్నారు. చీజ్‌లో ప్రోటీన్‌తో పాటు కేలరీలు, కొవ్వు ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి అదనపు శక్తిని అందిస్తుంది. ఇది బల్కింగ్ చేసే వారికి ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. చీజ్‌ను అధికంగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రాసెస్డ్ చీజ్..
చీజ్ ఆరోగ్యానికి మంచిది కాదనే అభిప్రాయం ఎక్కువగా ప్రాసెస్డ్ చీజ్ వల్ల ఏర్పడిందని డాక్టర్ శుభం వాట్స్ వివరించారు. మార్కెట్లో లభించే కొన్ని రకాల చీజ్‌లలో అధిక ఉప్పు, కృత్రిమ పదార్థాలు ఉండవచ్చు. అవి ఆరోగ్యానికి హానికరం కావచ్చు. కానీ ప్రాసెస్ చేయని, సహజమైన చీజ్‌ను సరైన మోతాదులో తీసుకుంటే అది కూడా పోషకాహారంలో మంచి భాగంగా మారుతుందని ఆయన చెబుతున్నారు.

