న్యూఢిల్లీ, నవంబర్ 2 : పార్కిన్సన్ వ్యాధి పురోగతిని తెలుసుకునేందుకు రక్తంలోని ప్లేట్‌లెట్లు కీలక ఆధారంగా నిలిచే అవకాశం ఉందని తాజా పరిశోధన వెల్లడించింది. వ్యాధి ముదిరే కొద్దీ ఈ రక్తకణాల్లో జన్యు కార్యకలాపాలకు సంబంధించిన మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. మొత్తం రక్తంతో పోలిస్తే ప్లేట్‌లెట్లలోనే వ్యాధి దశలను వేరు చేయగలిగే సంకేతాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. భవిష్యత్తులో పార్కిన్సన్ పురోగతిని అంచనా వేసే బయోమార్కర్ల అన్వేషణకు ఈ ఫలితాలు కొత్త దారులు చూపుతున్నాయి. ఈ అధ్యయనం ‘మూవ్‌మెంట్ డిజార్డర్స్’ జర్నల్‌లో ప్రచురితమైంది.
అరుదైన కేసుతో పరిశోధన
స్పెయిన్‌కు చెందిన ఓ వ్యక్తికి 41 ఏళ్ల వయసులోనే పార్కిన్సన్ వ్యాధి నిర్ధారణ అయింది. మూడేళ్ల వ్యవధిలోనే జ్ఞాపకశక్తి క్షీణత కూడా అభివృద్ధి చెందింది. ఈ వ్యక్తిలో వ్యాధితో సంబంధమున్న ‘ఎస్‌ఎన్‌సీఏ’ జన్యువు ఉన్న ప్రాంతం మూడు ప్రతులుగా ఉన్నట్లు గుర్తించారు. ఈ జన్యువు ఉత్పత్తి చేసే ఆల్ఫా-సిన్యూక్లిన్ ప్రొటీన్ మెదడులో గడ్డలుగా పేరుకుపోవడం పార్కిన్సన్ వ్యాధితో ముడిపడి ఉంటుంది. ఈ జన్యుపరమైన మార్పు తల్లిదండ్రుల నుంచి సంక్రమించలేదని పరిశోధకులు తెలిపారు. రోగి 41 ఏళ్ల వయసులో వ్యాధి ప్రారంభ దశలో ఉన్నప్పుడు, 44 ఏళ్లకు జ్ఞాపకశక్తి క్షీణత అభివృద్ధి చెందిన తర్వాత సేకరించిన నమూనాలను పరిశోధకులు విశ్లేషించారు. జన్యువుల పనితీరులో వచ్చిన మార్పులను పోల్చి చూడగా.. మొత్తం రక్తంతో పోలిస్తే ప్లేట్‌లెట్లలో వ్యాధి పురోగతికి సంబంధించిన మార్పులు ఎక్కువగా కనిపించాయి. కణాలకు శక్తిని అందించే మైటోకాండ్రియా పనితీరు, ప్రొటీన్ల తయారీ, వాపు నియంత్రణకు సంబంధించిన జన్యువుల్లో ఈ మార్పులను గుర్తించారు.
మరో 33 మందిపై పరిశీలన
అరుదైన జన్యుపరమైన కేసులో గుర్తించిన మార్పులు ఇతర రోగుల్లోనూ ఉన్నాయా అని తెలుసుకునేందుకు మరో 15 మంది ప్రారంభ దశ పార్కిన్సన్ బాధితులు, 18 మంది ఆరోగ్యవంతుల నమూనాలను పరిశీలించారు. రోగుల ప్లేట్‌లెట్లలోనూ కొన్ని సారూప్య మార్పులు కనిపించాయి. ముఖ్యంగా ఎస్‌ఎన్‌సీఏ ఆర్‌ఎన్‌ఏ రూపంతో పాటు ప్రొటీన్ల తయారీలో పాలుపంచుకునే రెండు జన్యువుల వ్యక్తీకరణ తగ్గినట్లు గుర్తించారు. అయితే పరిశీలించిన జన్యువులకు సంబంధించి మొత్తం రక్తంలో గణనీయమైన మార్పులు కనిపించలేదు. జన్యుపరమైన, సాధారణ పార్కిన్సన్ వ్యాధి రూపాల్లో కొన్ని ఉమ్మడి జీవరసాయన ప్రక్రియలు ఉండొచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. సులభంగా సేకరించగలిగే ప్లేట్‌లెట్లలో కనిపించే మార్పులపై మరింత అధ్యయనం చేస్తే.. వ్యాధి పురోగతిని తెలిపే బయోమార్కర్లను గుర్తించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ పరిశోధన ప్లేట్‌లెట్లలోని మార్పులకు, పార్కిన్సన్ వ్యాధి పురోగతికి మధ్య సంబంధం ఉండొచ్చని సూచిస్తోంది. అయితే ఈ ఆధారాలతోనే వ్యాధి తీవ్రతను నిర్ధారించే పరీక్ష అందుబాటులోకి వచ్చినట్లు కాదు. పెద్ద సంఖ్యలో రోగులపై మరిన్ని అధ్యయనాలు నిర్వహించిన తర్వాతే వైద్యపరమైన ఉపయోగంపై స్పష్టత వస్తుంది.

