Friday, November 22, 2024
Homeహెల్త్Pigmentation: పిగ్మెంటేషన్ పోగొట్టే మాస్కులు ఫ్రీగా

Pigmentation: పిగ్మెంటేషన్ పోగొట్టే మాస్కులు ఫ్రీగా

మీ చర్మంపై మచ్చలు పోవాలంటే సింపుల్ టిప్స్ ఉన్నాయి

వయుసు రీత్యా లేదా ఎండవల్ల కూడా పిగ్మెంటేషన్ రావచ్చు. మీ చర్మాన్ని శుభ్రంగా ఉంచుతూ, కెమికల్స్ వీటిపై రాయకుండా సహజసిద్ధంగా పిగ్మెంటేషన్ వచ్చినచోట చర్మాన్ని లైటెన్ చేసుకునే మార్గాలు చాలా ఉన్నాయి..

- Advertisement -

చర్మం అందంగా ఉంటే మనం ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటాం. కానీ కొన్నిసార్లు సన్ స్పాట్స్, నల్లమచ్చలు, బ్రౌన్ స్పాట్స్ చర్మంపై ఏర్పడి ఇబ్బంది పడుతుంటాం. ఇప్పుడు మనం మాట్లాడుకునే పిగ్మెంటేషన్ విషయానికి వస్తే చర్మంపై ఏర్పడే బ్రౌన్ స్పాట్సే పిగ్మెంటేషన్. ఈ మచ్చలు ముఖం అందాన్ని పాడుచేస్తాయి. ముఖం కళావిహీనంగా కనపడుతుంది. అయితే వీటి వల్ల ప్రమాదమేమీ ఉండదు కానీ ముఖం అసహ్యంగా కనిపిస్తుంది. అధిక మెలనిన్ వల్ల చర్మంపై పిగ్మెంటేషన్ ఏర్పడుతుంది. వీటిని సహజమైన ఇంటి చిట్కాలతో కూడా పోగొట్టుకోవచ్చు.

వాటిల్లో ఒకటి బంగాళాదుంపలు. వీటితో పిగ్మెంటేషన్ సులభంగా పోతుంది. అంతేకాదు గీతలు, నల్ల మచ్చలను కూడా బంగాళాదుంపలు పోగొడతాయి. బంగాళాదుంప చర్మాన్ని కాంతివంతంచేయడమే కాదు అది శుభ్రంగా ఉండేలా చేస్తుంది కూడా. చర్మం టోనింగ్ ను కూడా బంగాళాదుంపలు మెరుగుపరుస్తాయి.
పిగ్మెంటేషన్ పోవడానికి బంగాళాదుంప ఫేస్ మాస్కు వేసుకోవాలి. మీడియం పరిమాణంలో ఉన్న బంగాళాదుంపను తీసుకుని దాన్ని బాగా కడిగి సగానికి కట్ చేయాలి. తర్వాత ముఖంపై కొద్దిగా నీళ్లు చల్లుకుని పిగ్మెంటేషన్ ఉన్న ప్రదేశంలో బంగాళాదుంప ముక్కతో సున్నితంగా రుద్దాలి. టైము ఉంటే బంగాళాదుంపను తురిమి దాన్నించి రసం తీసి ఆ రసాన్ని కూడా పిగ్మెంటేషన్ ఏర్పడ్డ ప్రదేశంలో పూయొచ్చు. మొత్తానికి బంగాళాదుంప ముక్క లేదా రసాన్ని అరగంట సేపు ఆ ప్రదేశంలో అప్లై చాయలి. తర్వాత గోరువెచ్చని నీటితో ఆ ప్రదేశాన్ని శుభ్రంగా కడగాలి. ఇలా ఒక నెలపాటు చేస్తే మీ చర్మంపై
మంచి ఫలితం కనిపిస్తుంది.


పిగ్మెంటేషన్ ను పోగొట్టే మరో ఇంటి చిట్కా నిమ్మ, కీర మిశ్రమం. నిమ్మ చర్మాన్ని బాగా ఎక్స్ ఫొయిలేట్ చేతుంది. చర్మంపై చేరిన మురికిని పూర్తిగా పోగొడుతుంది. కీరకాయ చర్మానికి కావలసిన హైడ్రేషన్ ని
అందిస్తుంది. చర్మాన్ని ఇది కాంతివంతం చయడంతో పాటు చర్మంపై ఏర్పడ్డ గీతలు, మచ్చలను పోగొడుతుంది కూడా. ఈ కాంబినేషన్ జిడ్డు చర్మం వారిపై బాగా పనిచేతుంది. ముఖాన్ని ఆయిల్ ఫ్రీగా చేస్తుంది. ఈ ఫేస్ మాస్కు అప్లై చేయాలంటే కీరకాయను ముక్కలుగా చేసి బ్లెండర్ వేసి గుజ్జులా చేయాలి. తాజానిమ్మ రసాన్నికొన్ని చుక్కలు కీరకాయ గుజ్జులో పిండి ఆ మిశ్రమాన్ని పిగ్మెంటేషన్ ఏర్పడ్డ ప్రదేశంలో అప్లై చేసి 20 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆతర్వాత నీళ్లతో ఆ ప్రదేశాన్ని కడగాలి. ఈ మాస్కును రోజూ ఉదయం, సాయంత్రం రెండు పూటలా చర్మానికి రాస్తే నెల రోజుల్లో మంచి ఫలితాన్ని చూస్తారు.


బాదం మాస్కు కూడా పిగ్మెంటేషన్ పై బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా సెన్సిటివ్, డ్రై స్కిన్ ల మీద ఈ మాస్కు బాగా పనిచేస్తుంది. పిగ్మెంటేషన్ ని తొలగించడంలో పాలు, బాదం ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయి. పాలు చర్మాన్ని మెరిసేట్టు చేయడమే కాదు చర్మంపై ఉండే మ్రుతకణాలను తొలగిస్తాయి. బాదంలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది ఏజింగ్ ని కనిపించనీయకుండా యంగ్ గా ఉంచుతుంది. చర్మాన్ని ఉత్తేజితం చేస్తుంది. దీనికి ఒక టేబుల్ స్పూన్ బాదం పప్పులు తీసుకుని వాటిని పాలల్లో రాత్రంతా నాననివ్వాలి. తర్వాత వాటిని పేస్టులా చేయాలి. ముఖాన్ని బాగా కడుక్కుని పొడిగా తుడుచుకోవాలి. తర్వాత బాదం, పాల పేస్టును పిగ్మేంటేషన్ ఉన్న ప్రదేశంలో రాసి పదిహేను నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత నీళ్లతో ఆ ప్రదేశాన్ని శుభ్రంగా కడగాలి. ఇలా నిత్యం ఒక రెండు నెలల పాటు చేస్తే చర్మంపై మంచి ప్రభావం కనపడుతుంది. రాత్రి పూట రాసుకుని పడుకుంటే పిగ్మెంటేషన్ మంచిగా పోతుంది.

యాపిల్ సిడార్ వెనిగర్ చర్మాన్ని మెరిపించడంలో చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాదు పిగ్మెంటేషన్, నల్లమచ్చలు, మరకలను పోగొడుతుంది. చర్మం పిహెచ్ ప్రమాణాలను పునరుద్ధరించడంలో కూడా ఎంతో సహాయపడుతుంది. దీంతో చర్మం ఎంతో కాంతివంతంగా ఉంటుంది. యాపిల్ సిడార్ వెనిగర్ మంచి ఎక్స్ ఫొయిలేషన్ ఏజెంట్ కూడా. ఇది చర్మానికి కావలసింత సాంత్వన నివ్వడమే కాకుండా స్కిన్ టెక్స్చెర్ ను ఎంతో బాగా మెరుగుపరుస్తుంది కూడా. దీన్ని ముఖానికి రాసుకోవాలంటే యాపిల్ సిడార్ వెనిగర్, నీళ్లు రెండింటినీ సమపాళ్లల్లో తీసుకోవాలి. ఈ మిశ్రమంతో చర్మంపై పిగ్మెంటేషన్ ఉన్న ప్రదేశాన్ని శుభ్రంగా కడుక్కొని మూడు నాలుగు నిమిషాలు అలాగే వదిలేయాలి. తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఇంట్లో ఉండే పసుపు కూడా సహజసిద్ధమైన బ్లీచింగ్ ఏజెంట్. అంతేకాదు యాంటీ బాక్టీరియల్ గుణాలు కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మంపై ఉన్న మురికిని పోగొడుతుంది. అంతేకాదు చర్మరంధ్రాలను శుభ్రపరుస్తుంది. వీటితో పాటు చర్మాన్ని కాంతివంతం చేస్తుంది కూడా. భవిష్యత్తుల్లో స్కిన్ బ్రేకవుట్స్ తలెత్తకుండా కూడా పసుపు నిరోధిస్తుంది. దీంతో చర్మం సహజకాంతితో మెరిసిపోతుంది.

అంతేకాదు యాక్నే, గీతలు,పిగ్మెంటేషన్, నల్లమచ్చలను పోగొట్టడంలో ఎంతో బాగా పనిచేస్తుంది. దీనికి ఒక టీస్పూను పసుపు తీసుకోవాలి. అందులో ఒక టీస్పూను నిమ్మరసం వేసి పేస్టులా చేయాలి. ఆ పేస్టును పిగ్మెంటేషన్ ఉన్న ప్రదేశంలో రాసి 20 నిమిషాలు అలాగే ఉంచుకోవలి. తర్వాత చల్లటినీళ్లతో కడుక్కోవాలి. ఇలా రోజూ చేయాలి. పిగ్మెంటేషన్ పోగొట్టే మరో ఇంటి చిట్కా విటమిన్ ఇ కాప్సూల్. విటమిన్ ఇ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కాంతివంతంగా, మచ్చలు లేకుండా చేస్తుంది. ఇందుకు విటమిన్ ఇ కాప్సూల్స్ బాగా పనిచేస్తాయి. ఇది చర్మ ఎలాస్టిసిటీని కాపాడుతుంది. అంతేకాదు సూర్యరశ్మి నుంచి విడుదలయ్యే అతినీలలోహిత కిరణాల బారి నుంచి చర్మాన్ని సంరక్షిస్తుంది. విటమిన్ ఇ లోని యాంటాక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ మీద శక్తివంతంగా పోరాడడమే కాకుండా చర్మాన్ని పరిశుభ్రంగా ఉంచుతాయి. ఇందుకోసం మూడు విటమిన్ ఇ కాప్పూల్స్ తీసుకుని అందులో నాలుగుచుక్కల ఆముదం నూనె కలపాలి. ఆ పేస్టును రాత్రి నిద్రపోయేముందు పిగ్మెంటేషన్ ఉన్న ప్రదేశంలో పూసి పొద్దున్న లేచిన తర్వాత నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా నిత్యం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

బొప్పాయి కూడా పిగ్మెంటేషన్ తొలగించడంలో ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. ఇందులో పపైన్ అనే ఎంజేమ్ ఉంటుంది. ఇది చర్మం ఎక్స్ ఫొయిలేషన్ ప్రక్రియలో ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. బొప్పాయిలో పీచుపదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు, యాంటాక్సి డెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మాన్ని ఎంతో బాగా మాయిశ్చరైజ్ చేస్తాయి. చర్మాన్ని శుభ్రంగా ఉంచడంతో పాటు పిగ్మెంటేషన్ ని పోగొడతాయి. అంతేకాదు బొప్పాయి తొక్కలో రెటిన్ ఎ ఉంటుంది. ఇది చర్మంపై ఏర్పడ్డ ముడతలను, వయసుతో ఏర్పడ్డ మచ్చలను పోగొడతుంది. చిన్న బొప్పాయి ముక్కను తీసుకుని దాన్ని గుజ్జులా చేయాలి. ఆ రసాన్ని ముఖంపై పిండి పదిహేను నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా రోజూ ఒక నెల పాటు చేస్తే మంచి ఫలితం చూస్తారు.

అలొవిరా కూడా చర్మంపై బాగా పనిచేస్తుంది. దీంట్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇవి చర్మాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి. సన్ బర్న్స్ తగ్గించడమే కాదు వాటి నుంచి చర్మానికి ఎంతో సాంత్వననిస్తుంది. గాయాలను సులభంగా మన్పుతుంది. ఇది చర్మానికి బాగా మాయిశ్చరైజర్ ని అందిస్తుంది. వ్రుద్ధాప్యం ఛాయలు చర్మంపై తలెత్తకుండా చర్మాన్ని సంరక్షిస్తుంది. చర్మంపై ఏర్పడ్డ యాక్నే, గీతలను కూడా బాగా తగ్గిస్తుంది. ఇందుకు రెండు టేబుల్ స్పూన్ల అలొవిరా జెల్ ను దాని ఆకు నుంచి తీసి అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి పేస్టులా చేయాలి. దాన్ని ముఖంపై అప్లై చేసి 20 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఇది పిగ్మెంటేషన్ ను పొగొట్టే మరో మంచి ఇంటి చిట్కా. ఈ సమస్యను పరిష్కరించే మరో ఇంటి చిట్కా గ్రీన్ టీ. జిడ్డు చర్మాన్ని ఇదులోని పదార్థాలు జిడ్డు చర్మాన్ని బాగా నియంత్రిస్తాయి. అంతేకాదు యాక్నే, ఏజింగ్ లను తగ్గిస్తాయి. అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని కాపాడతాయి. ఒక గ్రీన్ టీ బ్యాగు తీసుకోవాలి. అలాగే ఒక కప్పు నీలు రెడీ పెట్టుకోవాలి. ఈ నీళ్లను ఉడికించి బౌల్ లో పోసి అందులో గ్రీన్ టీ బ్యాగ్ వేసి ఐదు నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత టీ బ్యాగ్ ను బయటకు తీసి చల్లారనివ్వాలి. తర్వాత దాన్ని పిగ్మెంటేషన్ ఉన్న ప్రదేశంలో పెట్టి సున్నితంగా రుద్దాలి. రోజుకు ఇలా రెండుసార్లు చేస్తే వేగంగా మంచి ఫలితాలు చూస్తారు.


అలాగే ఎర్ర ఉల్లిపాయ కూడా పిగ్మెంటేషన్ తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. ఒక ఎర్ర ఉల్లిపాయ తీసుకుని ఒక ముక్ఖ కట్ చేయాలి. దానితో పిగ్మెంటేషన్ ఉన్న చోట రబ్ చేసి పది నిమిషాలు అలాగే ఉంచి ఆతర్వాత గోరువెచ్చటి నీటితో ఆ ప్రదేశాన్ని శుభ్రంగా కడగాలి. ఎర్ర ఉల్లిపాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మంచి యాంటి ఆక్సిడెంట్ అని వేరే చెప్పక్కర్లేదు. పెరుగు కూడా పిగ్మెంటేషన్ పై బాగా పనిచేస్తుంది. ఇందులో జింకు, కాల్షియం, విటమిన్ బి, లాక్టిక్ యాసిడ్ లు ఉన్నాయి. ఇవన్నీ కూడా చర్మాన్ని ఎక్స్ ఫొయిలేషన్ చేయడంలో బాగా పనిచేస్తాయి. చర్మాన్ని మ్రుదువుగా చేస్తాయి. చర్మానికి కావలసిన మాయిశ్చరైజర్ ని కూడా పెరుగు అందిస్తుంది. ఏజింగ్ ప్రోసెన్ ను ఇది ఆలస్యం చేస్తుంది కూడా. ఇందులో యాంటిఫంగల్ గుణాలు చర్మాన్ని ఎలాంటి ఇన్ఫెక్షన్ల నుంచైనా సరే సంరక్షిస్తుంది. ఒక టేబుల్ స్పూను పెరుగు తీసుకుని పిగ్మెంటేషన్ ఉన్న ప్రదేశంలో అప్లై చేసి 20 నిమిషాలు దాన్ని అలాగే
వదిలేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ఆ ప్రదేశాన్ని కడగాలి. పాలు కూడా పిగ్మెంటేషన్ ను పోగొడుతాయి. పాలల్లో లాక్టిక్ సిడ్ ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. దీనితో పిగ్మెంటేషన్ ను పోగొట్టడం కూడా ఎంతో సులువు. ఇది మంచి స్కిన్ ఎక్స్ ఫొయిలేటర్ కూడా. ఇది చర్మ రంధ్రాలను శుభ్రంగా ఉంచుతుంది. చర్మాన్ని క్లీన్ గా ఉంచుతుంది. పచ్చిపాలను నిత్యం చర్మంపై
రాసుకుంటే చర్మం కాంతివంతం అవడమే కాదు చర్మం ఎంతో మ్రుదువుగా, సిల్కులా మెరిసిపోతుంది. అందుకే ఒక బౌల్ తీసుకుని అందులో సగం పచ్చి పాలు పోయాలి. ముఖంపై కాటన్ బాల్ తో ఆ పాలను బాగా అప్లై చేసి పదిహేను నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖం కడుక్కోవాలి.

ఇవి కాకుండా నిత్యం సన్ స్క్రీన్ వాడడం వల్ల కూడా పిగ్మెంటేషన్ పోతుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల కూడా పిగ్మేంటేషన్ చర్మంపై ఏర్పడదు. నిత్యం విటమిన్లు బాగా ఉన్న డైట్ తీసుకుంటే
మంచిది. యాంటిఇన్ఫ్లమేటరీ స్కిన్ కేర్ ఉత్పత్తులను వాడితే మంచిది. చర్మాన్ని బాగా హైడ్రేటెడ్ గా ఉంచాలి. రాత్రి నిద్రపోవడానికి ముందు మీ చర్మం పరిశుభ్రంగా, అద్దంలా మెరుస్తూ ఉండాలని మరవొద్దు. వారానికి ఒకటి లేదా రెండు సార్లు చర్మాన్ని తప్పనిసరిగా ఎక్స్ ఫొయిలేట్ చేసుకోవాలి. ఇవి పాటిస్తే కూడా మీ చర్మం పిగ్మెంటేషన్ బారిన పడదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News