వాయు కాలుష్యం(Air Pollution) నగరంలో కోరలు చాస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ఘనపు మీటరుకు 5 మైక్రోగ్రాముల కంటే ఎక్కువగా పీఎం 2.5 ఉండకూడదు. కానీ, సగటున నగరవ్యాప్తంగా సగటున 32 నుంచి 35 మైక్రోగ్రాముల వరకు ఉంటోంది. అంటే దాదాపు ఏడు రెట్లు ఎక్కువగా కాలుష్యభూతం నగరవాసులను పట్టి పీడిస్తోంది. దీనివల్ల పెద్దవాళ్లకే కాదు… చంటిపిల్లలకు, ఇంకా చెప్పాలంటే గర్భస్థ శిశువులకూ(Unborn Babies) ముప్పు వాటిల్లుతోంది. ఈ విషయం నగరానికి చెందిన కొంతమంది వైద్యుల పరిశోధనలో వెల్లడయ్యింది.
తాజాగా ఈ అంశం గురించి జరిగిన పరిశోధనల్లో… చాలామంది పిల్లలు పుడుతూనే తక్కువ బరువుతో పుట్టడం, ఆస్థమా ఉండడం, శరీరం లోపల పెరగాల్సిన అవయవాలు సక్రమంగా రూపుదిద్దుకోకపోవడం, దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు… ఇలాంటివి ఉంటున్నాయి. గర్భిణులు ఏదో పనిమీద బయటకు వెళ్లినప్పుడు ఆరు బయట ఉండే కలుషిత గాలిని పీల్చుకోవడమే ఇందుకు ప్రధాన కారణం అవుతోంది. గడిచిన ఐదేళ్లలో తక్కువ బరువుతో పుడుతున్న పిల్లల సంఖ్య హైదరాబాద్ నగరంలో 15% పెరిగింది.
ఇక ఆస్థమాతో పుడుతున్న పిల్లల సంఖ్య అయితే ఏకంగా 20% పెరిగింది. ఇవి కేవలం అంకెలు మాత్రమే కావు.. హైదరాబాద్ నగర కాలుష్యం ఎంత తీవ్రంగా ఉందో చెప్పే ప్రత్యక్ష సాక్ష్యాలు. దీనంతటికీ ప్రధాన కారణం హైదరాబాద్‌లో దిగజారుతున్న వాయునాణ్యతే. నగరంలో శరవేగంగా పెరుగుతున్న పారిశ్రామికీకరణ, వాహనాల సంఖ్య, తగినంతగా లేని వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ కలిసి మనం పీల్చుకునే గాలిని విషతుల్యం చేస్తున్నాయి. పీఎం 2.5, పీఎం 10, నైట్రోజన్ ఆక్సైడ్ లాంటి విషపూరిత కాలుష్య పదార్థాలు శ్వాసపరమైన సమస్యలకు కారణం అవుతున్నాయి.

ముఖ్యంగా పిల్లలు తక్కువ బరువుతో పుట్టడానికి, ఇంకా అనేక ఆరోగ్య సమస్యలకు ప్రధానంగా దోహదం చేస్తున్నాయి. నిజానికి నవజాత శిశవుల ఊపిరితిత్తులు ఇంకా తయారవుతూ ఉంటాయి. పూర్తిగా సిద్ధం కావు. వాళ్ల రోగనిరోధక శక్తి కూడా బలహీనంగా ఉంటుంది. కలుషిత గాలికి గురికావడం వల్ల వారిని జీవితాంతం అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. అందులో ప్రధానంగా దీర్ఘకాల శ్వాసకోశ సమస్యలు, గుండెకవాటాల వ్యాధులు, నాడీ వ్యవస్థ సమస్యలు ఉంటాయి. కొన్ని కేసుల్లో అయితే.. పిల్లలు పుడుతూనే చనిపోతున్నారు. లేదా సడన్ ఇన్‌ఫాంట్ డెత్ సిండ్రోమ్ (సిడ్స్)కు గురవుతున్నారు.
గర్భంతో ఉన్నప్పుడు, పిల్లలను కన్న తర్వాత కూడా కొంతమంది మహిళలు ఈ కాలుష్యం బారిన పడుతున్నారు. దానివల్ల వారికి రక్తపోటు పెరుగుతోంది, మూత్రంలో ప్రోటీన్లు ఎక్కువ అవుతున్నాయి, చాలామందికి ప్రసవం తర్వాత డిప్రెషన్ రావడానికి కూడా ఈ కాలుష్యం ప్రధాన కారణం అవుతోంది.
హార్వర్డ్ విశ్వవిద్యాలయం తాజాగా చేసిన పరిశోధనల ప్రకారం, ఆరు నెలలు దాటిన తర్వాత కూడా గర్భిణులు ఇలా వాయుకాలుష్యానికి గురైతే.. వాళ్ల పిల్లలకు పుడుతూనే ఆటిజం ఉండే అవకాశాలు చాలా ఎక్కువ. తల్లి వాయు కాలుష్యానికి గురికావడం వల్ల లోపల ఉండే కణాలు, కణజాలాలు కూడా దెబ్బతింటాయి. దానివల్లే ఇలా ఆటిజం, ఇతర సమస్యలు తలెత్తుతాయని హార్వర్డ్ పరిశోధకులు తేల్చారు. మరికొందరిలో అయితే మాయ సరిగ్గా ఉండకపోవడంతో గర్భంలోని పిండానికి తగినంతగా పోషకాలు, ఆక్సిజన్ అందవు. దానివల్ల పుట్టే పిల్లలకు రోగనిరోధక శక్తి గణనీయంగా తగ్గిపోతుంది. వాళ్లు పుట్టిన తర్వాత తరచు ఎలర్జీలకు గురికావడం, ఇతర సమస్యలు వస్తాయి.

పీఎం 2.5 మరింత ప్రమాదకరం..
ఇతర అన్నిరకాల కాలుష్యం కంటే పీఎం 2.5 అనేది అత్యంత ప్రమాదకరం. ఇది అతి సూక్ష్మ ధూళి కణాలతో కూడుకున్నది. ఇది నేరుగా ఊపిరితిత్తుల్లోకి, రక్తప్రవాహంలోకి కూడా వెళ్లిపోతుంది. అందువల్ల గర్భస్థ శిశువుల ఎదుగుదలకు ఇది చాలా కీడు చేస్తుంది. సాధారణంగా వేసవి కాలంలో దుమ్ము, ధూళి రోడ్ల మీద బాగా ఎక్కువగా ఎగురుతుంటాయి. అవన్నీ పీఎం2.5 రూపంలోనే ఉండి, నేరుగా లోపలకు వెళ్లిపోతాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవీ..
- పరిశ్రమలు, వాహనాలకు కఠినమైన ఉద్గార నిబంధనలు విధించి అమలుచేయాలి
- ప్రజారవాణాను మెరుగుపరిచి, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాలి
- పచ్చదనాన్ని పెంపొందించి, మరిన్ని ప్రజోపయోగ బహిరంగ స్థలాలు సృష్టించాలి
- వ్యర్థాల నిర్వహణ విధానాలను రూపొందించి, అమలుచేయాలి.
- దుమ్ము ధూళి నిండిన రోడ్లపై తరచు నీళ్లు చల్లించి వాటిని అణచివేయాలి
- గర్భిణులు బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా మాస్క్ ధరించాలి
- ఎక్కడికక్కడ కాలుష్యస్థాయి ప్రజలకు తెలిసేలా ఇండికేటర్ బోర్డులు పెట్టాలి