HomeTop Storiesగర్భిణుల్లో విటమిన్‌ సి లోపం.. బిడ్డ మానసిక వికాసానికి ముప్పు..!

గర్భిణుల్లో విటమిన్‌ సి లోపం.. బిడ్డ మానసిక వికాసానికి ముప్పు..!

న్యూఢిల్లీ, నవంబర్ 4 (తెలుగుప్రభ): గర్భధారణ సమయంలో తల్లికి విటమిన్‌ – సి తగినంత అందకపోతే శిశువు మెదడు, మానసిక, భావోద్వేగ వికాసంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. విటమిన్‌ – సి తక్కువగా తీసుకున్న తల్లుల పిల్లల్లో ఆరు నెలల వయసులోనే చిరాకు, అసహనం, ఆందోళన వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇవి భవిష్యత్తులో మానసిక ఆరోగ్య సమస్యలకు ముందస్తు సూచనలు కావచ్చని తెలిపారు. ఒరెగాన్‌ హెల్త్‌ అండ్‌ సైన్స్‌ యూనివర్సిటీ పరిశోధకులు 300 మందికి పైగా గర్భిణుల పోషకాహారం, మానసిక ఆరోగ్య వివరాలను విశ్లేషించారు. డిప్రెషన్‌, ఆందోళన, ఒత్తిడి స్థాయిలతో పాటు ఆహారం, సప్లిమెంట్ల ద్వారా అందుతున్న విటమిన్‌ – సి పరిమాణాన్ని నమోదు చేశారు.

- Advertisement -

శిశువులకు ఆరు నెలల వయసు వచ్చిన తర్వాత వారి ప్రవర్తన, భావోద్వేగ స్వభావంపై సంరక్షకుల నుంచి వివరాలు సేకరించారు. గర్భధారణ సమయంలో తల్లుల్లో ఒత్తిడి పెరిగితే శిశువుల్లోనూ ప్రతికూల భావోద్వేగాలు అధికమవుతున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా గర్భధారణ సమయంలో విటమిన్‌ – సి సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల తల్లి ఒత్తిడికి, శిశువుల్లో ప్రతికూల భావోద్వేగాలకు మధ్య ఉన్న సంబంధం తగ్గినట్లు అధ్యయనంలో వెల్లడైంది. ఆహారం ద్వారా లభించే విటమిన్‌ – సి కంటే సప్లిమెంట్ల ప్రభావం ఈ విషయంలో స్పష్టంగా కనిపించిందని పరిశోధకులు పేర్కొన్నారు. విటమిన్‌ – సిలోని యాంటీఆక్సిడెంట్‌ లక్షణాలు, ఒత్తిడిని నియంత్రించే గుణాలు గర్భస్థ శిశువు మెదడు వికాసానికి తోడ్పడవచ్చని తెలిపారు. గర్భంలోని పోషక వాతావరణం శిశువు మెదడు అభివృద్ధితో పాటు భావోద్వేగాలు, ప్రవర్తనను ప్రభావితం చేస్తుందని పరిశోధన ప్రధాన రచయిత ఎలిజబెత్‌ వుడ్‌ పేర్కొన్నారు. ఈ అధ్యయనం ‘డెవలప్‌మెంటల్‌ సైకాలజీ’ జర్నల్‌లో ప్రచురితమైంది. అయితే వైద్యుల సలహా మేరకే గర్భిణులు విటమిన్‌ – సి సప్లిమెంట్లు తీసుకోవాలని పరిశోధకులు సూచించారు.

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News