Premature White Hair Causes:ఇప్పుడు చాలా మంది యువతలో చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడటం ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. ఒకప్పుడు తెల్ల జుట్టు అనేది వయస్సు పెరిగిన పెద్దల్లో మాత్రమే కనిపించేది. కానీ నేటి ఆధునిక జీవనశైలిలో, 18 ఏళ్ల నుంచి 20 ఏళ్ల మధ్య ఉన్న యువతలో కూడా ఈ సమస్య ఎక్కువగా కనపడుతున్న విషయం తెలిసిందే. దీనికి కారణాలు కేవలం వంశపారంపర్యం మాత్రమే కాకుండా, విటమిన్ లోపాలు, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, నిద్రలేమి వంటి అంశాలూ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
మెలనిన్..
మన జుట్టు రంగు ‘మెలనిన్’ అనే వర్ణద్రవ్యంపై ఆధారపడి ఉంటుంది. ఈ వర్ణద్రవ్యం మెలనోసైట్ కణాల ద్వారా ఉత్పత్తి అవుతుంది. శరీరంలో ఈ కణాలకు తగినంత పోషకాలు అందకపోతే లేదా అవి బలహీనపడితే, మెలనిన్ ఉత్పత్తి తగ్గుతుంది. అప్పుడు జుట్టు సహజ రంగును కోల్పోయి తెల్లబడుతుంది. కొంతమందిలో ఈ ప్రక్రియ సహజంగా వృద్ధాప్య సమయంలోనే జరుగుతుంది కానీ, నేటి తరం యువతలో ఈ మార్పు చాలా తొందరగా కనబడుతోంది.
Also Read:https://teluguprabha.net/health-fitness/is-coconut-water-safe-for-babies-under-one-year/
విటమిన్ లోపం..
ఇందుకు ప్రధాన కారణాల్లో ఒకటి విటమిన్ లోపం. ముఖ్యంగా విటమిన్ బి12 మరియు విటమిన్ డి వంటి పోషకాలు తగిన మోతాదులో శరీరానికి అందకపోవడం వల్ల జుట్టు అకాలంగా బూడిద రంగులోకి మారుతుంది. విటమిన్ బి12 శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి, ఆక్సిజన్ సరఫరాకు అవసరం. ఇది జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విటమిన్ తక్కువగా ఉంటే, మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది.
విటమిన్ బి12 లోపం..
వైద్య నిపుణుల ప్రకారం, శాఖాహారులు విటమిన్ బి12 లోపానికి ఎక్కువగా గురవుతారు. ఎందుకంటే ఈ విటమిన్ ఎక్కువగా జంతు ఆధారిత ఆహార పదార్థాలలో లభిస్తుంది. శాఖాహారులు పాలు, పెరుగు, గుడ్లు, పుట్టగొడుగులు వంటి ఆహారాలను తీసుకోవడం ద్వారా ఈ లోపాన్ని తగ్గించుకోవచ్చు.
విటమిన్ డి…
అదేవిధంగా విటమిన్ డి కూడా జుట్టు ఆరోగ్యానికి చాలా అవసరం. ఇది కేవలం ఎముకలకు మాత్రమే కాదు, జుట్టు కుదుళ్ల పనితీరుకూ సంబంధం ఉంది. సూర్యరశ్మి ద్వారా ఈ విటమిన్ మన శరీరంలో సహజంగా ఏర్పడుతుంది. కానీ నేటి జీవనశైలిలో ఎక్కువ మంది రోజంతా ఇంట్లోనే గడపడం వల్ల సూర్యరశ్మి తగలడం తగ్గిపోతోంది. ఫలితంగా విటమిన్ డి లోపం పెరిగి, జుట్టు కుదుళ్లు బలహీనమవుతాయి. ఒక అధ్యయనం ప్రకారం, విటమిన్ డి తక్కువగా ఉన్న పిల్లలలో జుట్టు త్వరగా తెల్లబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఎండలో గడపడం..
ఈ లోపాన్ని తగ్గించుకోవాలంటే రోజుకు కనీసం 15 నుండి 20 నిమిషాలు ఎండలో గడపడం అవసరం. అదేవిధంగా కొవ్వు చేపలు, పాలు, ధాన్యాలు, పుట్టగొడుగులు వంటి ఆహారాలను రోజువారీ ఆహారంలో చేర్చడం మంచిది. ఇవి విటమిన్ డి ని సహజంగా అందించడంలో సహాయపడతాయి.
ఒత్తిడి కూడా..
విటమిన్ లతో పాటు ఒత్తిడి కూడా జుట్టు రంగుపై ప్రభావం చూపుతుంది. మానసిక ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఇది మెలనిన్ ఉత్పత్తిని తగ్గించడంతో, జుట్టు త్వరగా తెల్లబడే అవకాశం ఉంటుంది. అలాగే నిద్రలేమి, ధూమపానం, అసమతుల్య ఆహారం కూడా జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీసే అంశాలుగా చెప్పవచ్చు.
పాలు, పెరుగు, గుడ్లు..
జుట్టు తెల్లబడటాన్ని పూర్తిగా ఆపడం సాధ్యం కాకపోయినా, కొన్ని జాగ్రత్తలతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. ప్రతిరోజూ సమతుల్య ఆహారం తీసుకోవడం అత్యంత ముఖ్యం. పాలు, పెరుగు, గుడ్లు, ఆకుకూరలు, గింజలు, పండ్లు వంటి పోషక పదార్థాలను ఆహారంలో చేర్చాలి. ఇవి శరీరానికి అవసరమైన విటమిన్ లు, ఖనిజాలను అందిస్తాయి.
విటమిన్ సప్లిమెంట్లు..
వైద్యుల సలహాతో విటమిన్ సప్లిమెంట్లు తీసుకోవచ్చు. అయితే వాటిని స్వయంగా మొదలుపెట్టకుండా, నిపుణుల సూచన మేరకు మాత్రమే వాడటం మంచిది. అదేవిధంగా ప్రతిరోజూ ఎండలో కొంత సమయం గడపడం ద్వారా విటమిన్ డి అవసరాన్ని తీర్చుకోవచ్చు.
జుట్టు సంరక్షణలో సహజ పద్ధతులను పాటించడం కూడా మంచిది. ఉదాహరణకు కొబ్బరినూనె, ఆముదం నూనెతో తలకు మసాజ్ చేయడం ద్వారా రక్త ప్రసరణ మెరుగుపడి, జుట్టు కుదుళ్లకు పోషకాలు సులభంగా చేరతాయి. మసాజ్ చేయడం ద్వారా ఒత్తిడి కూడా తగ్గుతుంది, ఇది మెలనిన్ ఉత్పత్తిని సహజ స్థాయిలో ఉంచడంలో సహాయపడుతుంది.
Also Read: https://teluguprabha.net/gallery/health-benefits-of-eating-papaya-at-night-2/
జుట్టు కోసం మార్కెట్లో లభించే కెమికల్ ఆధారిత ఉత్పత్తులను అతి ఎక్కువగా వాడకూడదు. ఇవి తాత్కాలిక ఫలితాలనిచ్చినా, దీర్ఘకాలంలో జుట్టు బలహీనమయ్యే ప్రమాదం ఉంది. సహజ పదార్థాలతో తయారైన షాంపూలు లేదా ఆయిల్స్ వాడటం సురక్షితం.


