Side Effects of Diapers on Babies: శిశువులకు డైపర్స్ వాడకం అనేది ఆధునిక జీవితంలో అనివార్యం అయ్యింది. ఇవి సౌలభ్యంతో పాటుగా పరిశుభ్రతను అందిస్తున్నప్పటికీ.. వాటి వాడకం వల్ల కలిగే లాభాలు, నష్టాలపై చర్చ నిరంతరం కొనసాగుతోంది. ప్రయాణాల్లో, రాత్రిపూట నిద్రకు భంగం కలగకుండా డైపర్లు ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే ఇవి చర్మ సమస్యలు, పర్యావరణపరమైన నష్టాలకు కూడా దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు.
డైపర్‌ల వాడకం వల్ల లాభాలు:
- సౌలభ్యం: ఆధునిక యుగంలో “డైపర్స్” అనేది తల్లిదండ్రులకు ఈజీ పనిగా మారింది. ప్రయాణాల్లో మరియు బయట ఉన్నప్పుడు శిశువులను శుభ్రంగా ఉంచడానికి డైపర్లు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి. ఇవి తల్లిదండ్రుల పని భారాన్ని గణనీయంగా తగ్గిస్తాయి.
- నిద్రకు భంగం ఉండదు: రాత్రిపూట డైపర్లు వేయడం వల్ల శిశువు మూత్రం వల్ల నిద్రలేవకుండా ఉంటుంది. దీనివల్ల శిశువుతో పాటు తల్లిదండ్రులు కూడా ప్రశాంతంగా నిద్రపోవచ్చు.
డైపర్‌ల వాడకం వల్ల నష్టాలు:
- డైపర్ రాషెస్: డైపర్‌లు ఎక్కువసేపు తడిగా ఉంటే శిశువు చర్మంపై ఎర్రటి దద్దుర్లతో పాటుగా.. దురద వంటి డైపర్ రాషెస్ వచ్చే అవకాశం ఉంది. ఇది శిశువుకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
- ఆర్థిక భారం: డైపర్లు నిరంతరం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇది కుటుంబాలకు ఆర్థికంగా భారంగా మారుతుంది.
- పర్యావరణ సమస్యలు: వాడిన డైపర్లు భూమిలో కలిసిపోవడానికి చాలా ఏళ్లు పడుతుంది. ఇది పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది.
పూర్వపు పద్ధతులు: డైపర్‌లు లేని రోజుల్లో మన పెద్దవారు సంప్రదాయ పద్ధతులను పాటించేవారు. పాత నూలు చీరలు లేదా కాటన్ బట్టలను ఉపయోగించేవారు. ఇవి శిశువు చర్మానికి మంచివి. వాటిని శుభ్రం చేసి మళ్లీ వాడుకోవచ్చు. అంతేకాకుండా.. చిన్ననాటి నుంచే శిశువులకు మల, మూత్ర విసర్జన శిక్షణ ఇచ్చేవారు.
Also Read:https://teluguprabha.net/health-fitness/prediabetes-warning-signs-prevention-tips/
నిర్ణయం తీసుకోవడంలో సమతుల్యం: డైపర్‌ల వాడకంపై ఒక సమతుల్య నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రయాణాల్లో, అత్యవసర సమయాల్లో మాత్రమే డైపర్లు వాడాలని సూచిస్తున్నారు. మిగిలిన సమయాల్లో వాటిని మానుకోవడానికి ప్రయత్నించడం మంచిదని అంటున్నారు. ఒకవేళ డైపర్లు వాడితే.. ప్రతి 2-3 గంటలకు ఒకసారి మార్చడం ఉత్తమం అని అంటున్నారు. రాషెస్ రాకుండా క్రీమ్‌లు వాడటం తప్పనిసరని నిపుణులు సూచిస్తున్నారు. శిశువు చర్మం సున్నితంగా ఉంటే వైద్యుడి సలహా తీసుకోవడం ఉత్తమం.


