Benefits of psychotherapy : ఉరుకుల పరుగుల జీవితంలో మనసు అలసిపోతోందా? ఆందోళన, ఒత్తిడి, కుంగుబాటు వంటివి మిమ్మల్ని లోలోపల దహించివేస్తున్నాయా? నలుగురిలో ఏమనుకుంటారోనన్న భయంతో మీ బాధను ఎవరికీ చెప్పుకోలేక మౌనంగా భరిస్తున్నారా? అయితే, మీలాంటి వారికోసమే ఒక శక్తివంతమైన పరిష్కారం ఉందని మానసిక నిపుణులు భరోసా ఇస్తున్నారు. అదే “సైకోథెరపీ”. అసలు సైకోథెరపీ అంటే ఏమిటి? ఇది కేవలం కౌన్సెలింగేనా, అంతకు మించి ఉందా..? ఈ ‘మాటల వైద్యం’ మనసు గాయాలను ఎలా మాన్పుతుంది…?
ఏమిటీ ‘సైకోథెరపీ’ : ‘సైకోథెరపీ’ని సాధారణ పరిభాషలో ‘టాక్ థెరపీ’ లేదా ‘మాటల వైద్యం’ అని పిలుస్తారు. ఇది శిక్షణ పొందిన మానసిక ఆరోగ్య నిపుణుడితో మాట్లాడటం ద్వారా మానసిక, భావోద్వేగ, ప్రవర్తనా సమస్యలకు చికిత్స అందించే ఒక శాస్త్రీయ ప్రక్రియ అని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ (NIMH) వివరిస్తోంది. ఇది కేవలం సలహాలు ఇవ్వడం కాదు, మీ ఆలోచనా విధానంలోని లోపాలను గుర్తించి, వాటిని సరిదిద్దేందుకు, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకునేందుకు సహాయపడే ఒక చికిత్సా విధానం.
కౌన్సెలింగ్ ≠ సైకోథెరపీ : చాలామంది కౌన్సెలింగ్, సైకోథెరపీ రెండూ ఒకటేనని పొరపడతారు. కానీ, వీటి మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉందని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ అధ్యయనం చెబుతోంది.
కౌన్సెలింగ్: ఇది సాధారణంగా స్వల్పకాలికమైనది. ఉద్యోగంలో ఒత్తిడి, సంబంధాల్లో చిన్నచిన్న సర్దుబాట్లు వంటి నిర్దిష్ట సమస్యలకు తక్షణ పరిష్కార మార్గాలను అన్వేషించడానికి ఇది ఉపయోగపడుతుంది.
సైకోథెరపీ: ఇది దీర్ఘకాలికమైనది, లోతైనది. దీర్ఘకాలిక కుంగుబాటు, తీవ్రమైన ఆందోళన (Anxiety), బైపోలార్ డిజార్డర్, గతంలోని గాయపరిచే సంఘటనల (Trauma) ప్రభావం వంటి సంక్లిష్టమైన మానసిక సమస్యల మూలాల్లోకి వెళ్లి, ప్రవర్తనా సరళిని మార్చడానికి ఇది సహాయపడుతుంది.
ప్రయోజనాలెన్నో.. అదొక్కటే కాదు : సైకోథెరపీ తీసుకోవడం వల్ల సమస్యల నుంచి బయటపడటమే కాదు, వ్యక్తిత్వంలో కూడా చాలా మార్పులు వస్తాయని అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ (APA) అంటోంది.
మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటారు: మీ ఆలోచనలు, భావోద్వేగాలు ఎందుకు అలా ఉన్నాయో మీకు స్పష్టత వస్తుంది. ఇది మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోవడానికి దోహదపడుతుంది.
భావోద్వేగాలపై పట్టు: కోపం, దుఃఖం, ఆందోళన వంటి భావాలను ఎలా నియంత్రించుకోవాలో నేర్చుకుంటారు.
సమస్యలను ఎదుర్కొనే ధైర్యం: జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా, నిర్మాణాత్మకంగా ఎలా ఎదుర్కోవాలో అనే నైపుణ్యాలు అలవడతాయి.
బంధాలు బలోపేతం: కుటుంబ సభ్యులు, స్నేహితులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడం వల్ల అపార్థాలకు తావుండదు.
స్వీయ ప్రేమ పెరుగుతుంది: ఇతరులతో పోల్చుకోవడం మాని, మీ ప్రత్యేకతను మీరు గౌరవించడం నేర్చుకుంటారు.
ఆరోగ్యకరమైన జీవనం: నిద్రలేమి వంటి సమస్యలు పరిష్కారమై, శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఉద్యోగంలోనూ ఉత్పాదకత పెరుగుతుంది. ముఖ్యంగా, ఈ ప్రయోజనాలు పొందాలంటే నిపుణులు సూచించిన సలహాలు, వ్యాయామాలు తు.చ. తప్పకుండా పాటించడం, అవసరమైతే వారు సూచించిన మందులు వాడటం అత్యంత ముఖ్యం. మానసిక ఆరోగ్యం కూడా శారీరక ఆరోగ్యం ముఖ్యమని గుర్తించి, అవసరమైనప్పుడు నిపుణుల సహాయం తీసుకోవడానికి వెనుకాడొద్దు.


