Unexpected blood sugar spike causes : మధుమేహంతో జీవనం సాగించడం అంటే కత్తిమీద సాము లాంటిదే. నోరు కట్టేసుకుని, క్రమం తప్పకుండా మందులు వాడుతూ వ్యాయామం చేస్తున్నప్పటికీ.. రక్త పరీక్ష చేయించుకోగానే చక్కెర స్థాయిలు చాపకింద నీరులా పెరిగిపోతుండటం చాలామందిని నివ్వెరపరుస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా గ్లూకోజ్ స్థాయిలు ఎందుకు అదుపు తప్పుతున్నాయో తెలియక అయోమయానికి గురవుతుంటారు. మరి నిత్యజీవితంలో మనకు తెలియకుండానే రక్తంలో షుగర్ లెవల్స్‌ను ఒక్కసారిగా తలకిందులు చేస్తున్న ఆ అదృశ్య కారణాలేమిటి? సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC), నిపుణులు చెబుతున్న ఆ వాస్తవాలేమిటి?
ఎండవేడిమి (సన్‌బర్న్) – డీహైడ్రేషన్: ఎండ తీవ్రత వల్ల శరీరానికి కలిగే తాపం ఒత్తిడికి దారితీస్తుంది. దీనివల్ల ‘కార్టిసోల్’, ‘అడ్రినలిన్’ వంటి హార్మోన్లు విడుదలై ఇన్సులిన్ పనితీరును అడ్డుకుంటాయి. శరీరంలో నీటి శాతం తగ్గితే రక్తం చిక్కబడి సహజంగానే షుగర్ లెవల్స్ పెరుగుతాయి.
కెఫిన్ & కృత్రిమ తీపి పదార్థాలు: చక్కెర లేని బ్లాక్ కాఫీ అయినా సరే.. అందులోని కెఫిన్ వల్ల కణాలలోని అడెనోసిన్ ప్రొటీన్ ప్రభావితమై గ్లూకోజ్‌ను సరిగ్గా గ్రహించలేవని మయో క్లినిక్ స్పష్టం చేసింది. ఇక ‘షుగర్ ఫ్రీ’ పేరిట వాడే కృత్రిమ స్వీట్నర్లు కాలక్రమేణా ఇన్సులిన్ నిరోధకతను (Insulin Resistance) పెంచి చక్కెర స్థాయిల పెరుగుదలకు కారణమవుతాయి.
నిద్రలేమి – అల్పాహారం మానేయడం: ఒక్క రాత్రి సరిగ్గా నిద్రపోకపోయినా శరీరం గ్లూకోజ్ నియంత్రణ సామర్థ్యాన్ని కోల్పోతుంది. అలాగే ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే క్లోమగ్రంథిలోని బీటా కణాల పనితీరు మందగిస్తుంది; తద్వారా మధ్యాహ్నం భోజనం తర్వాత చక్కెర స్థాయిలు అమాంతం ఎగబాకుతాయి.
డాన్ ఫినామినన్ & నాజల్ స్ప్రేలు: తెల్లవారుజామున శరీరాన్ని మేల్కొలిపేందుకు కాలేయం గ్లూకోజ్‌ను విడుదల చేయడం (డాన్ ఫినామినన్) వల్ల ఉదయాన్నే షుగర్ పెరుగుతుంది. జలుబు కోసం వాడే నాజల్ స్ప్రేలలోని రసాయనాలు కూడా కాలేయాన్ని ప్రేరేపించి అదనపు గ్లూకోజ్ విడుదలకు కారణమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

