Gall bladder stones: కడుపు నొప్పి అనేది చాలామందికి సాధారణంగా ఎదురయ్యే సమస్య. రోజువారీ జీవితంలో ఆహారం మారడం, ఒత్తిడి పెరగడం, జీర్ణ సమస్యలు వంటి కారణాల వల్ల కొద్దిసేపు కడుపు నొప్పి రావడం సాధారణమే. అయితే కొంతమందికి ఎలాంటి స్పష్టమైన కారణం కనిపించకపోయినా పదే పదే కడుపు నొప్పి వస్తుంటుంది. చాలామంది దీన్ని సాధారణ సమస్యగా భావించి పట్టించుకోకుండా వదిలేస్తుంటారు. కానీ ఆరోగ్య నిపుణుల మాటల్లో ఇది తేలికగా తీసుకునే విషయం కాదని చెబుతున్నారు.
కడుపులో నొప్పి..
కడుపులో నొప్పి మొదలైతే చాలా మంది ముందుగా ఇది గ్యాస్ సమస్య అనుకుంటారు. మరికొందరు తిన్న ఆహారం సరిగా జీర్ణం కాలేదని భావిస్తారు. ఈ కారణాల వల్ల తాత్కాలికంగా ఇబ్బంది వస్తే కొంతసేపటికి తగ్గిపోతుంది. కానీ తరచూ అదే నొప్పి మళ్లీ మళ్లీ వస్తుంటే శరీరం ఏదో హెచ్చరిక ఇస్తున్నట్టు అర్థం చేసుకోవాలి. ఇలాంటి సందర్భాల్లో గాల్ బ్లాడర్ అంటే పిత్తాశయానికి సంబంధించిన సమస్య ఉండే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
Also Read: https://teluguprabha.net/health-fitness/broccoli-vs-cabbage-which-is-better-for-weight-loss/
గాల్ బ్లాడర్ స్టోన్స్ ..
గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నప్పుడు ప్రారంభ దశలోనే కడుపు నొప్పి పదే పదే రావచ్చు. ఈ నొప్పి సాధారణంగా కడుపు కుడివైపు పై భాగంలో మొదలవుతుంది. కొన్ని సందర్భాల్లో ఇది ఐదు నిమిషాల పాటు లేదా అంతకంటే ఎక్కువ సేపు అలాగే ఉండొచ్చు. ముఖ్యంగా ఈ నొప్పి కుడి భుజం వైపు లేదా వెన్ను పై భాగానికి వ్యాపించటం గాల్ బ్లాడర్ సమస్యకు ఒక ముఖ్య సూచనగా వైద్యులు చెబుతున్నారు.
పిత్తాశయంలో రాళ్లు..
పిత్తాశయంలో రాళ్లు ఏర్పడినప్పుడు శరీరంలో పలు లక్షణాలు కనిపించవచ్చు. కుడి వైపు పై భాగంలో తీవ్రమైన నొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, కడుపు ఉబ్బినట్టుగా అనిపించడం వంటి సమస్యలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో కళ్ల తెల్ల భాగం పసుపు రంగులోకి మారడం కూడా గమనించవచ్చు. జ్వరం రావడం, వెన్నునొప్పి పెరగడం వంటి లక్షణాలు కూడా గాల్ బ్లాడర్ స్టోన్స్‌తో సంబంధం ఉండొచ్చని నిపుణులు వివరిస్తున్నారు.
ఈ లక్షణాలు అన్నీ ఒక్కసారిగా అందరిలో కనిపించకపోవచ్చు. కొందరిలో కేవలం తరచూ వచ్చే కడుపు నొప్పి మాత్రమే ఉండవచ్చు. అలా ఉందని నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం. ఎందుకంటే సమస్య ముదిరితే శస్త్రచికిత్స అవసరమయ్యే పరిస్థితి కూడా రావచ్చు. అందుకే పదే పదే కడుపు నొప్పి ఎదురవుతున్నప్పుడు తప్పకుండా వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
గాల్ బ్లాడర్ స్టోన్స్ రావడానికి ప్రధాన కారణాల్లో ఆహారపు అలవాట్లు, జీవనశైలి ముఖ్య పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆహారంలో పీచు పదార్థం తక్కువగా ఉండటం, ఎక్కువగా నూనెతో చేసిన పదార్థాలు తీసుకోవడం, బయట ఆహారం ఎక్కువగా తినడం వంటి అలవాట్లు ఈ సమస్యకు దారి తీస్తాయి. అలాగే వ్యాయామం లేకపోవడం, రోజంతా కూర్చునే జీవనశైలి కూడా ప్రమాదాన్ని పెంచుతాయి.
శ్రద్ధ లేకపోవడం..
ఆరోగ్యంపై సరైన శ్రద్ధ లేకపోవడం వల్ల చిన్న సమస్యలు పెద్దవిగా మారుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రోజువారీ ఆహారంలో కూరగాయలు, పండ్లు, పీచు ఎక్కువగా ఉండే పదార్థాలు చేర్చుకోవడం చాలా అవసరం. నీటిని తగినంతగా తాగడం, సమయానికి భోజనం చేయడం, నిద్ర సరిపడా తీసుకోవడం కూడా జీర్ణకోశ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
Also Read: https://teluguprabha.net/health-fitness/benefits-of-eating-papaya-on-empty-stomach-for-health/
పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరికైనా సరే తరచూ కడుపు నొప్పి వస్తుంటే దాన్ని సాధారణంగా భావించకూడదు. ముఖ్యంగా నొప్పి ఒకే చోట పదే పదే వస్తుంటే, ఇతర లక్షణాలు కూడా తోడవుతున్నాయంటే వెంటనే వైద్య సలహా తీసుకోవాలి. అవసరమైన పరీక్షల ద్వారా అసలు కారణం తెలుసుకుని సమయానికి చికిత్స తీసుకుంటే పెద్ద సమస్యలు తప్పించుకోవచ్చు.

