Diabetes effect on Brain Research MOU: ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని ప్రస్తుతం వేధిస్తున్న ఆరోగ్య సమస్య డయాబెటిస్(మధుమేహం). షుగర్ వ్యాధి కారణంగా శరీరంలోని గుండె, కిడ్నీలు, కళ్లు, నరాలు, పాదాల ఆరోగ్యంపై ప్రభావం అధికంగా ఉంటుంది. అయితే ఈ డయాబెటిస్ ముప్పు మెదడుకి కూడా చేరుతుందా అనే అంశంపై.. కొన్నేళ్లుగా అధ్యయనాలు జరుగుతున్నాయి. తాజాగా ‘డయాబెటిస్ ప్రభావం బ్రెయిన్ ఆరోగ్యంపై చూపిస్తుందా’ అనే అంశంపై పరిశోధన చేయడానికి మూడు ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌ల మధ్య ఒప్పందం కుదిరింది.
మధుమేహం- మెదడు ఆరోగ్యం మధ్య సంబంధంపై పరిశోధన చేయడానికి చెన్నైలోని మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ (MDRF), బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లోని సెంటర్ ఫర్ బ్రెయిన్ రీసెర్చ్ (CBR), UKకి చెందిన డిమెన్షియా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (UK DRI).. MOU పై సంతకం చేశాయి. డయాబెటిస్, అల్జీమర్స్, న్యూరోసైన్స్ రంగాల్లోని నిపుణులు దీనిపై అధ్యయనం చేయనున్నారు.
కాగా, 2019లో ఈ అంశంపై అధ్యయనం జరిగింది. షుగర్ వ్యాధి ఎక్కువైతే జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, ఆలోచనా శక్తి క్షీణించడం వంటి సమస్యలు 1.25 నుంచి 1.91 రెట్లు అధికంగా వచ్చే ప్రమాదం ఉందని గత అధ్యయనంలో తేలినట్లు MDRF ఛైర్మన్ V. మోహన్ అన్నారు. ప్రీడయాబెటిస్ ఉన్న వ్యక్తులకు సైతం అల్జీమర్స్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోలేకపోవడం, వ్యాయామం పాటించకపోవడం, ఆరోగ్య నియమాలు లేకపోవడం, షుగర్ లెవెల్స్ తీవ్రంగా పడిపోవడం, గుండె సంబంధిత వ్యాధులు పెరగడం వంటివి మెదడు పనితీరుపై ప్రభావం చూపిస్తున్నాయని వెల్లడించారు.
“డయాబెటిస్ క్లినిక్ సెంటర్లలో అల్జీమర్స్ స్క్రీనింగ్ చేయరు. కానీ, 60 ఏళ్లు పైబడిన రోగుల కోసం మేము గత సంవత్సరం దీనిని ప్రారంభించాం.” అని మోహన్ అన్నారు. అయితే షుగర్ వ్యాధి ఉన్నవారికి సాధారణంగా ఈ టెస్టులు చేయరని.. కానీ ఇకపై ఈ టెస్టులు చేయడం తప్పనిసరి అని అభిప్రాయం వ్యక్తం చేశారు. మనిషిలో ఆలోచనా శక్తి తగ్గిపోవడం, అల్జీమర్స్ ప్రబలడానికి డయాబెటిస్ ఓ కారణం అయ్యే అవకాశం ఉంది. ఈ భాగస్వామ్యం ద్వారా రోగుల్లో మెదడుపై ప్రభావాన్ని, పనితీరును అధ్యయనం చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Also Read: https://teluguprabha.net/international-news/us-government-shutdown-2025-effect-on-airline-services/
జీవక్రియ వ్యాధులు మెదడును ప్రభావితం చేస్తాయని, మెదడు కూడా జీవక్రియ వ్యాధులను ప్రభావితం చేస్తుందని UK DRI డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ సిద్ధార్థన్ చంద్రన్ అన్నారు. అందరికీ ఆరోగ్యకరమైన జీవనాన్ని అందించేందుకు ఈ సమగ్ర అధ్యయనం దోహదపడుతుందని చెప్పారు. అయితే వయసుతో పాటు జ్ఞాపకశక్తి తగ్గిపోవడం సహజమేనని.. కానీ డయాబెటిస్ ద్వారా వాటిల్లే అల్జీమర్స్ ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.


