Causes of headache on the right side : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని వేధించే సర్వసాధారణ సమస్య తలనొప్పి. చాలామందికి తల రెండు వైపులా నొప్పి వస్తే, కొందరిని మాత్రం కుడివైపు మాత్రమే విపరీతంగా బాధిస్తుంది. పైకి సాధారణంగా కనిపించే ఈ నొప్పి వెనుక అనేక ఆరోగ్య సమస్యలు దాగి ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు తలనొప్పి ఒకవైపే ఎందుకు వస్తుంది? దీని వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటి? నిపుణులు ఏం చెబుతున్నారు?
తల కుడి వైపున వచ్చే నొప్పిని వైద్య పరిభాషలో ‘కుడివైపు తలనొప్పి’ అంటారు. ఈ నొప్పి తల చర్మం, పుర్రె కింది భాగం, కళ్లు, దవడ లేదా మెడ భాగాలలో కలగవచ్చు. ఈ నొప్పి మెదడు కణజాలం నుంచి రాదని, ఎందుకంటే మెదడుకు నొప్పిని గ్రహించే గ్రాహకాలు (receptors) ఉండవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తల చుట్టూ ఉండే రక్తనాళాలు, నరాలు, కండరాలలో కలిగే ఒత్తిడి లేదా మార్పుల వల్లే ఈ నొప్పి పుడుతుంది. ఆసక్తికరంగా, ఎడమవైపు మైగ్రేన్ ఉన్నవారితో పోలిస్తే, కుడివైపు మైగ్రేన్ ఉన్నవారికి నొప్పి తీవ్రత కొద్దిగా తక్కువగా ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది.
కుడివైపును ప్రభావితం చేసే తలనొప్పుల రకాలు..
మైగ్రేన్ తలనొప్పి (పార్శ్వనొప్పి): ఇది కేవలం తలనొప్పి కాదు, ఒక సంక్లిష్టమైన నరాల సంబంధిత సమస్య. ఇది కొందరిలో ఒకవైపే వస్తుంది. మైగ్రేన్ వచ్చినప్పుడు తలనొప్పితో పాటు వికారం, వాంతులు, తీవ్రమైన అలసట, మానసిక స్థితిలో మార్పులు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. వెలుతురును, పెద్ద శబ్దాలను, కొన్ని రకాల వాసనలను కూడా భరించలేరు. మెదడులోని జ్ఞానేంద్రియాలకు సంబంధించిన నరాలు అతిగా స్పందించడం వల్ల మైగ్రేన్ వస్తుందని నిపుణులు వివరిస్తున్నారు.
క్లస్టర్ తలనొప్పి: ఇది హఠాత్తుగా మొదలై, అత్యంత తీవ్రమైన నొప్పితో బాధిస్తుంది. రోజూ దాదాపు ఒకే సమయానికి రావడం దీని లక్షణం. ఈ నొప్పి కనీసం అరగంట నుంచి కొన్ని గంటల పాటు ఉండి, రోజులో చాలాసార్లు కూడా రావొచ్చు. క్లస్టర్ తలనొప్పి ఉన్న సమయంలో కన్ను ఎర్రబడటం, కంటి చుట్టూ వాపు, ముక్కు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
హెమిక్రానియా కంటిన్యూవా: ఈ రకమైన తలనొప్పిలో తలలో ఒకవైపు 24 గంటల పాటు నిరంతరంగా, నిలకడగా నొప్పి ఉంటుందని clevelandclinic అధ్యయనం చెబుతోంది. దీనికి వైద్యుల పర్యవేక్షణలో సరైన మందులు వాడితే తక్షణ ఉపశమనం లభిస్తుంది.
సాధారణ కారణాలు ఏంటి : కుడివైపు తలనొప్పికి జీవనశైలి నుంచి తీవ్రమైన వైద్య కారణాల వరకు అనేక అంశాలు దోహదం చేస్తాయి.
జీవనశైలి కారణాలు:
తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన
నిద్రలేమి లేదా అధిక అలసట
సమయానికి భోజనం చేయకపోవడం
మెడ, భుజాల కండరాలు బిగుసుకుపోవడం
అధికంగా కెఫిన్ (కాఫీ, టీ) తీసుకోవడం
నరాల సంబంధిత కారణాలు..
ఆక్సిపిటల్ న్యూరల్జియా: తల వెనుక భాగంలోని నరాలు దెబ్బతినడం వల్ల తీవ్రమైన నొప్పి వస్తుంది.
టెంపోరల్ ఆర్టెరైటిస్: తల, మెడలోని ధమనులు ఉబ్బడం వల్ల విపరీతమైన నొప్పి కలుగుతుంది.
ట్రైజెమినల్ న్యూరల్జియా: ముఖంపై ఒకవైపు సూదితో పొడిచినట్లు అత్యంత తీవ్రమైన నొప్పి వస్తుంది.
ఇతర వైద్య కారణాలు:
సైనస్ ఇన్‌ఫెక్షన్లు: కళ్ల వెనుక, బుగ్గ ఎముకల వద్ద ఒత్తిడి, నొప్పికి కారణమవుతాయి.
జన్యుపరమైన కారణాలు
నిద్రలో పళ్లు కొరకడం, దవడ బిగించడం
అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (నిద్రలో శ్వాసకు అంతరాయం)
వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి : కింది లక్షణాలు కనిపిస్తే తలనొప్పిని తేలిగ్గా తీసుకోకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. తలనొప్పి అకస్మాత్తుగా, చాలా తీవ్రంగా మొదలైతే. సమయం గడిచేకొద్దీ నొప్పి తీవ్రత పెరుగుతుంటే. నొప్పితో పాటు చూపు మందగించడం, కాళ్లు చేతులు తిమ్మిరెక్కినట్లు అనిపించడం లేదా బలహీనంగా మారడం వంటి లక్షణాలు ఉంటే. సాధారణ నొప్పి నివారణ మందులకు స్పందించకపోతే వైద్యుడిని సంప్రదించాలి.


