Homeహెల్త్Heart Disease: గుండెపై ‘విషాద’ ప్రభావం! గాయం తర్వాత మానసిక సమస్యలతో హృద్రోగ ముప్పు

Heart Disease: గుండెపై ‘విషాద’ ప్రభావం! గాయం తర్వాత మానసిక సమస్యలతో హృద్రోగ ముప్పు

  • డిప్రెషన్‌, మద్యపాన వ్యసనం కీలక కారణాలు
  • ది అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ అధ్యయనంలో వెల్లడి

న్యూఢిల్లీ : తీవ్ర విషాద ఘటనలు, ప్రమాదాలు, దాడులు, సన్నిహితుల మరణం వంటి అనుభవాల తర్వాత తలెత్తే మానసిక సమస్యలు భవిష్యత్తులో గుండె, మెదడు సంబంధిత వ్యాధుల ముప్పును పెంచే అవకాశం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. గుండెపోటు, పక్షవాతం (స్ట్రోక్‌), హృదయ సంబంధిత మరణాలకు ఇవి కారణం కావొచ్చని పరిశోధకులు తెలిపారు. డెన్మార్క్‌ జాతీయ ఆరోగ్య రిజిస్ట్రీల ఆధారంగా 2,19,866 మంది పెద్దల వివరాలను పరిశీలించారు. 1995 నుంచి 2019 వరకు జరిగిన పరిణామాలను విశ్లేషించగా.. సుమారు 44 వేల మందికి గుండెపోటు, స్ట్రోక్‌, గుండెకు రక్తప్రసరణ పునరుద్ధరణ చికిత్స లేదా హృదయ సంబంధిత మరణం సంభవించినట్లు గుర్తించారు.

- Advertisement -

మద్యపాన వ్యసనమే ప్రధాన కారణం
తీవ్రమైన గుండె, మెదడు సంబంధిత సమస్యలకు పురుషులు, మహిళల్లో మద్యపాన వ్యసనం అత్యంత ముఖ్యమైన మానసిక ఆరోగ్య సూచికగా తేలింది. విషాద ఘటనల తర్వాత భావోద్వేగాలను అధిగమించేందుకు కొందరు మద్యాన్ని ఆశ్రయిస్తారని, అది క్రమంగా వ్యసనంగా మారి గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు.

మహిళల్లో డిప్రెషన్‌ ప్రభావం
డిప్రెషన్‌ వంటి మూడ్‌ డిజార్డర్లు కూడా గుండె, మెదడు సమస్యలకు ముఖ్యమైన సూచికలుగా గుర్తించారు. పురుషులతో పోలిస్తే మహిళల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనం తెలిపింది.ప్రమాదకర ఘటనల తర్వాత వచ్చే పీటీఎస్‌డీ, ఆందోళన, బైపోలార్‌ డిజార్డర్‌, స్కిజోఫ్రేనియా, వ్యక్తిత్వ రుగ్మతలు, ఇతర మాదకద్రవ్య వినియోగ సమస్యలు కూడా భవిష్యత్తులో గుండె, మెదడు సంబంధిత సమస్యల ముప్పుతో ముడిపడి ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.

పీటీఎస్‌డీతోనే పరిమితం కాదు
గాయం తర్వాత మానసిక ఆరోగ్యంపై ఏర్పడే విభిన్న సమస్యలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని పరిశోధకులు సూచించారు. జర్నల్‌ ఆఫ్‌ ది అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం.. మానసిక ఆరోగ్యం, గుండె ఆరోగ్యం మధ్య ఉన్న సంబంధాన్ని మరింత లోతుగా పరిశీలించాల్సిన అవసరాన్ని వెల్లడించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News