రోస్టెడ్ చెన్నా…అదేనండి అచ్చ తెనుగులో చెప్పాలంటే ఉప్పు శెనగలు. చిన్నప్పుడు మన అమ్మమ్మలు, నానమ్మలు ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివని పెట్టేవారు. కానీ ఈ తరం పిల్లలకు వాటి గురించి ఎంతవరకూ తెలుసో అనుమానమే. కానీ ఈ ఉప్పు శెనగలు ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో. వీటిల్లో ఎన్నో
ఎసెన్షియల్ న్యూట్రియంట్లు ఉన్నాయి. అంతేకాదు ఆరోగ్యానికి ఇవి ఎంతో మంచివని పోషకాహార నిపుణులు సైతం చెపుతున్నారు.
ఈ ఉప్పు శెనగల్లో ఫైబర్, ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. వీటిని తింటే కడుపు నిండుగా ఉండి ఆకలి తొందరగా వేయదు కూడా. దీంతో చిరుతిళ్ల జోలికి పోము. వీటిని తినడం వల్ల శరీరానికి ఎంతో ఎనర్జీ అందడమే కాదు ఎంతోసేపు చురుగ్గా, ఉత్సాహంగా ఉంటాం. అంతేకాదు ఉప్పు శెనగలు బరువును కూడా తగ్గిస్తాయి. ముందరే చెప్పుకున్నట్టు ఈ గింజల్లో ఫైబర్ బాగా ఉండి ఆకలి తొందరగా వేయదు.
అంతేకాదు వీటిల్లో కాలరీలు కూడా చాలా తక్కువ. అందుకే నిత్యం గుప్పెడు ఉప్పు శెనగలు తింటే ఒంటికి ఎంతో మంచిదని పోషకాహార నిపుణులు కూడా చెప్తున్నారు. ఇంకో విశేషమైన విషయం ఏమిటంటే ఈ ఉప్పు శెనగల్లో కాల్షియం కూడా బాగా ఉంది. అందుకే వీటిని తింటే ఎముకలు కూడా బలంగా, ద్రుఢంగా ఉంటాయి. కాల్షియం లేకపోతే ఎముకలు బలహీనపడడడమే కాకుండా ఎముకలకు సంబంధించిన జబ్బులు మనల్ని వేధించే అవకాశం ఉంది. అందుకే నిత్యం కొన్ని ఉప్పు శెనగలు తింటే ఎంతో మంచిదని డైటీషియన్లు సూచిస్తున్నారు. ఈ గింజలు గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచివి.
ఇందులోని కాపర్, ఫాస్ఫరస్ లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అందుకే వీటిని నిత్యం తింటే మీ గుండె ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకున్నవారవుతారు. మధుమేహ వ్యాధి గ్రస్తులకు కూడా ఉప్పు శెనగలు చాలా మంచివి. వీటిల్లో గ్లైసమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఫలితంగా షుగర్ ప్రమాణాల్లో హెచ్చు తగ్గులు ఉండవు. అలాగే ఇందులోని అధిక ఫైబర్ వల్ల గ్లూకోస్ మెల్లగా విడుదలవుతుంది. అలా బ్లడ్ షుగర్ ప్రమాణాలు క్రమబద్ధంగా ఉంటాయి.