Friday, November 22, 2024
Homeహెల్త్Sanitary pads: పేథలేట్స్‌ ఇదే శానిటరీ నాప్కిన్స్‌లో కిల్లర్ కెమికల్

Sanitary pads: పేథలేట్స్‌ ఇదే శానిటరీ నాప్కిన్స్‌లో కిల్లర్ కెమికల్

బహిష్టు సమయాల్లో వాడే శానిటరీ నాప్‌కిన్స్‌ వల్ల స్త్రీలలో రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఢిల్లీలోని టాక్సిక్‌ లింక్‌ అనే స్వచ్ఛందసంస్థ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. అధ్యయనంలో భాగంగా దేశీయ మార్కెట్‌లో లభ్యమవుతున్న పదిరకాల ఆర్గానిక్‌, ఇన్‌ఆర్గానిక్‌ శానిటరీ నాప్‌కిన్స్‌ని అధ్యయనకారులు పరిశీలించారు. అందులో దేశీయ ప్రముఖ బ్రాండ్‌ శానిటరీ నాప్‌కిన్స్‌లో హానికరమైన రసాయనాలు ఉన్నాయని వెల్లడైంది. నాప్‌కిన్స్‌ తయారీలో రసాయనాలు పరిమితంగా వాడాలనే నిబంధనలేవీ ఇవి పాటించడం లేదు. వీటి వాడకం వల్ల మహిళల్లో దీర్ఘకాలంలో తలెత్తే అనారోగ్య సమస్యలను తయారీదారులు అస్సలు పట్టించుకోవడం లేదు.

- Advertisement -

‘ర్యాప్డ్‌ ఇన్‌ సీక్రెసీ’ అనే టైటిల్‌తో వచ్చిన ఈ నివేదికలో ప్రమాదకరమైన పేథలేట్స్‌, వోలటైల్‌ ఆర్గానిక్‌ కాంపౌండ్స్‌ అనే రెండు రసాయనాలు అధిక పరిమాణాల్లో ఉన్నట్టు అధ్యయనకారుల పరిశోధనలో తేలింది. పేథలేట్స్‌ని ప్లాస్టిసైజర్స్‌గా దేశంలో ఉత్పత్తి చేస్తున్న పలు ప్లాస్టిక్‌ ఉత్పత్తుల్లో వాడుతున్నారు. వీటిని నాప్‌కిన్స్‌లో డిఫరెట్‌ లేయర్స్‌ను ఏర్పరచడంలో వినియోగిస్తున్నారు. ప్యాడ్స్‌ ఎలాస్టిసిటీ కోసం వాడుతున్నారు. ముందరే చెప్పినట్టు పదిరకాల ఆర్గానిక్‌, ఇన్‌ఆర్గానిక్‌ శానిటరీ ప్యాడ్స్‌ను అధ్యయనకారులు పరిశీలించారు. వాటి ప్రతి ప్రాడెక్టులోను ఈ రసాయనాలు ఎంతెంత మొత్తం వాడుతున్నారన్న విషయాన్ని నివేదికలో పరిశోధకులు పేర్కొన్నారు.

పేథలేట్స్‌ వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని అధ్యయనకారులు తమ ఈ స్టడీలో పేర్కొన్నారు. ప్యాడ్స్‌లోని ఈ రసాయన పదార్థం వల్ల ఆడవాళ్లల్లో ఎండోమెట్రియాసిస్‌ అనే జబ్బుతోపాటు గర్భధారణ సమయంలో రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వీరి పరిశీలనలో తేలింది. ఇవే కాకుండా ఇన్సులెన్‌ రెసిస్టెన్స్‌తో పాటు తల్లి కడుపులో పిండం వృద్ధి చెందడంలో కూడా సమస్యలు తలెత్తుతాయని వెల్లడైంది. హానికరమైన పేథలేట్స్‌కు ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ వాటివైపు తయారీదారులు చూడడంలేదని అధ్యయనకారులు చెపుతున్నారు. ఇంతవరకూ విదేశీ కంపెనీలు తయారుచేసిన శానిటరీ ప్యాడ్స్‌లో ఈ రసాయనాల ఉనికి ఉందని పలు స్టడీల్లో వచ్చాయి. మన దేశంలోని బ్రాండ్‌ శానిటరీ నాప్‌కిన్‌ కంపెనీలు తయారుచేసిన ప్యాడ్స్‌ మీద ప్రస్తుతం ఈ పరిశోధన జరిగింది. వోలటైల్‌ ఆర్గానిక్‌ కాంపౌడ్స్‌ (వివొసి)కి గాలిలో ఆవిరయ్యే స్వభావం ఉంటుంది. ఈ రసాయనాన్ని పెయింట్లు, డియొడరెంట్లు, ఎయిర్‌ఫ్రెష్‌నర్స్‌, నెయిల్‌ఫాలిష్‌ ఆటోమోటివ్‌ ఉత్పత్తులు, రెపలెంట్స్‌, ఇంధనాల్లో వాడతారు.

వివొసి కూడా ఆరోగ్యానికి ఎంతో హానికరం. ప్యాడ్స్‌లో మంచి సువాసన వచ్చేందుకు వీటిని వాడుతున్నారు. పరిశోధన చేపట్టిన పది రకాల శానిటరీ నాప్‌కిన్స్‌లో 25 రకాల వివొసిలను వాడుతున్నారని తేలింది. కేజీ ప్రాడక్టులో 1 నుంచి 690 మైక్రోగ్రాముల వివొసిని వాడుతున్నారని వెల్లడైంది. శానిటరీ ప్రాడక్టుల్లో రసాయనాల వినియోగంపై మనదేశంలో ఎలాంటి రెగ్యులేషన్స్‌ లేకపోవడం కూడా ఈ సమస్య తీవ్రతను అద్దంపడుతుంది.

శానిటరీ నాప్‌కిన్స్‌లో ఈ రసాయనాల ఉనికి వల్ల తలెత్తే హానికరమైన అనారోగ్య సమస్యల గురించి పలు స్టడీలు వెల్లడిస్తున్న నేపథ్యంలో వీటిపై కఠినమైన నిబంధనావళి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పరిశోధనాకారులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా మనదేశంలో ప్యాడ్స్‌ లేబిలింగ్‌లో పేథలైట్స్‌, వివొసి రసాయాల వినియోగాన్ని పేర్కొనడం లేదు. లేబిలింగ్‌లో ప్యాడ్స్‌లో వాడుతున్న రసాయనాలను స్పష్టంగా పేర్కొనాల్సిన నిబంధనను తయారీదారులు తప్పనిసరిగా పాటించాలి. తమ ఉత్పత్తిలో ఏ పదార్థాలు వినియోగిస్తున్నారని తెలుసుకునే హక్కు ప్రతి వినియోగదారునికి ఉందన్న విషయం మరిచిపోకూడదు. అంతేకాదు ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News