Health Benefits Of Sesame Seeds: ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలు మన వంటకు రుచిని మాత్రమే కాకుండా శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. అలాంటి వాటిల్లో నువ్వులు ఒకటి. నువ్వులను ఎక్కువగా వంటలలో, స్వీట్లలో ఉపయోగిస్తాము. కానీ ఆరోగ్య నిపుణుల ప్రకారం నువ్వులను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారడానికి సహాయపడతాయని చెబుతున్నారు. నువ్వులో విటమిన్‌లు, ఖనిజాలు, ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది ఎముకలకు ఎలా సహాయపడుతుంది? దీని వల్ల కలిగే మరిన్ని లాభాలు గురించి తెలుసుకుందాం.
ఎముకల దృఢత్వానికి నువ్వులు ఎలా సహాయపడతాయి?
సాధారణ పాల కంటే నువ్వులలో ఎక్కువ కాల్షియం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఎముకలు, దంతాల నిర్మాణానికి కాల్షియం అత్యవసరం కాబట్టి నువ్వులతో తయారు చేసే ఆహారదార్థాలను తీసుకోండి. ఎముకల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇందులో ఉండే ఫాస్పరస్ ఎముకల నిర్మాణాన్నికి సహాయపడుతుంది. నువ్వులలోని జింక్ కొత్త ఎముక కణాల ఉత్పత్తికి సహాయపడుతాయి. ఈ విధంగా నువ్వులు ఎముకలను దృఢంగా తయారు చేస్తాయి.
నువ్వుల వల్ల కలిగే ఇతర లాభాలు:
నువ్వులు ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చు. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తాయి. అంతేకాకుండా స్ట్రోక్ వంటి ప్రమాదాన్ని రాకుండా చేస్తుంది. నువ్వులలో ఉండే ఫైటోస్టెరాల్స్, లిగ్నాన్స్ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో తోడ్పడతాయి.
జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో నువ్వులు కీలక ప్రాత పోషిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఇది మలబద్ధకం, గ్యాస్ వంటి ఇతర జీర్ణ సమస్యలను తొలగించడంలో సహాయడుతుంది. చాలా మంది అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతుంటారు. ఈ సమస్య ఉన్నవారు కూడా నువ్వులను ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇందులో ఉండే మెగ్నీషియం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.
డయాబెటిస్ ఉన్నవారు నువ్వులు తినడం వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇవి ఇన్సులిన్ లెవల్స్‌ను కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. నువ్వులో ఉండే యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు శరీరంలో కలిగే మంట, వాపులను తగ్గిస్తుంది. అంతేకాకుండా జుట్టు, చర్మ సమస్యలు రాకుండా రక్షించడంలో నువ్వులు సహాయపడుతాయి. ఇందులో ఉండే విటమిన్ ఇ జుట్టు సమస్యలను తగ్గిస్తుంది.
నువ్వులను ఎలా చేర్చుకోవాలి:
వీటిని ప్రతిరోజు మనం ఆహారంలో ఉపయోగించుకోవచ్చు. నువ్వులు తినడానికి ఇష్టపడని వారు పొడిగా తయారు చేసుకొని కూరలో కలుపుకొని తినవచ్చు. లేదా సలాడ్స్‌లో కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే ఏదైనా కొత్త ఆహారాన్ని డైట్‌లో చేర్చుకోనే ముందు వైద్యుడి సలహా తీసుకోవడం మేలు.