పండ్లు, కూరగాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయి. అవేమిటంటే..
టొమాటోలను ఫ్రిజ్ లో పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల టొమాటోల పైభాగం ముడతలుపడినట్టు అయిపోయి దాని టెక్స్చెర్ పాడవడమే కాకుండా దాని సహజసిద్ధమైన వాసన, రుచి పోతాయి. ఇవి పోకుండా ఉండాలంటే టొమాటోలను గది ఉష్ణోగ్రతలో ఉంచాలి. టొమాటో తొడిమలు పైకి కనపడేట్టు పెట్టడం వల్ల అవి పండకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.
యాపిల్స్, బంగాళాదుంపలను కలిపి స్టోర్ చేస్తే వాటి షెల్ఫెలైఫ్ పెరుగుతుంది. ఇలా చేయడంవల్ల రెండూ ఎంతో తాజాగా ఉంటాయి. ఇలా రెండింటిని కలిపి ఎందుకు పెట్టాలనే అనుమానం వచ్చి ఉంటుంది. కారణం సింపుల్. యాపిల్స్ ఎథిలెన్ అనే వాయువును విడుదల చేస్తాయి. ఈ గ్యాసు మొక్కల పెరుగుదలకు తోడ్పడమే కాకుండా వాటి పెరుగుదలను రెగ్యులేట్ చేస్తుంది కూడా. అందువల్ల బంగాళాదుంపలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.
నిమ్మకాయను సగం కోసి మిగతా ముక్కను ఫ్రిజ్ లో పెడుతుంటాం. ఇలా చేయడం వల్ల ఆ నిమ్మకాయ ముక్క ఎండిపోవడమే కాకుండా వ్రుధా అయిపోతుంది. అందుకే నిమ్మకాయకు చిన్న రంధ్రం చేసి పిండడం వల్ల కావలసినంత రసం మాత్రమే తీసుకుని మిగతా కాయను ఫ్రిజ్ లో పెట్టేయొచ్చు. ఇలా రంధ్రం చేయడం వల్ల నిమ్మముక్కలాగ నిమ్మకాయ ఎండిపోదు. వ్రుధాకాదు.
యాపిల్ ముక్కలను బయట కాసేపు ఉంచితే చాలు అవి బ్రౌను రంగులోకి వచ్చి తినడానికి బాగుండవు. అలా కాకుండా ఉండాలంటే ఒక లీటరు చల్లటి నీళ్లల్లో అర టీస్పూను ఉప్పు వేసి బాగా కలిపి అందులో కట్ చేసిన యాపిల్ ముక్కలను వేసి ఐదునిమిషాలు అలాగే ఉంచాలి. ఆతర్వాత వాటిని బయటకు తీసి గాలిచొరబడని ప్లాస్టిక్ బ్యాగులో పెట్టి భద్రపరిస్తే అవి బ్రౌన్ రంగులోకి మారకుండా ఎక్కువ సమయం తాజాగా ఉంటాయి.
తేమ తగిలితే చాలు పాలకూర తొందరగా పాడయిపోతుంది. అందుకే పాలకూర ఆకులను పేపరు టవల్ లో చుట్టి డబ్బాలో పెట్టి దానికి ప్లాస్టిక్ ర్యాప్ ను చుట్టాలి. అలా చేస్తే పాలకూర పాడవకుండా ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది. పేపర్ టవల్ తేమను పీల్చేసుకుంటాయి. తేమ కంటైనర్ లోపలికి పోకుండా ప్లాస్టిక్ ర్యాప్ అడ్డుకుంటుంది.
కేరట్ లను నేరుగా ఫ్రిజ్ లో పెడితే ముడతలు పడి ఎండిపోయినట్టు అవుతాయి. అలా కాకుండా తేమ తగిలేలా కేరట్ లు ఉంచితే పాడవవు. అందుకే ఒక పాత్రలో నీళ్లు పోసి అందులో కేరట్లను వేసి ఆ గిన్నెను ప్లాస్టిక్ ర్యాప్ తో చుట్టి ఫ్రిజ్ లో పెట్టాలి. గిన్నెలోని నీళ్లు కేరట్లకు కావలసిన తేమను అందిస్తే, మాయిశ్చరైజర్ వాటికి తిరిగి అందేలా ప్లాస్టిక్ ర్యాప్ చేస్తుంది.
స్ట్రాబెర్రీస్, బ్లూ బెర్రీస్, అలాంటి ఇతర పండ్లను నీళ్లు, వెనిగర్ రెండూ కలిపిన మిశ్రమంతో కడగాలి. వెనిగర్ బెర్రీస్ ను పాడవకుండా కాపాడితే, బెర్రీల సహజరుచి పోకుండా నీళ్లు కాపాడతాయి. ఆ తర్వాత వాటిని తిరిగి స్వచ్ఛమైన నీటితో కడిగేసి పొడిగా ఉంచాలి.
అరటిపండ్ల గుత్తి నుంచి ఒకొక్కదాన్ని విడి విడిగా తీసి అన్నింటికీ దేనికి దానికే ప్లాస్టిక్ ర్యాప్ చుట్టాలి. ఎథిలైన్ గ్యాస్ వల్ల పండ్లు తొందరగా పండిపోతాయి. వీటిని ప్లాస్టిక్ ర్యాపర్ తో చుట్టడం వల్ల ఆ గ్యాసు అరటిపండుకు వ్యాపించదు. దీంతో అరటిపండ్లు తాజాదనం కోల్పోవు.
సిట్రస్ పండ్లు మిగతా పండ్ల కన్నా ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి. వీటిని పొడిగా, చల్లగా ఉన్న ప్రదేశంలో ఉంచాలి. ఫ్రిజ్ లో వీటిని పెట్టడం వల్ల ఈ పండ్లలోని నీరు కొంతమేర తగ్గిపోతాయి.
తరిగిన పైనాపిల్ ముక్కలను అలాగే బయట ఉంచితే పాడయ్యే అవకాశం ఉంది. వాటిని అలా ఉంచడం వల్ల మూడురోజుల్లోనే ఆ ముక్కల రుచిలో తేడా రావడంతోపాటు వాటి టెక్స్చెర్ కూడా దెబ్బతింటుంది. పైనాపిల్ ముక్కలు పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలన్నా, వాటి రుచి పాడవకుండా తాజాగా ఉండాలన్నా వాటిని ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి డీప్ ఫ్రీజర్ లో ఉంచాలి.
పుచ్చకాయను కోసిన తర్వాత అది ఎక్కువ రోజులు తాజాగా ఉండడం కష్టమైన విషయమే. అందుకే పండు కోసిన తర్వాత సగం ముక్కను క్లింగ్ ఫిలింతో చుట్టి ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టాలి. ఆ డబ్బాను ఫ్రిజ్ లో లేదా డీప్ ఫ్రీజర్ లో ఉంచితే అది ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.