చొక్కా కాలర్ మురిగ్గా ఉందా…
కాలుష్యం, చెమట, దుమ్ముధూళిల వల్ల షర్టు కాలర్లు తొందరగా నల్లబడతాయి. అలా నల్లబడ్డ చొక్కా కాలర్ ను ఎవరైనా చూస్తే ఎంతో ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటి కాలర్ మరకలను పోగొట్టడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. వీటితో కాలర్ మరకలు పోవడమే కాదు మీరు వేసుకునే చొక్కాలు తెల్లగా మిల మిలాడతాయి. చెమటతో, మట్టితో కాలర్ పసుపు పచ్చగా ఉంటే ఎంత అసహ్యంగా కనిపిస్తుందో వేరే
చెప్పక్కర్లేదు. ఈ మురికిని డిష్ సోప్ సొల్యూషన్ తో పోగొట్టొచ్చు. ఒక బౌల్ తీసుకుని డిష్ సోప్ వేసి దానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ జోడించాలి.
ఈ రెండింటినీ పేస్టులా కలాపాలి. దానిపై కొద్దిగా బేకింగ్ సోడా చల్లాలి. బ్రష్ సహాయంతో ఈ పేస్టును పసపుపచ్చగా ఉన్న కాలర్ పై రాసి బ్రష్ తో బాగా రుద్ది ఒక గంట పాటు ఆ షర్టును నీళ్లతో పిండకుండా అలాగే వదిలేయాలి. ఆతర్వాత డిటర్జెంట్ సొల్యూషన్, నీళ్లతో షర్టును బాగా ఉతకాలి. ఇలా చేస్తే షర్టు కాలర్ కు పట్టిన పసుపుపచ్చ మరకలు పోవడమే కాదు షర్టు కూడా తళ తళ మెరుస్తుంది. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉపయోగించేటప్పుడు చేతులకు గ్లోవ్స్ (తొడుగులు) వేసుకోవడం మరవొద్దు. ఇది కెమికల్ తరహా పదార్థం. చర్మానికి హాని చేస్తుంది.
ఒకవేళ షర్టు కాలర్ బాగా మురిగ్గా తయారైతే దాన్ని అమ్మోనియా పొడితో శుభ్రం చేయొచ్చు. ఇంటిని శుభ్రం చేయడం దగ్గర నుంచి బట్టలకయ్యే మరకలను పోగొట్టడానికి కూడా అమ్మోనియా పొడిని ఉపయోగిస్తారు. ఒక బౌల్ తీసుకుని అందులో రెండు లేదా మూడు స్పూన్ల అమ్మోనియం పొడిని వేయాలి. అందులో కొద్దిగా వెనిగర్ వేసి కలపాలి. మీకు నచ్చితే ఆ మిశ్రమంలో నిమ్మరసం కూడా కొద్దిగా కలపొచ్చు. ఈ మిశ్రమంతో మురికి పట్టిన కాలర్ ను రెండు చేతులతో బాగా రుద్దుతూ తెల్లగా వచ్చేలా ఉతకాలి. తర్వాత దాన్ని నీటిలో ముంచి బాగా పిండి ఆరేయాలి. అలా చేస్తే మిల మిలలాడే కాలర్ తో మీ షర్టు మెరుపులు చిందిస్తుంది.