Protein Side Effects: ఈరోజుల్లో చాలామంది ఫిట్‌నెస్, డైటింగ్ పేరుతో ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా జిమ్‌కు వెళ్లేవారి నుండి ఆరోగ్యంపై శ్రద్ధ చూపే వ్యక్తుల వరకు ఎక్కువ ప్రోటీన్ తినడం వల్ల త్వరగా ఫిట్‌గా మారతారని భావిస్తున్నారు. అయితే, అధిక ప్రోటీన్ తీసుకోవడం వల్ల శరీరానికి ప్రయోజనం చేకూర్చే బదులు హాని కలుగుతుందని చాలామందికి తెలియదు. ప్రోటీన్ శరీరానికి చాలా అవసరం అయినప్పటికీ, దాని ఒక పరిమితి వరకే తీసుకోవాలి. కానీ, నిరంతరం అధిక ప్రోటీన్ ఆహారాలు డైట్ లో చేర్చుకుంటే, అది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ క్రమంలో ప్రోటీన్ అధికంగా తీసుకుంటే ఎలాంటి సమస్యలు తలెత్తవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.
కిడ్నీలపై ఒత్తిడి: ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారాలు తీసుకుంటే మూత్రపిండాలపై అదనపు ఒత్తిడి పడుతుంది. ఎందుకంటే శరీరం ప్రోటీన్‌ను ప్రాసెస్ చేయడానికి ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. తరచుగా అధిక ప్రోటీన్ ఆహారం తీసుకోవడం వల్ల అది మూత్రపిండాల పనితీరుపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఇప్పటికే మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు ప్రోటీన్ ఆహారాలు తీసుకునే విషయంలో జాగ్రత్త వహించాలి.
జీర్ణ సమస్యలు: అధిక ప్రోటీన్ ఆహారాలు డైట్ లో చేర్చుకుంటే మలబద్ధకం, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. దీనికి కారణం ప్రోటీన్ ఆహారాలలో ఫైబర్ తక్కువగా ఉంటుంది. కావున ఇది జీర్ణవ్యవస్థపై ఒత్తిడి తీసుకువస్తుంది. దీంతో జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. అందువల్ల, ప్రోటీన్‌తో పాటు తగినంత కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవడం చాలా ముఖ్యం. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
also read:Health Tips: 30 ఏళ్ల వయసులో ఫిట్ గా ఉండాలంటే ఈ సింపుల్ టిప్స్ పాటించండి..
ఎముక బలహీనత: ఎక్కువ ప్రోటీన్ ఎముకల బలహీనతకు కారణమవుతుంది. ప్రోటీన్ జీవక్రియ శరీరంలో ఆమ్ల స్థాయిలను పెంచుతుంది. దీనిని శరీరం సమతుల్యం చేయడానికి కాల్షియంను ఉపయోగిస్తుంది. ఇది ఎముకలను బలహీనపరుస్తుంది. కాలక్రమేణా, ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.
బరువు పెరగడం: చాలామంది బరువు తగ్గడానికి ప్రోటీన్ సహాయపడుతందని నమ్ముతారు. కానీ అధిక ప్రోటీన్ వినియోగం వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది. అదనపు ప్రోటీన్ శరీరంలో కొవ్వుగా నిల్వ అవుతుంది. ఇది బరువు తగ్గడానికి బదులుగా బరువు పెరగడానికి దారితీస్తుంది.
డిహైడ్రేట్ సమస్య: అధిక ప్రోటీన్ ఆహారాలు తినడం డిహైడ్రేట్ కు దారితీస్తుంది. ఎందుకంటే ప్రోటీన్ విచ్ఛిన్నం నత్రజని వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుంది. దీనికి శరీరం నుండి ఎక్కువ నీరు తొలగించాల్సి ఉంటుంది. ఈ సమయంలో తగినంత నీరు తీసుకోకపోతే డిహైడ్రేట్ సమస్య తలెత్తవచ్చు.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.


