ప్రస్తుత టెక్నాలజీ యుగంలో అధిక శాతం ప్రజలు తమ రోజువారీ జీవితాన్ని కంప్యూటర్లు, మొబైళ్లు, ల్యాప్టాప్‌లు ముందు కూర్చొని పని చేస్తున్నారు. ఆఫీసుల్లో పని చేసేవారే కాకుండా, ఇంట్లో ఇంటర్నెట్‌తో పని చేస్తున్న ఉద్యోగులు కూడా ఎక్కువగా కుర్చీలో కూర్చునే పనులకే పరిమితమైపోతున్నారు. ఇలానే గంటల తరబడి కూర్చోవడం ఒక అలవాటుగా మారిపోయింది. అయితే ఈ అలవాటు ఖచ్చితంగా భారీ ముప్పు వైపు తీసుకెళ్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీవనశైలిలో జరిగిన ఈ చిన్న మార్పే… మృత్యు ప్రమాదాలకు పునాది వేస్తోందట.
వైద్య నిపుణుల తాజా అధ్యయనాల ప్రకారం.. రోజులో ఎక్కువ సేపు కూర్చొని ఉండే జీవనశైలికి అలవాటు పడిన వారిలో గుండె, కాలేయం, మెదడు, కిడ్నీల వంటి కీలక అవయవాలపై ప్రతికూల ప్రభావం పడుతోందంట. పని ఒత్తిడితో పాటు శారీరక శ్రమ లేకుండా ఉండటం వల్ల శరీరంలోని జీవక్రియలు మందగించి, జీవితకాలం కూడా తగ్గిపోతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గంటల తరబడి కూర్చుని పని చేయడం వల్ల శరీరంలోని కండరాల్లో కదలికలు తగ్గిపోతాయి. ఫలితంగా తీసుకునే ఆహారం శక్తిగా మారకుండా నేరుగా కొవ్వుగా మారి శరీరంలో పేరుకుపోతుంది. ఈ మార్పులు క్రమంగా స్థూలకాయానికి దారితీస్తాయి. అదే సమయంలో కాళ్లలో రక్తప్రసరణ మందగించడంతో రక్త నాళాల్లో ఒత్తిడి పెరిగి, వెరికోస్ వెయిన్స్ అనే తీవ్రమైన సమస్యకు దారితీస్తుంది. ఇది కాళ్ల నుంచి ఊపిరితిత్తుల వరకు వ్యాపించి తీవ్రమైన స్థితిని తలపెట్టవచ్చు.
అంతేకాదు కుర్చీలో ఎక్కువ సేపు కదలకుండా కూర్చుని ఉండటం వెన్ను, మెడపై తీవ్ర ఒత్తిడిని కలిగించి, వెన్నుపూసకు సంబంధించిన సమస్యలను ఎక్కువ చేస్తుందంట. దీర్ఘకాలికంగా ఇదే అలవాటుగా మారితే మెడ, నడుం, భుజాల్లో నొప్పులు, వంగిన దేహ భంగిమలు, డిస్క్ సమస్యలు ముప్పుగా మారతాయి. గంటల తరబడి కూర్చోవడం వల్ల శరీరంలో తక్కువ కేలరీలు ఖర్చవుతాయి. దీంతో శరీరంలో కొవ్వు శాతం పెరిగి డయాబెటిస్ (మధుమేహం) బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో అధిక రక్తపోటు, హై కొలెస్ట్రాల్ వంటి సమస్యలు కూడా చుట్టుముట్టే అవకాశముంది.
అత్యంత ఆందోళనకరమైన అంశం ఏంటంటే శారీరక కదలికల కొరత వల్ల క్యాన్సర్‌కు కూడా గట్టి బీజాలు పడుతున్నాయని తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా పేగు, ఊపిరితిత్తులు, ఎండోమెట్రియల్ క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉందట. వయసు పైబడిన మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌కు కూడా ఇది ప్రధాన కారణంగా మారుతోంది.
నిపుణుల సూచనలు: ఈ ముప్పు నుంచి బయటపడాలంటే జీవనశైలిలో మార్పులు తప్పనిసరని వైద్యులు చెబుతున్నారు. ప్రతిరోజూ కనీసం 7,000–8,000 అడుగులు నడవాలని సూచిస్తున్నారు. ప్రతి గంటకు కనీసం మూడు నిమిషాలు కదలాలని.. అటూ ఇటూ నడవాలని చెబుతున్నారు. నిత్యం నడక, వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. శరీరానికి తగిన పోషకాహారాన్ని తీసుకోవాలని చెబుతున్నారు. కూర్చున్న స్థితిలో ఎక్కువ సమయం గడపకుండా తరచూ శరీరాన్ని మార్చుతూ కదలాలని చెబుతున్నారు. ఇవన్నీ పాటిస్తేనే మన ఆరోగ్యానికి రక్షణ కవచంలా నిలుస్తాయని అంటున్నారు. నిత్యం కుర్చీలో కూర్చునే జీవితాన్ని సడలించకుంటే.. అది మెల్లగా మృత్యువుకే ఆహ్వానం పలకడం వంటిదే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది.. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించడం లేదు.)