Homeహెల్త్Junk food : నిద్ర కరవైతే... నాలికకు లొట్టలు! జంక్ ఫుడ్ వ్యామోహానికి తెరదించే చిట్కాలివే

Junk food : నిద్ర కరవైతే… నాలికకు లొట్టలు! జంక్ ఫుడ్ వ్యామోహానికి తెరదించే చిట్కాలివే

Junk food cravings and sleep deprivation : అర్ధరాత్రి వేళ ఉన్నట్టుండి పిజ్జా, బర్గర్, వేపుళ్లు తినాలనిపిస్తోందా? పగటి పూట కూడా నాలుక పదేపదే చిరుతిండ్ల వైపు లాగుతోందా? చాలామంది దీనిని కేవలం నాలిక చాపల్యంగా భావిస్తారు. కానీ, మన ప్రమేయం లేకుండానే మెదడు ఈ అనారోగ్యకర ఆహారాల వైపు పరుగులెత్తడానికి అసలు కారణమేంటి? దీని వెనుక దాగున్న హార్మోన్ల అలజడి, నిద్రలేమి గుట్టు ఏమిటో తెలుసుకుందాం.

- Advertisement -

హార్మోన్ల సమతుల్యత లోపిస్తేనే సమస్య : ప్రఖ్యాత ‘క్లీవ్‌ల్యాండ్ క్లినిక్’ (Cleveland Clinic) అధ్యయనాల ప్రకారం.. అధిక చక్కెర, ఉప్పు, సంతృప్త కొవ్వులు ఉండే జంక్ ఫుడ్స్ తినగానే మెదడులో ‘డోపమైన్’ అనే హార్మోన్ విడుదలై తాత్కాలిక సంతృప్తిని ఇస్తుంది. మెదడు ఈ అనుభూతిని మళ్లీ మళ్లీ కోరుకోవడం వల్లే వ్యామోహం పెరుగుతుంది. దీనికి నిద్రలేమి తోడైతే పరిస్థితి మరింత విషమిస్తుంది. రాత్రిపూట సరైన నిద్ర లేనప్పుడు ఆకలిని ప్రేరేపించే ‘గ్రెలిన్’ హార్మోన్ పరిమాణం పెరిగి, కడుపు నిండిన భావన కలిగించే ‘లెప్టిన్’ పడిపోతుంది. ఫలితంగా అధిక క్యాలరీల ఆహారం తినాలనే కోరిక తీవ్రమవుతుంది. నిరంతర మానసిక ఒత్తిడి వల్ల విడుదలయ్యే ‘కార్టిసాల్’ కూడా చిరుతిళ్ల ఆకాంక్షను రెట్టింపు చేస్తుంది.

ముంచుకొస్తున్న ముప్పు : జంక్ ఫుడ్‌లోని చెడు కొవ్వులు రక్తనాళాల గోడలపై పేరుకుపోయి రక్తప్రసరణను అడ్డుకుంటాయి. దీనివల్ల రక్తపోటు, ఊబకాయం, మధుమేహం మాత్రమే కాకుండా దీర్ఘకాలంలో గుండెపోటు, పక్షవాతం వంటి ప్రాణాంతక సమస్యలు తలెత్తుతాయి.

అధిగమించేందుకు సరైన మార్గాలు:
నాణ్యమైన నిద్ర: రోజుకు 7 నుంచి 8 గంటల ప్రశాంతమైన నిద్ర హార్మోన్లను క్రమబద్ధీకరించి ఆకలి నియంత్రణకు తోడ్పడుతుంది.

ఆహార విరామాలు: భోజనాల మధ్య ఎక్కువ సమయం ఖాళీగా ఉండకుండా బాదం, వాల్‌నట్స్, తాజా పండ్లను ఆరోగ్యకర స్నాక్స్‌గా తీసుకోవాలి.

ప్రొటీన్లు & నీరు: గుడ్లు, పాలు, గింజలు వంటి ప్రొటీన్ రిచ్ ఆహారం ఆలస్యంగా జీర్ణమై ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతినిస్తుంది. రోజంతా పుష్కలంగా నీరు తాగడం ద్వారా చిరుతిళ్ల ధ్యాసను సులభంగా అధిగమించవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News