Dangers of online medical advice : చిటికెలో చిట్కా.. అరనిమిషంలో ఆరోగ్యం! స్క్రోల్ చేస్తే చాలు.. వందల మంది ‘వైద్యులు’ ప్రత్యక్షం! సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్న ఈ వైద్య సలహాలు చూసి చాలామంది గుడ్డిగా అనుసరిస్తున్నారు. ఎవరో చెప్పారని, ఎక్కడో చదివారని సొంతంగా మందులు వాడేస్తూ కొత్త సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. మిడిమిడి జ్ఞానంతో చేసే ఈ వైద్యం, అసలుకే ఎసరు పెడుతుందని, కొన్నిసార్లు ప్రాణాల మీదికి కూడా తెస్తుందని నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. అసలు సొంత వైద్యం ఎందుకంత ప్రమాదకరం..? మందులు వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
మిడిమిడి జ్ఞానం.. వికటించే వైద్యం : ప్రతీ మనిషి శరీరం, వారికున్న ఆరోగ్య సమస్యలు వేర్వేరు. నిపుణులైన వైద్యులు అన్ని అంశాలను బేరీజు వేసి మందులు సూచిస్తారు. కానీ, ఎలాంటి అర్హత లేని వారు చెప్పే చిట్కాలను పాటించడం వల్ల వ్యాధి తీవ్రత తగ్గకపోగా, కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి.
ఔషధం – ఆహారం: ఈ జోడీతో జాగ్రత్త : మనం తీసుకునే ఆహారానికి, వేసుకునే మందులకు మధ్య బలమైన సంబంధం ఉంటుంది. తప్పుడు కలయిక మందు ప్రభావాన్ని తగ్గించడమో, పెంచడమో చేస్తుంది.
యాంటీబయాటిక్స్ – పాలు: పాలు, పెరుగు వంటివి తీసుకున్న వెంటనే యాంటీబయాటిక్స్ వేసుకుంటే, శరీరం ఆ మందులను సరిగా గ్రహించలేదు.
ద్రాక్ష రసం – బీపీ/షుగర్ మందులు: ద్రాక్ష రసం తాగిన వెంటనే బీపీ, షుగర్ మందులు వాడితే, వాటి ప్రభావం విపరీతంగా పెరిగి ప్రమాదానికి దారితీయవచ్చు.
ఔషధాలు-విటమిన్లు: మోతాదు మించితే ముప్పే : సోషల్ మీడియాలో చూసి విటమిన్ మాత్రలను విచ్చలవిడిగా వాడటం పెను ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మోతాదుకు మించి కాల్షియం వాడితే కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. మెగ్నీషియం, విటమిన్-ఇ వంటివి కూడా వైద్యుల సలహా లేకుండా ఇష్టానుసారం తీసుకోకూడదు.
“ప్రతి ఔషధానికీ ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. కోర్సు మధ్యలో మందులు ఆపకూడదు. వైద్యుడి సలహా లేకుండా వాడకూడదు. మందులు వాడినప్పుడు అలర్జీలు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.”
– డా. వి. రామనర్సింహం, విశ్రాంత ఆచార్యులు, ఆంధ్ర వైద్య కళాశాల
చట్టం ఏం చెబుతోంది : అర్హత లేని వ్యక్తులు సోషల్ మీడియాలో వైద్య సలహాలు ఇవ్వడం చట్టరీత్యా నేరం.
“సామాజిక మాద్యమాల్లో అర్హత లేని వారు వైద్య ప్రచారం చేస్తే… ‘మ్యాజిక్ రెమెడీస్ చట్టం’ కిందకు వస్తుంది. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే నకిలీ వైద్యులపై 500 కేసులు నమోదు చేశాం.”
– డాక్టర్ శ్రీనివాస్, వైస్ ఛైర్మన్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్
ఈ జాగ్రత్తలు తప్పనిసరి :
వైద్యుడినే సంప్రదించాలి: అనారోగ్యం వస్తే తప్పనిసరిగా అర్హత కలిగిన వైద్యులను సంప్రదించాలి. మీరు అప్పటికే వాడుతున్న మందుల వివరాలను వారికి స్పష్టంగా తెలియజేయాలి.
సందేహాలు నివృత్తి చేసుకోండి: మందులను ఏయే ఆహార పదార్థాలతో కలిపి తీసుకోకూడదు? మందుల మధ్య ఎంత వ్యవధి ఉండాలి? వంటి సందేహాలను వైద్యుడిని అడిగి తెలుసుకోవాలి.
సమయపాలన ముఖ్యం: మందులను ప్రతిరోజూ వీలైనంత వరకు ఒకే సమయానికి వేసుకోవాలి. సమయం దాటితే మందు ప్రభావం తగ్గుతుంది, ముందుగా వేసుకుంటే ఓవర్‌డోస్ అవుతుంది.
టెలిమెడిసిన్‌ను వాడండి: వైద్యులను నేరుగా సంప్రదించలేని మారుమూల ప్రాంతాల ప్రజల కోసం ప్రభుత్వం పల్లె దవాఖానాలు, పీహెచ్‌సీలలో ‘టెలిమెడిసిన్’ సేవలను అందుబాటులోకి తెచ్చింది. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారనో, ఆకట్టుకునేలా చెబుతున్నారనో సోషల్ మీడియా వైద్యులను నమ్మితే, ఆరోగ్యాన్ని చేజేతులా ప్రమాదంలోకి నెట్టినట్లే.


