మీరు సాఫ్ట్ డ్రింకు ప్రియులా? సోడా అంటే కూడా మీకెంతో ఇష్టమా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే. రోజుకు ఒక సోడా తాగినా కూడా మీ లివర్ ప్రమాదంలో పడుతుందిట. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు దీనిపై అధ్యయనం చేసిన సాక్షాత్తు పరిశోధకుల మాటలు ఇవి. హార్వర్డ్ అనుబంధ బ్రిఘామ్ అండ్ విమన్స్ హాస్పిటల్ అధ్యయనకారులు నిర్వహించిన ఒక స్టడీలో సుగరీ డ్రింకులు లివర్ కు తెచ్చే చేటు ఎంత తీవ్రమైందో వెల్లడైంది. సుగరీ డ్రింక్స్ లివర్ మీద చూబించే అనారోగ్యం ఆందోళన కలిగించే రీతిలో ఉందని తమ స్టడీలో వీళ్లు పేర్కొన్నారు. సాఫ్ట్ డ్రింకుల స్థానంలో ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను డైట్ లో చేర్చుకుంటే లివర్ ఆరోగ్యంగా ఉంటుందని సూచిస్తున్నారు. ప్రతి కమర్షియల్ సాఫ్ట్ డ్రింకు శరీరారోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావాలను చూపుతుందని తమ అధ్యయనంలో వీళ్లు తేల్చారు.
సాఫ్ట్ డ్రింకు ప్రతి రోజూ తాగడం వల్ల లివర్ తీవ్రంగా దెబ్బతింటుందని వీళ్లు హెచ్చరిస్తున్నారు. ఈ స్టడీని 98,786 స్త్రీలపై చేశారు. ఒక గ్లాసు కార్బోనేటెడ్ డ్రింకు సైతం అస్సలు మంచిది కాదని, దాన్ని తాగొద్దని చెప్పడానికి వంద కారణాలను చెప్పొచ్చని అధ్యయనకారులు అంటున్నారు. ఈ సాఫ్ట్ డ్రింకులకు గుండెజబ్బులు, మధుమేహం, ఊబకాయం వంటి మరెన్నో అనారోగ్యాలకు మధ్య ఉన్న సంబంధం గతంలో చేసిన పలు స్టడీల్లో వెల్లడైన విషయాన్ని అధ్యయనకారులు గుర్తుచేస్తున్నారు. లివర్ జబ్బులతో బాధపడుతున్న, ఫైబ్రోసిస్, సిరోసిస్, క్రానిక్ హెపిటైటిస్ తో బాధపడి మరణించిన పేషంట్లను తమ స్టడీలో వీళ్లు పరిశీలించారు. నెలకు మూడు లేదా ఎక్కువ పర్యాయాలు సాఫ్ట్ డ్రింకులు తాగిన మహిళల కన్నా కూడా రోజుకు ఒకటి లేదా ఎక్కువ పర్యాయాలు సాఫ్ట్ డ్రింకులు తాగిన స్త్రీలలో అధికశాతంమంది లివర్ కాన్సర్, లివర్ జబ్బులతో మరణించినట్టు గుర్తించారు. షుగర్ తో నిండిన ఈ స్వీట్ డ్రింకులకు, క్రానిక్ లివర్ జబ్బులతో సంభవించిన మరణాలకు ఉన్న సంబంధాన్ని తెలిపే తొలి స్టడీ రిపోర్టుగా దీన్ని తాము భావిస్తున్నట్టు కూడా అధ్యయనకారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
అయితే సాఫ్ట్ డ్రింకుల వినియోగానికి, లివర్ జబ్బులకు ఉన్న సంబంధాన్ని మరింత రూఢీ పరచడానికి ఈ అంశంపై మరిన్ని పరిశోధనలు కొనసాగవలసిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని కూడా ఈ స్టడీ పరిశోధకులు వ్యక్తంచేశారు. డైట్ లో షుగర్ డ్రింకులు లేకుండా వాటి స్థానంలో ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను కూడా వాళ్లు సూచించారు. లివర్ ని సహజసిద్ధంగా శుభ్రం చేసే ఎన్నో ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయని వీరు అభిప్రాయపడ్డారు. లివర్ ని ఆరోగ్యంగా ఉంచే అలాంటి కొన్ని డ్రింకులను కూడా వీరు ప్రత్యేకంగా పేర్కొన్నారు. ద్రాక్షరసం లివర్ ఆరోగ్యానికి మంచిదంటున్నారు. ద్రాక్షలో ఎన్నో పోషకాలున్నాయని వీరు చెప్తున్నారు. ముఖ్యంగా ఆరోగ్య ప్రయోజనాలు అందించే రెస్వెరాట్రోల్ ఇందులో ఉండడాన్ని వారు పేర్కొన్నారు. ఇది శరీరంలో యాంటాక్సిడెంట్లను పెంచి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుందంటున్నారు.
అంతేకాదు లివర్ లోని విషతుల్యపదార్థాలను ఇది సహజసిద్ధంగా శుభ్రం చేస్తుందని చెప్పారు. గ్రీన్ టీ కూడా లివర్ కు మంచిదని చెప్పారు. ఇందులో కాట్ చిన్ అనే కాంపౌండ్ లో ఎంతో శక్తివంతమైన యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయన్నారు. అందుకే సుగర్ డ్రింకులకు బదులు గ్రీన్ టీ తాగితే లివర్ ఆరోగ్యంగా ఉంటుందంటున్నారు. అయితే గ్రీన్ టీని కూడా మితం దాటకుండా తీసుకోవాలని సూచిస్తున్నారు. కాఫీ కూడా లివర్ కు మంచిదేనట. ఇది లివర్ ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుందని పలు రిపోర్టుల్లో సైతం వెల్లడైందిట. కాఫీలో గ్లూటాథియోన్ అనే యాంటాక్సిడెంట్ ఉందిట. ఇది శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే ప్రమాదకరమైన ఫ్రీరాడికల్స్ ను తటస్థం చేస్తుందిట. బీట్ రూట్ జ్యూసు కూడా లివర్ కు చాలా మంచిదట. ఇది పోషకాల నిధి అంటున్నారు. ఇందులో నైట్రేట్స్, యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది లివర్ ఇన్ఫ్లమేషన్ ని తగ్గించడమే కాకుండా శరీరంలో ఆక్సీకరణ దెబ్బతినకుండా పరిరక్షిస్తుందిట కూడా. నిమ్మరసం కూడా లివర్ ఆరోగ్యానికి చాలా మంచిదిట.
ఇది లివర్ లోని విషతుల్యమైన మలినాలను బయటకు పంపేస్తుంది. అంతేకాదు ఇందులో యాంటాక్సిడెంట్లు, విటమిన్ సి రెండూ సమృద్ధిగా ఉన్నాయి. ఇవి లివర్ ని పలు జబ్బుల బారి నుంచి రక్షిస్తాయిట.