Sperm Health of father Effects on Kid: మనం అనుసరిస్తున్న జీవనశైలి, పుట్టబోయే బిడ్డలపై ప్రభావం చూపుతుందా? మన ఆహారపు అలవాట్లు పుట్టబోయే బిడ్డ జీవిత కాలాన్ని నిర్ణయిస్తుందా? అంటే అవుననే చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇటీవల క్లినికల్ ఎపిజెనిటిక్స్ అనే ఒక జర్నల్‌లో ప్రచురితమైన రీసెర్చ్‌లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. తండ్రి అనుసరిస్తున్న జీవనశైలి, పర్యావరణన అంశాలు (ఆహారం, అధిక బరువు, ధూమపానం, హార్మోన్లను ప్రభావితం చేసే రసాయనాలు, మానసిక ఒత్తిడి) వారి స్పెర్మ్ లో మార్పులను కలిగిస్తాయని, ఇది పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం చూపిస్తుందని అధ్యయనంలో వెల్లడైంది.
ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..
1. తండ్రి జీవనశైలి వల్ల స్పెర్మ్‌లో డీఎన్‌ఏ, మెథైలేషన్, హిస్టోన్ మార్పులు, చిన్న ఆర్‌ఎన్‌ఏలు వంటి ఎపిజెనిటిక్ మార్పులు సంభవిస్తాయి. ఇవి బిడ్డపై ప్రభావాన్ని చూపుతాయి.
2. అధిక కొలెస్ట్రాల్ లేదా చక్కెర ఉన్న ఆహారం, ఫోలేట్ కొరత వంటి డైట్‌లు స్పెర్మ్ నాణ్యతను తగ్గించి, పిల్లల్లో మెటబాలిక్ సమస్యలకు దారితీస్తాయి.
3. ధూమపానం వలన స్పెర్మ్ డీఎన్‌ఏలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. ఇవి స్పెర్మ్ క్వాలిటీ తగ్గించడమే కాకుండా, పిల్లల్లో ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి.
4. బీపీఏ, ఫథాలేట్స్ వంటి హార్మోన్లను దెబ్బతీసే కెమికల్స్ వల్ల స్పెర్మ్ లో భారీ మార్పులు సంభవిస్తాయి. ఈ మార్పులు పుట్టబోయే బిడ్డపై పెను ప్రభావాన్ని చూపుతాయి.
5. తండ్రుల్లో ఒత్తిడి కూడా స్పెర్మ్‌కి మార్పులు తేవడమే కాకుండా, వారి పిల్లల్లో ప్రవర్తనా సమస్యలు, మెటబాలిక్ సమస్యలు కలుగజేస్తాయని జంతువులపై చేసిన అధ్యయనాల్లో వెల్లడైంది.
ఆరోగ్యమైన సంతానం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
తండ్రి బరువు, ఆహారం, మద్యం అలవాటు వంటి అంశాలు ఎంబ్రియో నాణ్యతపై ప్రభావం చూపుతాయని అధ్యయనంలో తేలింది. ధూమపానం, మధ్యపానం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండే పురుషుల స్పెర్మ్ యాక్టివ్‌గా ఉంటుందని, వారి ఎపిజెనిటిక్ మార్పులను టెస్ట్ చేయడం ద్వారా ఐవీఎఫ్/ఐసీఎస్‌ఐ పద్ధతుల్లో బిడ్డని కనడానికి అవకాశాలను మెరుగుపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
1. అధిక బరువు భారీన పడకుండా, శరీర బరువును నియంత్రించుకోవాలి.
2. ధూమపానం, మద్యం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.
3. పోషకాహారం తీసుకోవాలి, ముఖ్యంగా ఫోలేట్‌ను పుష్కలంగా తీసుకోవాలి.
4. ప్లాస్టిక్‌లు, ఇతర హానికర రసాయనాల వినియోగాన్ని తగ్గించాలి.
5. ఒత్తిడిని తగ్గించుకొని, నిద్ర, వ్యాయామానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి.
6. తండ్రి ఆరోగ్యం పిల్లల భవిష్యత్తుపై ఎంతో ప్రభావం చూపుతుంది. తండ్రి ఆరోగ్యవంతమైన జీవనశైలిని అనుసరించడం వల్ల, ఆరోగ్యకరమైన శిశువుల పుట్టుకకు దోహదం చేస్తుంది. భవిష్యత్తులో దీనిపై మరిన్ని పరిశోధనలు, వైద్య పరీక్షలు జరగాల్సి ఉంది.


