Start your day with Black Coffee here the Health Benefits: ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది. మనలో చాలా మంది కాఫీ లేదా టీతోనే డే స్టార్ట్ చేస్తుంటారు. కాఫీ తాగడం ద్వారా రోజంతా ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. అంతేకాదు, ఎప్పుడైనా ఒత్తిడికి గురైనప్పుడు కూడా రిలాక్స్ కోసం కాఫీ లాగించేస్తుంటారు. అయితే, అదే పనిగా కాఫీ లేదా టీ త్రాగడం ఆరోగ్యానికి అంత మంచివి కావని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే వాటికి బదులుగా బ్లాక్ కాఫీ తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, బ్లాక్ కాఫీ ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా పరగడుపున దీన్ని తాగితే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రముఖ పోషకాహార నిపుణులు ఉదయం బ్లాక్ కాఫీ తాగడం వల్ల కలిగే 3 ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలను తెలిపారు. వాటి గురించి తెలుసుకుందాం.
పరగడుపున బ్లాక్ కాఫీ తాగితే కలిగే లాభాలు..
శక్తి, ఏకాగ్రత
ఉదయం బ్లాక్ కాఫీ తాగడం వల్ల రోజంతా ఏకాగ్రత, చురుకుదనం, ఉత్పాదకత వంటివి పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాఫీలోని కెఫీన్ మెదడును చురుకుగా ఉంచి.. కార్టిసాల్ లెవల్స్‌ను పెంచుతుంది. దీనివల్ల ఉదయం లేవగానే సహజంగా ఉండే బద్ధకం తగ్గి తక్షణం శక్తి లభిస్తుంది. తద్వారా రోజంతా ఉత్సాహంకా పనిచేయగలుగుతారు.
జీర్ణవ్యవస్థకు మంచిది
బ్లాక్ కాఫీ కేవలం శక్తిని మాత్రమే కాదు జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో ఉండే పాలిఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇవి ప్రేగులలో మంచి బ్యాక్టీరియాను పెంచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. దీనివల్ల కడుపు తేలికగా ఉండి.. ఉబ్బరం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా, మలబద్ధకం ఉన్నవారు ఉదయం బ్లాక్ కాఫీతో రోజును ప్రారంభించవచ్చు.
మెదడు-కాలేయానికి మేలు
బ్లాక్ కాఫీ కాలేయం ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇది కాలేయ వాపును తగ్గించడానికి, కాలేయ పనితీరును మెరుగుపర్చడానికి ఉపయోగపడుతుంది. అంతేకాక కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మితంగా బ్లాక్ కాఫీని తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. ఉదయం బ్లాక్ కాఫీ తాగడం ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ.. దీనిని మితంగానే తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఎక్కువగా కాకుండా రోజుకు 1-2 కప్పుల బ్లాక్ కాఫీ తీసుకుంటే సరిపోతుందని సూచిస్తున్నారు. అధిక కెఫీన్ తీసుకోవడం వల్ల అసిడిటీ, డీహైడ్రేషన్ లేదా నిద్ర సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.


