Mobile Phone-Toilet:మొబైల్ ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. ఉదయం లేవగానే చేతిలోకి తీసుకోవడం, రాత్రి పడుకునే వరకు వదలకుండా ఉండడం ఇప్పుడిప్పుడు అందరిలో కనిపించే అలవాటు. కొంతమంది అయితే భోజనం చేసే సమయంలో, మరికొందరు బాత్రూమ్‌కు వెళ్లినా కూడా ఫోన్‌ను వదలరు. ముఖ్యంగా టాయిలెట్‌లో కూర్చున్నప్పుడు సోషల్ మీడియా స్క్రోల్ చేయడం, వీడియోలు చూడటం, మెసేజ్‌లు చెక్ చేయడం సాధారణంగా కనిపించే ప్రవర్తన. కానీ ఈ చిన్న అలవాటు ఆరోగ్యానికి పెద్ద సమస్యను తెచ్చిపెట్టవచ్చని తాజా పరిశోధన హెచ్చరిస్తోంది.
పైల్స్ లేదా హెమోరాయిడ్స్ అనే సమస్య..
నిపుణుల అభిప్రాయం ప్రకారం, టాయిలెట్‌లో ఎక్కువసేపు కూర్చోవడమే పైల్స్ లేదా హెమోరాయిడ్స్ అనే సమస్యకు దారి తీస్తోంది. పైల్స్ అనేది మలద్వార ప్రాంతంలో రక్తనాళాలు వాపుతో ఉబ్బిపోవడం వల్ల కలిగే వ్యాధి. దీనివల్ల తీవ్రమైన నొప్పి, దురద, మల విసర్జన సమయంలో రక్తస్రావం వంటి ఇబ్బందులు వస్తాయి. సాధారణంగా పని పూర్తవగానే మనం టాయిలెట్ నుంచి బయటకు వస్తాం. కానీ ఫోన్ చేతిలో ఉన్నప్పుడు సమయం ఎలా గడుస్తుందో తెలియకపోవడంతో అదనంగా నిమిషాల తరబడి అక్కడే కూర్చునిపోతాం. ఈ అలవాటే శరీరంపై అదనపు ఒత్తిడిని పెంచుతుంది.
టాయిలెట్ సీటుపై ఎక్కువసేపు కూర్చుంటే…
మన శరీర నిర్మాణం కారణంగా టాయిలెట్ సీటుపై ఎక్కువసేపు కూర్చుంటే పొత్తికడుపు దిగువభాగంలో ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి కారణంగా మలద్వార ప్రాంతంలోని రక్తప్రసరణ మందగిస్తుంది. ఫలితంగా రక్తనాళాల్లో రక్తం నిలిచిపోతుంది. అలా నిరంతరంగా జరిగితే రక్తనాళాలు బలహీనపడి పైల్స్ సమస్యను ఉత్పత్తి చేస్తాయి. మొబైల్ వాడకం స్వతహాగానూ సమస్య కాదు, కానీ అది మనం అక్కడ గడిపే సమయాన్ని పెంచడం వల్లే సమస్య మరింత తీవ్రంగా మారుతుంది.
ఇటీవల అమెరికాలో 45 ఏళ్లు దాటిన వ్యక్తులపై ఒక విశ్లేషణ చేపట్దింది. ఈ అధ్యయనంలో భాగమైన వారిలో దాదాపు రెండు మూడవ వంతు మంది టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారని అంగీకరించారు. ఫోన్ వాడేవారిలో మూడవ వంతు మందికి పైగా ఐదు నిమిషాల కంటే ఎక్కువసేపు అక్కడ గడుపుతున్నారు. కానీ ఫోన్ వాడని వారిలో మాత్రం కేవలం 7 శాతం మంది మాత్రమే అంతసేపు కూర్చున్నారని తేలింది.
వయసు, బరువు, ఆహారపు అలవాట్లు, జీవనశైలి…
ఈ పరిశోధనలో వయసు, బరువు, ఆహారపు అలవాట్లు, జీవనశైలి వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నప్పటికీ టాయిలెట్‌లో ఫోన్ వాడేవారికి పైల్స్ వచ్చే అవకాశం 46 శాతం ఎక్కువగా ఉందని స్పష్టమైంది. దీని అర్థం ఏమిటంటే టాయిలెట్‌లో స్క్రోల్ చేస్తూ సమయం గడపడం కేవలం ఒక సరదా పనికాదు, దీని వెనుక ఆరోగ్యానికి ముప్పు దాగి ఉందన్న మాట.
కండరాలపై ఒత్తిడి పెరగడం…
అలాగే నిపుణులు చెబుతున్నది ఏమిటంటే, టాయిలెట్‌లో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల శరీరానికి మరికొన్ని సమస్యలు కూడా రావచ్చు. కండరాలపై ఒత్తిడి పెరగడం, రక్తప్రసరణకు ఆటంకం కలగడం వంటి కారణాల వల్ల దీర్ఘకాలిక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆధునిక జీవనశైలిలో ఎక్కువసేపు కూర్చోవడం, వ్యాయామం చేయకపోవడం, ఫైబర్ తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వంటి అలవాట్లు కలిసివచ్చి పైల్స్ ప్రమాదాన్ని ఇంకా ఎక్కువ చేస్తాయి.
తీసుకెళ్లకపోవడమే మంచిదని…
అమెరికాలోని ఈ అధ్యయనం వెలువడిన తర్వాత వైద్యులు ప్రజలకు ఒక హెచ్చరిక జారీ చేశారు. ఫోన్ వాడకం మానేయాల్సిన అవసరం లేదు కానీ టాయిలెట్‌లోకి తీసుకెళ్లకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. ఎందుకంటే టాయిలెట్ అనేది ఎక్కువసేపు కూర్చోవడానికి కాదు, అవసరమైన పనిని పూర్తి చేసి వెంటనే బయటకు రావడానికి. కానీ ఫోన్ కారణంగా ఆ ఉద్దేశం మరచి కాలం వృథా అవుతుంది.
Also Read: https://teluguprabha.net/health-fitness/gud-chana-for-pcos-does-this-viral-snack-really-help/
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లు లేకుండా రోజు గడపడం చాలా మందికి కష్టమయ్యింది. ఆన్‌లైన్ క్లాసులు, వర్క్ ఫ్రమ్ హోమ్, షాపింగ్, చెల్లింపులు, వినోదం అన్నీ మొబైల్‌తోనే జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఫోన్ వాడకం పూర్తిగా మానేయడం అసాధ్యం. కానీ ఎప్పుడు వాడాలి, ఎప్పుడు వాడకూడదు అన్న జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా బాత్రూమ్‌లోకి తీసుకెళ్లకపోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదే కాకుండా ఫోన్ కూడా బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్‌ల నుంచి దూరంగా ఉంటుంది.


