ఖుస్ షర్బత్ గురించి విన్నారా? ఆకుపచ్చరంగులో ఉండే ఈ డ్రింకు వేసవిలో తాగితే శరీరానికి వలసింత హైడ్రేషన్ అందుతుంది. అంతేకాదు ఈ డ్రింకు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ డ్రింకు తీయగా ఉండి తాగిన వెంటనే ఎంతో తాజాదనాన్ని అనుభూతి చెందుతాం. వేసవి కాలంలో దీన్ని మేజికల్ డ్రింకుగా అభివర్ణిస్తారు ఆరోగ్యనిపుణులు. ఖుస్ షర్బత్ లో శరీరాన్ని చల్లబరిచే గుణాలు ఉన్నాయి. ఖుస్ లో జింకు పాళ్లు ఎక్కువ. ఇది కంటి సమస్యలపై కూడా బాగా పనిచేస్తుంది. వేసవిలో ఒక గ్లాసుడు ఖుస్ షర్బత్ తాగితే ఎండవేడిమి వల్ల కళ్లల్లో ఏర్పడ్డ ఎర్రదనం తగ్గుతుంది. వేసవిలో దీన్ని తరచూ తాగడం వల్ల శరీరం డీహైడ్రేట్ కాదు. శరీరానికి కావలసినంత హైడ్రేషన్ ను ఇది అందిస్తుంది. ఖుస్ లో ఐరన్, మాంగనీసు, విటమిన్ బి6 పుష్కలంగా ఉన్నాయి.
ఇందులోని ఐరన్ వల్ల శరీరంలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ఇందులోని మాంగనీసు రక్తపోటును ఒక పరిమితి మేర నియంత్రణలో ఉంచుతుంది. గడ్డి జాతికి చెందిన ఖుస్ వేళ్లల్లో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచుతాయి. ఫ్రీరాడికల్స్ నుంచి శరీర అవయవాలను, టిష్యూలను ఇది కాపాడుతుంది. వేసవిలో మనల్ని వెన్నాడే విపరీత దాహాన్ని ఖుస్ షర్బత్ తీరుస్తుంది. ఒక గ్లాసుడు ఖుస్ షర్బత్ తాగితే మీ దాహం తగ్గడమే కాకుండా తాజాదనపు అనుభూతి మీకు కలుగుతుంది. దీంట్లో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగితే మరిన్ని పోషకాలు శరీరానికి అందుతాయి.
ఇంట్లో ఖుస్ షర్బత్ ఇలా చేసుకోవచ్చు…
చక్కెర, నీళ్లు కలిపి తక్కువ మంటపై బాగా ఉడికించాలి. అది తీగపాకం వచ్చేలా చిక్కబడిన తర్వాత అందులో గ్రీన్ ఫుడ్ రంగుతో ఖుస్ ఎసెన్స్ కలిపి బాగా చల్లారనివ్వాలి. తర్వాత ఈ సిరప్ లో చల్లటి నీళ్లు కలుపుకుని తాగాలి. ఆ ఎఫెక్టే వేరు…మరి ఇంట్లో చేసుకోవడానికి ఆలస్యం ఎందుకు?