వేసవికాలం మొదలైన దగ్గర నుంచే ఎండల తాకిడి రోజురోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉక్కపోత, ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో శరీరాన్ని చల్లగా ఉంచేందుకు పండ్లను తీసుకోవాలన్న ఆరోగ్య నిపుణుల సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో వేడిలో చల్లదనాన్ని అందించే పుచ్చకాయ (Watermelon) ఎంతో ఉపయోగకరంగా నిలుస్తోంది. శరీరానికి అవసరమైన హైడ్రేషన్‌ను అందించే ఈ పండు, తీపి రుచి, 90 శాతానికి పైగా నీటితో వేసవి డైట్‌లో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే పుచ్చకాయను ఎలా తినాలో కూడా తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే కొన్ని తప్పిదాల వల్ల అది ఆరోగ్యానికి హానికరంగా మారవచ్చు.
చాలామంది పుచ్చకాయను కట్ చేసి, ఫ్రిజ్‌లో నిల్వ చేసి, తర్వాత తినే అలవాటు కలిగి ఉంటారు. అయితే ఇలా చేయడం వల్ల ఆ పండులో తేమ నిలిచిపోవడంతో బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. పుచ్చకాయలో 90 శాతం పైగా నీరు ఉండటం వల్ల ఫ్రిజ్‌లో ఎక్కువసేపు ఉంచినప్పుడు ఫుడ్ పాయిజనింగ్ కు అవకాశం ఏర్పడుతుంది. ఇది రోగనిరోధక శక్తిని తగ్గించి, చర్మ సమస్యలు, అలర్జీలు, జుట్టు రాలడం వంటి అనేక సమస్యలకు దారి తీస్తుంది.
పుచ్చకాయను కట్ చేసిన వెంటనే తినడం ఉత్తమం. నిల్వ పెట్టే అవసరం ఉంటే refrigeration సమయంలో ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. అలాగే పుచ్చకాయను కట్ చేయకముందు చేతులను, కత్తిని శుభ్రంగా కడగడం తప్పనిసరి. అలాగే కత్తితో కోసిన తర్వాత ఆ పండు బయట ఎక్కువసేపు ఉంచకూడదు. బయట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటంతో బ్యాక్టీరియా వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక కొనుగోలు సమయంలో సహజమైన రంగుతో, నాణ్యత కలిగిన పుచ్చకాయను ఎంపిక చేసుకోవాలి. మృదువుగా మారిపోయిన పుచ్చకాయలు లేదా బాహ్యంగా చీలినవాటిని తీసుకోవద్దు.
వేసవిలో పుచ్చకాయ తప్పనిసరిగా తీసుకోవాలి కానీ శుభ్రత, నిల్వ, వినియోగం విషయంలో జాగ్రత్తలు పాటిస్తేనే అది ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. లేకపోతే ఇదే పండు అనారోగ్యానికి కారణమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి పుచ్చకాయను తాజాగా, శుభ్రంగా తినడం ద్వారా వేసవిలో ఆరోగ్యంగా ఉండవచ్చు.