Protein Foods: బలమైన కండరాల కోసం సరైన ఆహారం, వ్యాయామం చేయడం ఎంతో ముఖ్యం. కండరాల బలం కోసం జిమ్ లో గంటల తరబడి చెమటలు తీసిన, సరైన ఆహారం తీసుకోకపోతే తగిన ఫలితాలు లభించవు. అందువల్ల ప్రోటీన్ అధికంగా ఉండే కొన్ని ఆహారాలను డైట్ లో చేర్చుకోవాలి. అప్పుడు అవి కండరాలను బలంగా తయారు చేయడంలో సహాయపడుతాయి. ఇందుకోసం తీసుకునే ఆహారాలలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగి ఉండడం ఎంతో ముఖ్యం. ఇటువంటి ఐదు ఆహారాల గురించి ఇప్పుడు ఈ కథనం ద్వారా తెలుసుకుందాం. ఇవి కండరాల నిర్మాణంలో సహాయపడుతాయి. అంతేకాకుండా శరీరాన్ని బలోపేతం చేస్తాయి.
గుడ్లు
గుడ్లు కండరాల నిర్మాణానికి బెస్ట్ ఆహారంగా పరిగణిస్తారు. దీనిలో అధిక-నాణ్యత ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ బి12 విటమిన్ డి వంటి ముఖ్యమైన విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. గుడ్డు సోనా కాకుండా వైట్ ఎగ్ లో అల్బుమిన్ ప్రోటీన్ ఉంటుంది. ఇది కండరాల మరమ్మత్తు, పెరుగుదలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతిరోజు 2-3 గుడ్లు తినడం ద్వారా మంచి ప్రోటీన్ లభిస్తుంది.
Also Read: Health Tips: హెల్తీ గా ఉండాలంటే పొద్దున్నే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో తెలుసా..?
పెరుగు
పెరుగులో ప్రోటీన్, ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తాయి. కండరాల బలానికి గ్రీకు పెరుగు మరింత మంచిది. ఎందుకంటే దీనిలో అధిక ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. అంతేకాకుండా పెరుగులో కాల్షియం కూడా ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి ఎంతో సహాయపడుతుంది. కండరాల బలానికి పెరుగు గొప్ప ఆహారం.
చికెన్ బ్రెస్ట్
కండరాలు బలంగా ఉండాలంటే కచ్చితంగా డైట్లో చికెన్ బ్రీస్ట్ భాగం చేసుకోవాలి. ఎందుకంటే ఇది లీన్ ప్రోటీన్ అద్భుతమైన మూలం. ఇది తక్కువ కొవ్వు, అధిక ప్రోటీన్ కలిగి ఉంటుంది. కండరాల బలం కోసం 100 గ్రాముల చికెన్ బ్రీస్ట్ తీసుకోవాలి. ఇందులో దాదాపు 30-35 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అలాగే ఇందులో విటమిన్ b6, నియాసిన్లను కలిగి ఉంటుంది. ఇది జీవక్రియకు ప్రయోజనకరంగా ఉంటుంది.
అరటి
కండరాల నిర్మాణానికి ప్రోటీన్ మాత్రమే కాదు..శక్తి కూడా ఎంతో అవసరం. ఇందుకోసం అరటిని తీసుకోవచ్చు. ఇందులో సహజ చక్కెర, పొటాషియం ఉంటుంది. తద్వారా రోజంతా ఎంతో శక్తివంతంగా ఉండవచ్చు. అరటి పండులో ఉండే పొటాషియం తిమ్మిరిని నివారించడానికి సహాయపడుతుంది. వ్యాయామం ముందు లేదా తరువాత 1-2 అరటి పండ్లు తినడం ఎంతో ప్రయోజనకరం.
వేరుశనగ
వేరుశనగ లో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. ఇది మోనోశాచురేటెడ్ కొవ్వులను కలిగి ఉంటుంది. ఇవి గుండెకు ఎంతో మేలు చేస్తాయి. పైగా గుండె పనితీరును మెరుగు పరుస్తాయి. అలాగే వేరుశనగలు ఫైబర్ కూడా ఉంటుంది. ఇది కడుపుని ఎక్కువసేపు నిండిన భావన కలిగిస్తుంది. తద్వారా పదేపదే తినే అలవాటును నివారిస్తుంది.


