Tea and cigarette side effects: చెడు ఆహారపు అలవాట్లు, ఒత్తిడి కారణంగా చిన్న వయస్సులోనే ప్రాణాంతకమైన జబ్బుల భారీన పడుతున్నారు చాలా మంది. ముఖ్యంగా, మన రోజూవారి అలవాట్లు కొన్ని ప్రమాదకరమైనప్పటికీ చాలా మంది వాటిని పట్టించుకోరు. ఉదయం లేవగానే లేదా సాయంత్రం పని వేళలో అలసటగా అనిపిస్తే చాలు టీ లేదా కాఫీ లాంగించేస్తుంటారు. ఈ అలవాటు సాధారణమే అయినప్పటికీ.. టీ తాగుతూ సిగరెట్ కాల్చే ప్రమాదకరమైన అలవాటు కొందరికి ఉంటుంది. ఇది ఒక ‘స్టైల్’ లేదా ‘రిలాక్సేషన్’గా భావిస్తారు. అయితే, ఇలాంటి అలవాట్లు ఉన్నవారికి ఓ షాకింగ్ న్యూస్. టీ, సిగరెట్ రెండింటి కలయిక మన శరీరానికి తీవ్రమైన హానిని కలిగిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సిగరెట్‌లో ఉండే నికోటిన్, టీలోని కెఫిన్ కలిసి పనిచేయడం వల్ల ఆరోగ్య సమస్యల తీవ్రత భారీగా పెరుగుతుందని చెబుతున్నారు. ఈ అలవాటు మన ఊపిరితిత్తులు, గుండె, జీర్ణవ్యవస్థపై తీవ్రమైన దుష్ప్రభావాలను చూపిస్తుందని, దీని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సలహా ఇస్తున్నారు. ఈ కాంబినేషన్ వల్ల కలిగే ఆరోగ్య నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
టీ, సిగరెట్ కలిపి తాగితే వచ్చే ప్రమాదం..
క్యాన్సర్ వచ్చే ప్రమాదం
సిగరెట్‌లోని హానికరమైన రసాయనాలు.. మరీ ముఖ్యంగా నికోటిన్ ఊపిరితిత్తుల కణాలను దెబ్బతీస్తాయి. టీతో కలిపి సిగరెట్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం 30 శాతం వరకు పెరుగుతుందని అనేక పరిశోధనల్లో తేలింది. వేడి టీ, అన్నవాహిక కణాలను దెబ్బతీయడం, సిగరెట్ పొగలోని రసాయనాలు ఆ నష్టాన్ని మరింత పెంచడం వలన గొంతు, నోటి క్యాన్సర్ల ముప్పు కూడా పెరుగుతుంది.
జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం
టీలోని కెఫిన్ కడుపులో ఆమ్లాన్ని పెంచుతుంది. సిగరెట్ పొగ కూడా జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఈ రెండింటి కలయిక వల్ల అజీర్ణం, మంట, కడుపు నొప్పి, కడుపు పూతలు వంటి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.
గుండె, రక్తనాళాల సమస్యలు
టీలోని కెఫిన్, సిగరెట్‌లోని నికోటిన్ కలయిక గుండె స్పందన రేటును బాగా పెంచుతుంది. ఈ కలయిక రక్తనాళాలు కుంచించుకుపోయేలా చేసి, అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. దీని ఫలితంగా గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం అధికమవుతుంది.
సంతానలేమి సమస్య
టీ, సిగరెట్ తీసుకోవడం వల్ల మగవారిలో శుక్రకణాల నాణ్యత క్షీణిస్తుంది. స్త్రీలలో అండాశయాల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపడం వలన సంతానలేమి సమస్యలు పెరుగుతాయి.
నాడీ, మానసిక సమస్యలు
టీ, సిగరెట్ కాంబినేషన్ మెదడుకు హాని చేస్తుంది. దీని వలన జ్ఞాపకశక్తి కోల్పోవడం, ఏకాగ్రత లోపించడం, నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి.
రోగనిరోధక శక్తి తగ్గుదల
టీ, సిగరెట్‌ను కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గి చిన్నపాటి అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఎముకల బలహీనత
సిగరెట్, టీలోని కొన్ని రసాయనాలు ఎముకలను బలహీనపరుస్తాయి. బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి.


