Tuesday, September 17, 2024
Homeహెల్త్Terrace gardener: ఆమె.. టెర్రస్‌ గార్డెనర్‌, ఆర్గానిక్ ఫార్మర్, యూ ట్యూబ్ స్టార్ కూడా

Terrace gardener: ఆమె.. టెర్రస్‌ గార్డెనర్‌, ఆర్గానిక్ ఫార్మర్, యూ ట్యూబ్ స్టార్ కూడా

ఈమె పేరు రెమాదేవి. ఆర్గానిక్‌ ఫార్మర్‌. తక్కువ పెట్టుబడితో ఇంట్లోనే ఆర్గానిక్‌ టెర్రస్‌ గార్డెన్‌కి శ్రీకారం చుట్టి దాన్ని మెల్లగా పెద్ద బిజినెస్‌గా వృద్ధి చేశారు. నెలకు వేల రూపాయల ఆదాయం సంపాదిస్తూ తనలాంటి మరెందరో మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు. కేరళకు చెందిన ఆమె గురించిన కొన్ని విశేషాలు…
రెమాదేవిది కేరళ రాష్ట్రానికి చెందిన కొట్టాయంలో చెంగనస్సరీ అనే ఊరు. 1990ల్లో తన ఇంటి ఆవరణలోనే చిన్న ఆర్గానిక్‌ (సేంద్రియ)టెర్రస్‌ గార్డెన్‌ని ఆమె ప్రారంభించారు. అందులో నిత్యావసరాలకు ఉపయోగపడేలా సేంద్రియ పద్ధతిలో కూరగాయలను పండించడం మొదలెట్టారు. అలా మొదలెట్టిన చిన్న ఆర్గానిక్‌ టెర్రస్‌ గార్డెన్‌ ఇపుడు పెద్దదిగా విస్తరించింది. అది ఇప్పుడు ఆమెకు మంచి సంపాదనా వనరుగా మారింది.
సేంద్రియ వ్యవసాయాన్ని రేమా తన నాయనమ్మ దగ్గర నేర్చుకున్నారు. ‘మా నాయనమ్మకు సేంద్రియ వ్యవసాయం బాగా తెలుసు. చిన్నపుడంతా ఆమె వెంటే ఉంటూ వ్యవసాయంలో ఆమెకు సహాయపడేదాన్ని. మా నాయనమ్మ మంచి సేంద్రియ రైతు’ అని గర్వంగా చెపుతారామె. కుటుంబానికి అవసరమైన పప్పులు దగ్గరి నుంచి పండ్లు, కూరగాయలు ఒకటేమిటి అన్నీ రేమా నాయనమ్మే పండించేవారట. నాయనమ్మ స్ఫూర్తితోనే తాను ఆర్గానిక్‌ రైతుగా ఎదగానని రేమా అంటారు.
గత 20 సంవత్సరాలుగా తన ఇంటి టెరస్‌ మీదే సేంద్రియ పద్ధతిలో కాయగూరలు, పండ్ల చెట్లను పెంచుతున్నారు.

- Advertisement -

టెర్రస్‌ మీదే కాకుండా తనకున్న రెండు ఇళ్ల చుట్టూరా కూడా పండ్లు, కూరగాయల మొక్కలను పెంచుతున్నారు. అంతేకాదు ఒక యూట్యూబ్‌ ఛానల్‌ పెట్టి అందులో సేంద్రియ పద్ధతిలో కూరగాయపంటలు, పండ్ల చెట్లను ఇంట్లోనే ఎలా పెంచుకోవచ్చో ఎందరికో అవగాహన కల్పిస్తున్నారు. కాయగూరల నుంచి విత్తనాలను వృద్ధిచేసి వాటిరి అమ్ముతున్నారు. ఎక్కువ ఖర్చులేకుండా టెర్రస్‌ గార్డెన్‌ పెంచుకోవచ్చంటారామె. అదెలాగో తన యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా ఔత్సాహికులకు ప్రాక్టికల్‌గా బోధిస్తారు.
రేమా బాటనీ సబ్జక్టులో ఉన్నత విద్యను అభ్యసించారు. వ్యవసాయంతో తనకెంతో ఎమోషనల్‌ బంధం ఉందంటారామె. తన బామ్మతో ఉన్న అనుబంధం గుర్తుకువస్తుందంటారు. సేంద్రియ వ్యవసాయం వైపు రేమా మళ్లడానికి ఒక చిన్న సంఘటన కూడా కారణం. ఒకసారి పిల్లలకు మార్కెట్‌ నుంచి పొట్లకాయ తెచ్చి వేగించి కూరచేశారు రేమా. కానీ ఆ కూరంతా రసాయనాలతో కూడిన వాసన వస్తుండడంతో ఆశ్చర్యపోయారట. దీంతో తన పిల్లలకు సేంద్రియ పద్ధతిలో తన ఇంటి ఆవరణలోనే కూరగాయలను పండించి వండి పెట్టాల నిశ్చయించుకున్నారట. అలా ఆమె సేంద్రియ వ్యవసాయ ప్రయాణం ప్రారంభమైంది.

మొదట్లో తన ఇంటి ఆవరణలో మొక్కలు వేసి కాయగూరలు పండించడం మొదలెట్టారు రేమా. కొన్నాళకు ఆ ఇంటి పక్కనే మరో ఇల్లు కట్టుకున్నారు. అందులోనూ పండ్లు, కూరగాయ మొక్కలు వేసి పెంచడం ప్రారంభించారు రేమా. తర్వాత ఆ ఇళ్ల టెర్రస్‌ల మీద కూడా మొక్కలు వేశారు. ఆ మొత్తం స్థలం 2,500 చదరపు అడుగులు ఉంటుంది. నేల మీద మొక్కలను వేసి పండించడం కన్నా టెర్రస్‌ గార్డెన్‌ పెంచడం సులభమైనా కొన్న పద్ధతులను ఇందులో తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందంటారు.

టెర్రస్‌ గార్డెన్‌ సంరక్షణ సవాలుతో కూడిన పని అని అంటారు రేమా. లీకేజిలు ఉండకుండా టెర్రస్‌ అంతా వైట్‌ సిమెంట్‌ పెయింట్‌ చేయించారు. టెర్రస్‌పై కుండీల్లో, బ్యాగులో మొక్కలను వేయకుండా కొబ్బరి చిప్పలను ఉపయోగించారు. మొదట పాలకూరతో తన గార్డెనింగ్‌ పని మొదలెట్టారు. ఇపుడు తన టెర్రస్‌ గార్డెన్‌లో అన్ని రకాల కాయగూర మొక్కలూ ఉన్నాయి. అలాగే స్థానికంగా పండేవీ ఉన్నాయి. సీజనల్‌ కాయగూరలు సైతం రేమా దగ్గర దొరుకుతాయి.

పచ్చిమిరపకాయలు, వంకాయలు, బెండకాయలు, టమోటాలు, పాలకూర, బీరకాయ, పొట్లకాయ, సొరకాయ, -ల్లిపాయ, బీన్స్‌, దోసకాయ, బ్రకోలి, కాలిఫ్లవర్‌, కేరట్‌, క్యాబేజి, ముల్లంగి ఇలా అన్నీ ఆమె టెర్రస్‌ గార్డెన్‌లో ఉన్నాయి. అంతేకాదు జామ, సీతాఫలం, సపోట, యాపిల్‌ వంటి పండ్లు , వివిధ రకాల నిమ్మకాయలు కూడా ఆమె టెర్రస్‌ గార్డెన్‌లో ఉన్నాయి. తన కుటుంబ అవసరాలకు పోను పండిన మిగతా కూరగాయలను విత్తనాలు వృద్ధిచేయడానికి ఉపయోగిస్తుంది. సోషల్‌ మీడియా ఫార్మింగ్‌ గ్రూపుల్లో తన దగ్గర ఉన్న విత్తనాలను రేమా అమ్ముతారు. అంతేకాదు తనతో వాట్సప్‌లో ఉన్న వాళ్లకీ వాటిని అమ్ముతుంటారు. రకరకాల కాయగూరలను బట్టి వాటి విత్తనాలను ఒక ప్యాకెట్‌ 20 రూపాయల నుంచి 40 రూపాయలకు రేమా అమ్ముతారు. ఇపుడు నెలకు కేవలం విత్తనాల అమ్మకం ద్వారా 60 వేల రూపాయలు రేమా సంపాదిస్తున్నారు. కేరళ రాష్ర్టంలోని పలు ప్రాంతాల నుంచి విత్తనాల కోసం ఆమెకి ఆర్డర్లు వస్తుంటాయి.
తన వంటిట్లోని వ్యర్థాలనంతా మొక్కల పెంపకానికి రేమా ఉపయోగిస్తారు. కోడిగుడ్డు పెంకలు, ఉల్లిపాయతొక్కలు, కాఫీ, టీ పొడి, మజ్జిగ, పుల్లబారిన పెరుగు, నీళ్లు, కొబ్బరిపాలు, చేపపొట్టు వంటి వాటినంన్నింటినీ సేంద్రియ ఎరువులుగా వాడొచ్చంటారామె. సులువుగా దొరికే వ్యర్థాలతో సేంద్రియ ఎరువులు, పురుగు మందులను కూడా రేమా తయారుచేస్తున్నారు. ఆవుపేడ, గోమూత్రం, ఎండించిన వేప ముద్దలు, పల్లీపొడి కేకులు. ఎండిన ఆకులు వీటన్నింటిని మిశ్రమంలా కలిపి పది రోజుల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత అందులో 100 గ్రాముల లైమ్‌ పౌడర్‌ కలిపి మళ్లీ ఐదురోజులు ఆ మిశ్రమాన్ని అలాగే ఉంచుతారు. తర్వాత 1:10 నిష్పత్తి నీటిలో వీటిని నానబెడతారు. ఇలా తయారుచేసిన మిశ్రమం మంచి సేంద్రియ ఎరువుగా పనిచేస్తుందంటారు రేమా.
ప్రతి ఒక్కరూ ఇంట్లో తమకున్న ప్రదేశంలోనే సేంద్రియ పద్ధతిలో మొక్కలు పెంచుకోవాలని రేమా అంటారు. మొక్కలు పెంచడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందంటారు ఆమె. నిజమే కదా..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News