Kidney Health: మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో మూత్రపిండాలు ఒకటి. ఇవి అనేక ముఖ్యమైన విధులను నిర్వహిస్తాయి. కిడ్నీలు రక్తాన్ని శుభ్రం చేస్తాయి. శరీరంలోని నీటి స్థాయిని సరిగ్గా ఉంచుతాయి. అలాగే ముఖ్యమైన ఎలక్ట్రోలైట్స్ సమతుల్యం చేయడం వంటి పనులు చేస్తాయి. ఈ మధ్య కాలంలో చాలామంది కిడ్నీ సమస్యల బారినపడుతున్నారు. దీనికి మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వంటివి ప్రధాన కారణాలు.
అందువల్ల, మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవడం మంచిది. కిడ్నీ సంబంధిత సమస్యలును లైట్ తీసుకుంటే కొన్నిసార్లు తీవ్రంగా మారవచ్చు. ఇది దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధికి (CKD) దారితీస్తుంది. అందువల్ల, కిడ్నీలకు మేలు చేసే ఆహారాలను ఆహారంలో చేర్చుకోవడం చాలా ముఖ్యం. అలాంటి కొన్ని ఆహారాల గురించి ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
నిమ్మకాయ: నిమ్మకాయను సాధారణంగా ఆహారం రుచిని పెంచడానికి ఉపయోగిస్తుంటాం. దీని పుల్లని రుచి చాలా మంది ఇష్టపడుతారు. అయితే, నిమ్మకాయ ఆహార రుచిని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మూత్రపిండాలను డిటాక్స్ చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే సిట్రిక్ ఆమ్లం కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నివారిస్తుంది. దీని ఆమ్ల స్వభావం శరీరంలోని ఆమ్ల పరిమాణాన్ని తగ్గిస్తుంది.
దోసకాయ: అధిక నీటి శాతం కలిగిన కూడిన దోసకాయ అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సాధారణంగా దోసకాయను సలాడ్‌గా తింటే శరీరం హైడ్రేటింగ్‌గా ఉంటుంది. తరచుగా దోసకాయ తింటే విష పదార్థాలు బయటకు వెళ్తాయి. ఇందులో పొటాషియం తక్కువగా ఉండటం వల్ల మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
వెల్లుల్లి: వెల్లుల్లి ఉందని వంటిల్లు ఉండదు. ఇది ముఖ్యమైన ఆహార పదార్థం. వెల్లుల్లి ఆహార రుచిని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మూత్రపిండాల కణాలను ఆక్సీకరణ ఒత్తిడి, వాపు నుండి రక్షిస్తాయి. వెల్లుల్లి లివర్, మూత్రపిండాలలోని ఎంజైమ్‌లను కూడా సక్రియం చేస్తుంది. ఇవి శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడతాయి.
పసుపు: ప్రతి భారతీయ వంటకంలో ఉపయోగించే ఆహార పదార్థం పసుపు. ఇది ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందింది. పసుపు ఆహారానికి రుచిని జోడించడమే కాకుండా, ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది బలమైన యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనం, ఇది విషపదార్థాలు, ఇన్ఫెక్షన్లు, దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కలిగే నష్టం నుండి మూత్రపిండాలను రక్షిస్తుంది.
పుచ్చకాయ: మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడానికి వేసవిలో ఆహారంలో పుచ్చకాయను చేర్చుకోవచ్చు. ఇది శరీరాన్ని హైడ్రేటింగ్ గా ఉంచడమే కాకుండా కిడ్నీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీనిని తినడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.


