Sunday, October 6, 2024
Homeహెల్త్Thick brow line: ఒత్తైన కనుబొమల కోసం..

Thick brow line: ఒత్తైన కనుబొమల కోసం..

కనుబొమల మీద ఏదైనా అప్లై చేసేటప్పుడు కళ్లల్లో పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్యాచ్ టెస్టు చేసుకోవాల్సిందే. దురద, దద్దుర్లు లేదా చర్మం మండుతుంటే వాడకండి

ముఖంలో ఎవరినైనా కట్టిపడేసేవి కళ్లు.. అయితే ఆ కళ్లని మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేసేవి కనుబొమలు. అవి అందంగా ఉంటే ముఖం అందం రెట్టింపు అవుతుందంటారు బ్యూటీ నిపుణులు కూడా. పలుచటి కనుబొమలు ఉన్న అమ్మాయిలు అవి ఒత్తుగా కనిపించేందుకు ప్రత్యేకంగా మేకప్ వేసుకుంటారు. ఇంకొందరు కనుబొమల వెంట్రుకలు పెరగడం కోసం మార్కెట్ లో దొరికే కాస్మొటిక్ ఉత్పత్తులను వాడుతుంటారు. చాలాసార్లు ఇవి వాళ్లు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో నిరాశకు గురవుతుంటారు కూడా. కనుబొమలు ఒత్తుగా, అందంగా కనిపించేందుకు ఇంటి చిట్కాలు కొన్ని ఉన్నాయి. వీటితో కనుబొమలు ఒత్తుగా పెరుగుతాయని సౌందర్య నిపుణులు సైతం అంటున్నారు.

- Advertisement -
90675134 – fenugreek with leaf in bowl on board top

అలాంటి చిట్కాలలో ఒకటి మెంతులు. ఇవి శిరోజాల పెరుగుదలకు ఎంతో మేలు చేస్తాయని చాలా మందికి తెలుసు. కనుబొమలు ఒత్తుగా పెరగడానికి కూడా మెంతులు బాగా ఉపయోగపడతాయి. కొన్ని మెంతులను తీసుకుని ఒక కప్పు నీళ్లల్లో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం లేచిన తర్వాత నానిన మెంతులను మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ పేస్టును కనుబొమలపై పూసి పది నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. తర్వాత చల్లటి నీళ్లతో కనుబొమలను కడుక్కోవాలి. ఇలా వారానికి ఒకసారి చొప్పున కొన్ని వారాలు చేస్తే మీ కనుబొమలు ఒత్తుగా పెరుగుతాయి. పాలు కూడా మీ కనుబొమలు ఒత్తుగా పెరగడానికి ఎంతగానో దోహదపడతాయి. పాలల్లో పలు రకాల ప్రొటీన్లు, విటమిన్లు ఉన్నాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి కనుబొమలకు కూడా ఎంతో మేలు చేస్తాయి. మీరు చేయాల్సిందల్లా ఒక బౌల్ లో పాలు తీసుకుని అందులో కాటన్ బాల్ ముంచి దానితో కనుబొమలపై, వాటి చుట్టూతా సున్నితంగా రాయాలి. ఇలా చేయడం వల్ల కనుబొమలు అందంగా తయారవుతాయి. కనుబొమల వెంట్రుకలు కూడా బాగా పెరుగుతాయి.

మరో చిట్కా ఆలివ్ ఆయిల్. ఇది జుట్టు పెరుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు కనుబొమలకు కూడా ఎంతో మేలు చేస్తుంది. రోజూ రాత్రి నిద్రపోయేముందు కొద్దిగా ఆలివ్ నూనెను వేళ్లతో కనుబొమల మీద రాసి పది లేదా పదిహేను నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా కొద్ది రోజులు చేస్తే కనుబొమలు ఒత్తుగా తయారవుతాయి. కనుబొమలు ఒత్తుగా చేసే రెసిపీ కూడా ఉంది. దీనిని ఇంట్లో సులభంగా చేసుకోవచ్చు. ఇందుకు ఒక టీస్పూను అల్లం రసం, ఒక టీస్పూను వెల్లుల్లిరసం, ఒక టీస్పూను అలొవిరా జెల్, ఒక విటమిన్ ఇ క్యాప్సూల్ రెడీ చేసుకోవాలి. మొదట అల్లం, వెల్లుల్లి నుంచి రసం తీసి విడిగా పెట్టుకోవాలి. అల్లం, వెల్లుల్లి రసం మిశ్రమంలో అలొవిరా జెల్ , విటమిన్ ఇ కాప్సూల్ ని వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్నిరెండు కనుబొమలపై అప్లై చేసి పదిహేను నిమిషాలపాటు అలాగే ఆరనివ్వాలి. ఆతర్వాత నార్మల్ వాటర్ తో కనుబొమలను శుభ్రంగా కడుక్కోవాలి. దీన్ని కనుబొమలపై అప్లై చేయడం వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్ ఏదైనా కనుబొమలలో ఉంటే పోతుంది.

స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా కనుబొమలపై జుట్టు పెరగదు. పైగా కనుబొమలపై ఉండే జుట్టు రాలిపోతుంది కూడా. ఈ రెసిపీలో వాడిన వెల్లుల్లిరసం స్కిన్ ఇన్ఫెక్షన్ పై ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. కారణం వెల్లుల్లిలో యాంటిఫంగల్, యాంటిబాక్టీరియల్ సుగుణాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే స్కిన్ ఎలర్జీలు ఉన్నవారు వెల్లుల్లిని వాడొద్దు. అలాగే సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు కూడా వెల్లుల్లికి దూరంగా ఉంటేనే మంచిది. అల్లంలో సిలికాన్ అనే కాంపౌండ్ ఉంది.ఇది శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు అల్లంలో జింకు ఉంది. ఇది చర్మం , శిరోజాలలో డ్రైనెస్ తలెత్తకుండా సంరక్షిస్తుంది. ఒకవేళ మీ కనుబొమల్లో చుండ్రు ఉంటే కూడా జుట్టు రాలిపోతుంది. అల్లం రసం వెంట్రుకలకు కండిషనర్ లా పనిచేస్తుంది కూడా. ఇకపోతే ఈ రెసిపీలో ఉపయోగించిన అలొవిరా జెల్ శిరోజాల పెరుగుదలకు ఎంతో తోడ్పడుతుంది.అంతేకాదు జుట్టును పట్టులా మ్రుదువుగా, సిల్కీగా ఉంచుతుంది. అయితే ఈ మిశ్రమాన్ని కనుబొమల మీద అప్లై చేసేటప్పుడు కళ్లల్లో పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మరవొద్దు. అలాగే ఈ రెసిపీని కనుబొమల మీద అప్లై చేసుకునే ముందు ప్యాచ్ టెస్టు చేసుకుంటే అది మీ చర్మానికి పడుతుందో లేదో తెలుస్తుంది. దురద, దద్దుర్లు లేదా చర్మం మండుతున్నట్టు అనిపిస్తే ఈ రెసీపిని కనుబొమలకు అప్లై చేయొద్దు. అలాగే ఈ రెసిపీని వాడితే వెంటనే ఫలితం కనిపిస్తుందని భావించవద్దు. దాని ప్రభావం కనుబొమలపై కనిపించడానికి కొంత సమయం పడుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News